అంతా నా ఇష్టం!
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:49 AM
ఏకంగా మూడు శాఖలను నిర్వహిస్తున్న ఆ ఉన్నతాధికారి ఏ శాఖలోనూ అమాత్యుల మాట వినడం లేదని చెబుతున్నారు.

మంత్రి గింత్రీ జాన్తానై.. మూడు శాఖలు ఆ ఐఏఎస్ చేతిలోనే..
నిర్ణయాల్లో పూర్తిగా ఏకస్వామ్యం.. ఏకపక్షంగా కీలక నియామకాలు..
సమీక్ష కోసం ఆయన చాంబర్‌కే మంత్రులు
సభలో ప్రశ్నలపై సహకరించని అధికారి
మంత్రుల సిఫారసులూ చెల్లని కాసే
బడుగు మంత్రులంటే చిన్నచూపు
వార్డెన్‌ను సైతం బదిలీ చేయించుకోలేని వైనం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఏకంగా మూడు శాఖలను నిర్వహిస్తున్న ఆ ఉన్నతాధికారి ఏ శాఖలోనూ అమాత్యుల మాట వినడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా ఆయన తీరు బడుగు మంత్రులను నిర్వేదంలోకి నెట్టేస్తోందని అంటున్నారు. నిజానికి, ఈయన గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. కూటమి సర్కారు వచ్చినతర్వాత తనకు ప్రాధాన్యత లేని శాఖలిచ్చారంటూ కొంతకాలం మధనపడ్డారు. ఆ తర్వాత అత్యంత కీలకమైన శాఖ పగ్గాలే ఆయనకు అందాయి. ఇప్పుడు చూస్తే.. ఏ మంత్రికీ సమయం కేటాయించలేనంత ‘బిజీ’ అయిపోయారు సారు. మంత్రులతో సమన్వయం చేసుకోవాల్సిన ఆ అధికారి ఏకస్వామ్యంగా వ్యవహరిస్తున్నారని, బడుగు మంత్రులం కావడంతో తమను చిన్నచూపు చూస్తున్నారని అంతర్గత సమావేశాల్లో ఆవేదన చెందుతున్నారు.
సభకు ఆయన రారు..
శాసనమండలిలో ప్రశ్నలు వచ్చినప్పుడు ఆయా శాఖలకు సంబంధించిన కార్యదర్శులు హాజరుకావడం ఆనవాయితీ. ఈ అధికారి మాత్రం ఒక్కసారి కూడా హాజరు కాలేదని, కింది స్థాయి ఉద్యోగులను పంపి సరిపెట్టారని చెబుతున్నారు. ఆ అధికారికి బడుగు శాఖలన్నా, తామన్నా లెక్కలేదని ఆ మహిళా మంత్రి... సీఎం, సీఎంపేషీ వద్ద వాపోయినట్లు సమాచారం. ఇప్పుడైతే అత్యంత కీలకమైన శాఖ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఏకంగా ఆ పెద్దశాఖ మంత్రే ఆయన చాంబర్‌కు వచ్చి సమీక్ష చేస్తుంటారని సమాచారం.
కోచింగ్‌లో ఇష్టారాజ్యం..
డీఎస్సీ కోచింగ్ కోసం అన్నీ సంక్షేమ శాఖల నుంచి నిధులను క్రోడీకరించి హడావుడిగా కోచింగ్ సంస్థలకు ఆ అధికారి మంజూరు చేశారు. ఆ తర్వాత నుంచి కోచింగ్ సెంటర్ ప్రారంభించడంలో శ్రద్ధ చూపడం లేదని, వాటి ఎంపికలో కూడా ఆ అధికారి ఇష్టారాజ్యంగా చేశారంటూ తమ అనుచరులతో మంత్రులు అంతర్గతంగా వాపోతున్నారని తెలిసింది.
ఆదేశించినా జరగని వార్డెన్ బదిలీ..
ఆయన చూస్తున్న మూడు శాఖల పరిధిలోని విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు ఓ రిటైర్డ్ అధికారిని నియమించారు. ఆ తర్వాత మూడు నెలలకే తొలగించారు. ఆయనను ఎందుకు నియమించారో, ఎందుకు తొలగిస్తున్నారో.. ఏదీ తనకు చెప్పలేదని ఓ మంత్రి వాపోయారు. ఓ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో టీడీపీ నేతకి గత ఎన్నికల్లో సమీకరణల కారణంగా సీటు దక్కలేదు. వార్డెన్‌గా పనిచేస్తున్న తన భార్య ట్రాన్స్‌ఫర్ కోసం మంత్రిని ఆయన కోరారు. ఆమెను బదిలీచేయాలని మంత్రి ఆదేశించారు. కానీ, .ఆ అధికారి పట్టించుకోలేదు. మంత్రిగా ఉండి కనీసం వార్డెన్‌ను కూడా బదిలీ చేసుకోలేని స్థితిలో తాను ఉన్నానంటూ తన సన్నిహితుల వద్ద వాపోయారు.