Share News

బకాయిలన్నీ చెల్లిస్తాం.. పనులు ప్రారంభించండి

ABN , Publish Date - Nov 08 , 2024 | 04:26 AM

రోడ్డు పనుల కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌ పెట్టిన బిల్లులను దశలవారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది.

బకాయిలన్నీ చెల్లిస్తాం.. పనులు ప్రారంభించండి

ఎన్‌డీబీ కాంట్రాక్టర్లతో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి భేటీ

పనుల ప్రారంభానికి సిద్ధమన్న కాంట్రాక్టర్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రోడ్డు పనుల కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌ పెట్టిన బిల్లులను దశలవారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. పనుల నిర్వహణలో తలెత్తే సాంకేతిక, ఇతర సమస్యలను కూడా సత్వర మే పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) నిధులతో చేపట్టే రహదారి ప్రాజెక్టుల పనులు ఇక ప్రారంభించాలని కాంట్రాక్టర్లను కోరింది. గురువారం ఇక్కడి ఆర్‌అండ్‌బీ భవన్‌లో ఎన్‌డీబీ కాంట్రాక్టర్లతో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఈఎన్‌సీ నయీముల్లా, ఉమ్మడి జిల్లాల వారీగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 2018లోనే సింగపూర్‌కు చెందిన ఎన్‌డీబీ నుంచి రాష్ట్రానికి రూ. 6,400 కోట్ల రహదారి ప్రాజెక్టుల రుణం మంజూరైంది. రెండు ప్రాజెక్టుల కింద పనులను విభజించారు. రాష్ట్ర, జిల్లా రహదారుల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి ఒక ప్రాజెక్టుగా.. వంతెనల నిర్మాణం రెండో ప్రాజెక్టుగా నిర్ణయించారు. అయితే, 2019లో ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించే సమయంలో ఎన్నికలు జరిగి జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్‌డీబీతో ఒప్పందాలు చేసుకుని అస్మదీయులకే వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెట్టింది. కానీ, పనులు చేయడానికి నిధులు ఇవ్వలేదు. దీంతో జగన్‌ను నమ్మి పనులు చేపట్టినవారు బిల్లులు రాక ఆర్థికంగా కుదేలై పనులను పూర్తిగా నిలిపివేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పనులపై సమీక్ష జరిపింది. తొలిసారిగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కాంట్రాక్టర్లతో సమావేశమై, వారి సమస్యలు తెలుసుకున్నారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో చేసిన తొలిదశ పనులకుగాను రూ. 225 కోట్లు విడుదల చేసినట్లుగా కాంట్రాక్టర్ల హర్షాతిరేకాల మధ్య మంత్రి బీసీ ప్రకటించారు. త్వరలో మరో విడత నిధులు కూడా ఇస్తామన్నారు. ఘోరంగా ఉన్న రోడ్లను బాగు చేసేందుకు వెంటనే పనులను ప్రారంభించి ప్రజలకు ఊరట కలిగించాలని మంత్రి కోరగా, కాంట్రాక్టర్లు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ కోరిక మేరకు పనులు ప్రారంభిస్తామని కాంట్రాక్టర్లు చెప్పారు. అయితే, తమకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.

Updated Date - Nov 08 , 2024 | 04:26 AM