Share News

మోదీ, చంద్రబాబు పరస్పర అభినందనలు

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:21 AM

ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇక్కడి తన నివాసం నుంచి ప్రధాని మోదీకి చంద్రబాబు ఫోన్‌ చేశారు.

మోదీ, చంద్రబాబు పరస్పర అభినందనలు

ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలకు రావాలని అమిత్‌ షా ఆహ్వానం

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇక్కడి తన నివాసం నుంచి ప్రధాని మోదీకి చంద్రబాబు ఫోన్‌ చేశారు. జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి రాబోతున్నందుకు ప్రధానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. మోదీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన విజయాలకు చంద్రబాబును అభినందించారు. ఎన్నికల ఫలితాల తీరుతెన్నులపై వారిద్దరూ కొంతసేపు మాట్లాడుకొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కూడా ఫోన్లో మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించే నిమిత్తం బుధవారం ఢిల్లీ రావాలని చంద్రబాబును, అమిత్‌ షా ఆహ్వానించినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌ చంద్రబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి, అభినందనలు తెలిపారు.

కుటుంబంతో ఆనందం పంచుకొన్న చంద్రబాబు

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులతో కలసి చంద్రబాబు ఇక్కడి తన నివాసంలో ఎన్నికల విజయాన్ని పంచుకొన్నారు. విజయం ఖరారైన తర్వాత ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులతో కలసి చంద్రబాబు కేక్‌ కట్‌ చేశారు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌ దగ్గర ఉండి తన కుమారుడితో కేక్‌ కట్‌ చేయించారు. కార్యక్రమంలో లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి, ఆమె తల్లి వసుంధర, ఇతర దగ్గర బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ తన తల్లి భువనేశ్వరిని ఆలింగనం చేసుకొన్నారు. కుటుంబ సభ్యులందరితో కలసి చంద్రబాబు, భువనేశ్వరి గ్రూప్‌ ఫొటో దిగారు.

మధ్యాహ్నం వరకూ ఇంట్లోనే ఉన్న చంద్రబాబు

మంగళవారం మధ్యాహ్నం వరకూ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలోనే గడిపారు. ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన రాబిన్‌ శర్మ, ఆయన బృందంలోని కొందరు సాంకేతిక నిపుణులు, కొందరు పార్టీ కార్యాలయ సిబ్బందితో కలసి ఉదయం నుంచి లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. జిల్లాల నేతలతో మాట్లాడతూ ఓట్ల లెక్కింపు సరళిని తెలుసుకొన్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఆయన కాలుకదపకుండా కూర్చున్నారు. లోకేశ్‌ కూడా ఆ సమయంలో ఆయనతోనే ఉన్నారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను చంద్రబాబు నివాసానికి వచ్చి కలిసి వెళ్లారు. కాగా, ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో వార్‌ రూం ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న నేతలు... వర్ల రామయ్య, షరీఫ్‌, దేవినేని ఉమా, టీడీ జనార్దనరావు, కంభంపాటి రామ్మోహనరావు, ఆనం రమణారెడ్డి తదితరులు అక్కడే ఉన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 07:05 AM