Share News

అమ్మ నిద్రపోతోందని..

ABN , Publish Date - Jan 08 , 2024 | 06:09 AM

అతడో మానసిక వ్యాధిగ్రస్థుడు. తల్లి మరణించిందనే విషయాన్ని కూడా గుర్తించలేకపోయాడు. ఆరు రోజులుగా మృతదేహం ఇంట్లో ఉంచుకునే జీవనం సాగిస్తున్నాడు.

అమ్మ నిద్రపోతోందని..

ఆరు రోజులుగా మృతదేహంతోనే కొడుకు జీవనం

మనసిక వ్యాధితో తల్లి మరణాన్నీ గుర్తించని స్థితి

విశాఖలో వెలుగులోకి

మద్దిలపాలెం (విశాఖపట్నం), జనవరి 7: అతడో మానసిక వ్యాధిగ్రస్థుడు. తల్లి మరణించిందనే విషయాన్ని కూడా గుర్తించలేకపోయాడు. ఆరు రోజులుగా మృతదేహం ఇంట్లో ఉంచుకునే జీవనం సాగిస్తున్నాడు. నిద్రపోతున్న తల్లిని లేపకూడదని భావించి, ఇంట్లో ఉన్న పళ్లు, కూరగాయలు తింటున్నాడు. రెండు రోజులుగా ఆ ఇంటి నుంచి దుర్గంధం వెలువడుతుండడం, ఆదివారం మరింత పెరిగిపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖ త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...పెదవాల్తేరు కురుపాం టవర్స్‌ ఫ్లాట్‌ నంబరు 203లో ఇనగంటి శ్యామల (67) తన కుమారుడు శరవణ కుమార్‌ (27)తో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త బాలసుబ్రహ్మణ్యం ఎల్‌ఐసీలో పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన కొద్ది సంవత్సరాల క్రితం మృతిచెందారు. శరవణ కుమార్‌ బీటెక్‌ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. తండ్రి మృతిచెందిన తర్వాత అతడు తీవ్ర మానసిక వ్యాధికి గురయ్యాడు.

దీంతో శ్యామల కుమారుడ్ని విశాఖ తీసుకొచ్చేశారు. భర్త మృతి అనంతరం వచ్చిన పరిహారం సొమ్ముతో ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా వారు నివసిస్తున్న ఫ్లాట్‌ నుంచి దుర్వాసన వస్తుండడంతో పక్క ఫ్లాట్‌లలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారంనాటికి దుర్గంధం మరింత పెరిగిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫ్లాట్‌కు చేరుకుని తలుపు తట్టగా, లోపలి నుంచి స్పందనలేదు. దీంతో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ సోఫాపై కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శ్యామల మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న కుమారుడు శరవణకుమార్‌.. తన తల్లి నిద్రపోతోందని, ఇంకా లేవలేదని, ఏం కావాలని ప్రశ్నించేసరికి పోలీసులు నివ్వెరపోయారు. ఇతను మానసికవ్యాధితో బాధపడుతున్నాడని అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఈ నెల ఒకటో తేదీన మృతిచెందినట్టు భావించారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు కేసునమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

Updated Date - Jan 08 , 2024 | 06:33 AM