బెంగళూరు ఎయిర్‌పోర్టులో.. మోహిత్‌రెడ్డి అరెస్టు!
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:30 AM
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు, మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్టయ్యారు.

కుమారులిద్దరితో దుబాయ్ బయల్దేరిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్‌పై లుకౌట్ నోటీసులు
ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు
ఏపీ పోలీసులకు సమాచారం
డీఎస్పీ సారథ్యంలో బెంగళూరు వెళ్లిన బృందం
నేడు తిరుపతికి తీసుకొచ్చి కోర్టులో హాజరు!
తిరుపతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు, మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్టయ్యారు. తండ్రి భాస్కరరెడ్డి, తమ్ముడు హర్షిత్‌తో కలసి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా శనివారం రాత్రి బెంగళూరు దేవనహళ్లి ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్‌రెడ్డి నిందితుడిగా ఉన్న నేపథ్యంలో మోహిత్‌పై ఆంధ్ర సిట్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బోర్డింగ్ పాస్ చెక్ చేసే సమయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఆయనతో పాటు దుబాయ్ వెళ్లాల్సిన భాస్కర రెడ్డి, హర్షిత్‌రెడ్డి కూడా ప్రయాణం విరమించుకుని మోహిత్ వెంటే ఉన్నారు. అధికారులతో భాస్కరరెడ్డి వాదనకు దిగడంతో తండ్రీకొడుకులు ముగ్గురినీ విమానాశ్రయంలోనే నిర్బంధించారు. మోహిత్‌రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచిన అనంతరం ఏపీ పోలీసులకు అప్పగించనున్నారు. తిరుపతి నుంచి ఈస్ట్ డీఎస్పీ రవిమనోహరాచారి, ఎస్వీయూ పోలీసు స్టేషన్ సీఐ మురళీమోహన్.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఏఆర్ పోలీసు బలగాలతో బెంగళూరు వెళ్లారు. మోహిత్‌ను అదుపులోకి తీసుకుని వీరు ఆదివారం వేకువజామున తిరుపతి చేరుకునే అవకాశముంది. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో న్యాయమూర్తి ఇంటివద్ద హాజరుపరుస్తారని అంటున్నారు. ఈ నేపఽథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. చెవిరెడ్డి నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
దుబాయ్ పారిపోయే యత్నమా?
ఎన్నికల్లో చంద్రగిరి పులివర్తి నానిపై కౌంటింగ్ కేంద్రమైన తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద హత్యాయత్నం జరిగింది. దీనిపై ఈసీ తీవ్రంగా స్పందించి దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో మోహిత్‌రెడ్డి నిందితుడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించి దొరికిపోయునట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మోహిత్ తన స్నేహితుడి పెళ్లికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లాలనుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. శనివారం బెంగళూరు నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్‌లో తండ్రి, తమ్ముడితో పాటు దుబాయ్‌కు టికెట్లు బుక్ చేసుకున్నారు. రాత్రి 8 గంటలకు ఆ విమానం ఎక్కాల్సి ఉండగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆదివారం ఉదయం పెళ్లికి హాజరై అదే రోజు రాత్రి 11.10 గంటల ఫ్లైట్‌కు తిరిగి బెంగళూరుకు ఫ్లైట్‌లో బయల్దేరేలా టికెట్లు బుక్ చేసుకున్నట్లు మోహిత్ సన్నిహితులు అంటున్నారు. సోమవారం బెంగుళూరు నుంచి తిరుపతి వచ్చి.. మంగళవారం నియోజకవర్గంలోని 1,800 మంది కార్యకర్తలతో షిర్డీ వెళ్లేందుకు ప్రత్యేక రైలు కూడా బుక్ చేశారని చెబుతున్నారు.