Share News

ఎమ్మెల్యేలను పురుగుల్లా చూశారు!

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:10 AM

జగన్‌ అహంకారమే వైసీపీ ఓటమికి కారణమని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలను పురుగుల్లా చూశారు!

ముఖ్యమంత్రుల్లా ముగ్గురు రెడ్ల ప్రవర్తన.. జగన్‌ అహంకారమే ఓటమికి కారణం: వంశీకృష్ణ

మద్దిలపాలెం (విశాఖపట్నం), జూన్‌ 10: జగన్‌ అహంకారమే వైసీపీ ఓటమికి కారణమని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. సోమవారం శివాజీపాలెంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా అర్జీ తీసుకెళ్తే ధనుంజయరెడ్డే ముఖ్యమంత్రిలా వ్యవహరించేవారన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కనీస మర్యాద ఇవ్వకుండా పురుగును చూసినట్టు చూసేవారని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి...ఇలా పార్టీలో ఏ ఒక్క సీనియర్‌ నేత కూడా దిగువ స్థాయి నాయకులు, కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ముగ్గురు రెడ్లు సీఎంవోలో ముఖ్యమంత్రుల్లా ప్రవర్తిస్తుంటే జగన్‌ ఇంట్లో కూర్చుని బటన్లు నొక్కుకునేవారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అహంకారానికి వాడితే ఏం జరుగుతుందో ఈ ఎన్నికల్లో ప్రజలు చూపించారన్నారు. ఇసుక, మద్యం, పౌర సరఫరాలు ఇలా అన్ని వ్యవస్థలను వైసీపీ నాశనం చేసిందని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి నియంతల్లా ప్రవర్తించారని ఆక్షేపించారు. ప్రసాదరెడ్డి జగన్‌కు ఏజెంట్‌గా పనిచేసి ఉత్తరాంధ్రను నాశనం చేశారని ఆరోపించారు. ఏయూ ఉద్యోగులు, విద్యార్థులు వీసీపై చాలా ఆగ్రహంగా ఉన్నారని, కొంతకాలం ఆయన ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిదని స్పష్టం చేశారు. ఎంవీవీ సత్యనారాయణ బాధితులు తమ వద్దకు వస్తున్నారని, కూర్మన్నపాలెంలో ఎంవీవీ పార్క్‌ బాధితులు వచ్చి అర్జీ ఇచ్చారని చెప్పారు. సీఎన్‌బీసీ స్థలంలో ఎంవీవీ ఫ్లాట్లు కొనొద్దని తమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ ఆనాడే చెప్పారని, ఆ స్థలంలోని నిర్మాణాలు, అధికారులు ఇచ్చిన టీడీఆర్‌ బాండ్‌లపై చర్యలు ఉంటాయని తెలిపారు.

Updated Date - Jun 11 , 2024 | 08:08 AM