ప్రభుత్వ ఉపాధ్యాయుడి దందాలు!
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:33 AM
వైసీపీ నేతల భూ దందాలపై బాధితుల ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. గత పాలకుల భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని అనేక మంది టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు.

విజయసాయి అనుచరుడిగా ఉంటూ అకృత్యాలు
టీడీపీ గ్రీవెన్స్‌లో పందిగుట్టూరు వాసుల ఫిర్యాదు
అమరావతి, డిసెంబరు27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల భూ దందాలపై బాధితుల ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. గత పాలకుల భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని అనేక మంది టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో మంత్రి సంధ్యారాణి, రుడా చైర్మన్ వెంకటరమణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పందిగుట్టూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుచరుడిగా వ్యవహరిస్తున్న నిరంజన్‌రెడ్డి అక్రమాలు శ్రుతిమించాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడైన నిరంజన్‌రెడ్డి పాదగిరి స్వయంభూ పాతాళ వినాయకస్వామి ఆలయం పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. పైగా ఆలయాన్ని నిర్మించిన వారిని ఆలయంలోకి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆలయ నిర్మాతల పేరుతో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేయడమే కాకుండా ఆలయం చుట్టూ భూములను కబ్జా చేస్తున్నాడని ఫిర్యాదులు చేశారు. విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో అన్ని ఆధారాలతో 30ఏళ్లుగా తమ స్వాధీనంలో ఉన్న భూమిని కొట్టేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, పంట వేసుకుంటే రాత్రుళ్లు పైరును ధ్వంసం చేస్తున్నారని ఎల్.వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అధికారులను ఫిర్యాదు చేసినా, వైసీపీ నేతల వద్ద లంచం తీసుకుని, తమను పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోయారు. కర్నూలు జిల్లా పత్తికొండలో తాతల కాలం నుంచి సాగులో ఉండి, 2021 వరకు ఆన్‌లైన్‌లో తమ పేరుతో ఉన్న భూమిని 2022లో అక్రమంగా తన పేరు మీదకు మార్పించుకున్న వైసీపీ నేత లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని ఎం.మేరీ అనే మహిళ మొరపెట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వెలగలేరులో తమ ఆస్తులపై కన్నేసిన వైసీపీ నేతలు కె.వేణుబాబు, బి.లీలా కృష్ణారెడ్డి కబ్జాలకు అధికారులు సహకరిస్తున్నారని కె. భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
ప్రజావేదిక షెడ్యూల్
ఈ నెల 30 నుంచి జనవరి11 వరకు గ్రీవెన్స్‌లో పాల్గొనే మంత్రులు, నేతల షెడ్యూల్‌ను పార్టీ కార్యాలయం ప్రకటించింది. 30న మంత్రి సుభాష్, రాజశేఖర్ గౌడ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరావు, జనవరి 2న ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, 3న మంత్రి రవీంద్ర, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, రామ్మోహన్‌రావు, 4న మంత్రి నారాయణ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్యసేవ చైర్మన్ సుధాకర్, 6న మంత్రి అనిత, ఎమ్మెల్సీ శ్రీకాంత్, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ సత్తిబాబు, 7న మంత్రి రామానాయుడు, ఎమ్మెల్సీచిరంజీవి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభిరామ్, 8న మంత్రి ఫరూక్, ఏపీటీడీసీ చైర్మన్ బాలాజీ, ఏపీఎ్‌ససీపీసీ చైర్మన్ సుజాత, 9న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, చీఫ్ విప్ అనురాధ, ఏపీడబ్ల్యూసీఎ్‌ఫసీ చైర్మన్ గ్రీష్మ, 10న మంత్రి జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఆర్టీసీ చైర్మన్ నారాయణ, 11న మంత్రి కేశవ్, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీఆర్‌డీసీ చైర్మన్ నాగేశ్వరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.