Share News

మరింత హీటు..

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:12 AM

వేసవి ఎండల తీవ్రత పెరుగుతుండడంతో తూర్పు, దక్షిణ భారతాల్లోని అనేక ప్రాంతాలు వడగాడ్పుల గుప్పిట్లో చిక్కుకున్నాయి.

మరింత హీటు..

వడగాడ్పుల గుప్పిట్లో తూర్పు, దక్షిణ భారతం

మే 2 వరకు గాడ్పుల తీవ్రత

రాయలసీమ, కోస్తా, తెలంగాణాల్లో 44 డిగ్రీలకుపైగా నమోదు

మే 9 నాటికి మరింత పెరిగే అవకాశం

భారత వాతావరణ శాఖ హెచ్చరిక

అమరావతి, విశాఖపట్నం ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): వేసవి ఎండల తీవ్రత పెరుగుతుండడంతో తూర్పు, దక్షిణ భారతాల్లోని అనేక ప్రాంతాలు వడగాడ్పుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఇంకా తూర్పు భారతానికి ఆనుకుని మధ్య, ఉత్తరాదిలో పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో శుక్రవారం ప్రారంభమైన వడగాడ్పుల తీవ్రత వచ్చే నెల రెండో తేదీ వరకు కొనసాగుతుందని, తరువాత తొమ్మిదో తేదీ వరకూ మధ్యస్థంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకూ దేశంలో పరిస్థితులపై భారత వాతావరణ శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఈనెల 26 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు రాయలసీమలోని అనేక ప్రాంతాలు, కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో పలు ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, జార్ఖండ్‌లలో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదవుతాయని పేర్కొంది. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లో తూర్పు ప్రాంతం, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు నమోదవుతుందని తెలిపింది. ఈ వారంలో పశ్చిమ బెంగాల్‌లో అనేక ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లో వడగాడ్పులు వీస్తాయని, తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని తీర ప్రాంతాలు, కొంకణ్‌, గోవా, మేఘాలయ, త్రిపుర, అసోంలలో వేడి వాతావరణం, ఎండలు కాస్తాయని హెచ్చరించింది. వచ్చే నెల రెండు నుంచి తొమ్మిదో తేదీ వరకూ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ వరకు, ఒడిశా నుంచి తమిళనాడు వరకు, చత్తీ్‌సగఢ్‌ నుంచి గుజరాత్‌ వరకు వడగాడ్పులు ప్రభావం మధ్యస్థంగా ఉంటుందని పేర్కొంది. ఒకపక్క ఉష్ణోగ్రతలు పెరగడం, మరోవైపు గాడ్పులు వీయనున్నందున దేశంలో అనేక ప్రాంతాలు వేడెక్కుతాయి.

చాగలమర్రిలో 45.9 డిగ్రీలు

రాష్ట్రంలో ఎండ మరింత తీవ్రం కానున్నది. రానున్న రెండు రోజులు 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఉత్తరాంధ్రలోని కొన్ని మండలాల్లో 46-47డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. మరిన్ని మండలాల్లో వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకాశముంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 148 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం చూపనుంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శనివారం 77 మండలాల్లో తీవ్రంగా, 98 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. నంద్యాల జిల్లా చామలమర్రిలో రికార్డు స్థాయిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం. ఇక, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7, కడప జిల్లా ఖాజీపేట, మన్యం జిల్లా సాలూరులో 45.2, విజయనగరం జిల్లా గజపతినగరం, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.8, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.4, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీకాకుళం జిల్లా బూర్జలో 44.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు దక్షిణ ఛత్తీ్‌సగఢ్‌ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, మహారాష్ట్ర నుంచి కర్ణాటక, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

‘ఎండ మంట’కు బైక్‌ దగ్ధం

శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన

ధర్మవరం, ఏప్రిల్‌ 27: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మదీనా మసీదు వద్ద నిలిపిన ఓ ద్విచక్ర వాహనం ఎండ తీవ్రతకు మంటలు చెలరేగి దగ్ధమైంది. వాహనదారుడు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రోడ్డు పక్కన తన స్కూటర్‌ను పార్కింగ్‌ చేసి వెళ్లాడు. నీడ లేకపోవడంతో అధిక ఉష్ణోగ్రత కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వాహనం కాలి బూడిదైంది. ధర్మవరం పట్టణంలో శనివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - Apr 28 , 2024 | 09:02 AM