Share News

ఎమ్మెల్యే శ్రీదేవి నా భూమిని కబ్జా చేశారు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:08 AM

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆమె అనుచరుడు రఘుపతిరెడ్డిలు తన పొలాన్ని కబ్జా చేసి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్వయాన మేనల్లుడు, టీడీపీ జిల్లా నాయకుడు కేఈ కుమార్‌ ఆరోపించారు.

ఎమ్మెల్యే శ్రీదేవి నా భూమిని కబ్జా చేశారు

మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మేనల్లుడి ఆరోపణ

కర్నూలు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆమె అనుచరుడు రఘుపతిరెడ్డిలు తన పొలాన్ని కబ్జా చేసి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్వయాన మేనల్లుడు, టీడీపీ జిల్లా నాయకుడు కేఈ కుమార్‌ ఆరోపించారు. బుధవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్లూరు మండలం పెద్దపాడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 93/2లో 40 సెంట్లు తాను రంగారావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి 2016లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నానని తెలిపారు. ఈ పొలాన్ని పూజారి విజయలక్ష్మి అనే మహిళ 1988లో కొనుగోలు చేశారని, 1998లో ఆమె రంగారావు అనే వ్యక్తికి రిజిస్టర్‌ వీలునామా రాసి ఇచ్చిందని వివరించారు. 2011లో రంగారావు నుంచి ఆ పొలాన్ని తాను కొనుగోలు చేసి అగ్రిమెంట్‌ రాసుకున్నానని, 2016లో మొత్తం డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నానని తెలిపారు. ఆన్‌లైన్‌, అడంగల్‌, పాస్‌బుక్‌ రికార్డులు తన పేరిట ఉన్నాయన్నారు. ఇదే పొలం 2014లో రంగారావు తమకు విక్రయించి అగ్రిమెంటు చేయించారని మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ శమంతకమణి కోర్టును ఆశ్రయించగా.. తాను కూడా కోర్టును ఆశ్రయించానని తెలిపారు. ప్రస్తుతం ఈ భూ వివాదం కోర్టులో ఉందని చెప్పారు. ఈ పొలాన్ని మొదటగా కొనుగోలు చేసిన జయలక్ష్మి కుమారుడు పూజారి ప్రకా్‌షరావు అని, నకిలీ లీగలెయిర్‌ సర్టిఫికెట్లు సృష్టించి తన 40 సెంట్ల పొలాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆమె అనుచరుడైన వైసీపీ నాయకుడు రఘుపతిరెడ్డిలు వారి పేరిట పూజారి ప్రకాశ్‌రావు చేత అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు. అయితే.. పూజారి విజయలక్ష్మికి కొడుకులు లేరని, ఆమెకు ముగ్గురు కూతుళ్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. లేని కొడుకు ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె అనుచరుడు రఘుపతిరెడ్డిలు నా పొలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకొని ఆక్రమించుకున్నారన్నారు. తమ కుటుంబం రాజకీయంగా శ్రీదేవికి గట్టి పోటీ ఇస్తుండడంతో జీర్ణించుకోలేక తమ అనుచరులతో కలసి ఆర్థికంగా దెబ్బతీసేందుకే ఇలా అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు. అధికారులు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించిన పూజారి ప్రకాశ్‌రావు సహా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి, రఘుపతిరెడ్డి, సబ్‌ రిజిస్ట్రార్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 28 , 2024 | 12:08 AM