కబ్జా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:56 PM
ఆదోనిలోని అమరావతి నగర్‌లోని సర్వే నెం. 181/2, 182, 345లో ఉన్న కోట్లు విలువ చేసే రెండున్నర ఎకరాల ప్రభుత్వ మున్సిపల్ పార్కు స్థలాన్ని వైసీపీ నాయకుడు ఎర్రిస్వామి కబ్జా చేశారని ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడంతో ఎమ్మెల్యే పార్థసారఽథి, మున్సిపల్, రెవిన్యూ అధికారులు స్పందించారు.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
ఆదోని రూరల్ , జూలై 15 : ఆదోనిలోని అమరావతి నగర్‌లోని సర్వే నెం. 181/2, 182, 345లో ఉన్న కోట్లు విలువ చేసే రెండున్నర ఎకరాల ప్రభుత్వ మున్సిపల్ పార్కు స్థలాన్ని వైసీపీ నాయకుడు ఎర్రిస్వామి కబ్జా చేశారని ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడంతో ఎమ్మెల్యే పార్థసారఽథి, మున్సిపల్, రెవిన్యూ అధికారులు స్పందించారు. వెంటనే చర్యలు చేపట్టి అందులో నాటిన రాళ్లను తొలగించారు. సోమవారం ఎమ్మెల్యే పార్థసారఽథి మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డి ఇతర శాఖల అధికారులు స్థానికులతో కలిసి వైసీపీ నాయకుడు ఎర్రిస్వామి కబ్జా చేసిన మున్సిపల్ పార్కు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో విలాసవంతంగా విలువైన రెండున్నర ఎకరాల మున్సిపల్ పార్కు స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేసిన విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిందని, దీంతో చర్యలు ప్రారంభించామని పేర్కొన్నారు. నేటి నుంచి ఈ స్థలం మొత్తాన్ని శుభ్రం చేయించి కంచె వేసి స్థానికులు వాకింగ్ చేయడానికి, సేద తీరడానికి, విద్యార్థులు ఆటలు ఆడుకోవడానికి ఉపయోగపడేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారన్నారు. కబ్జాలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.