Achchenna: కక్ష సాధింపు నా విధానం కాదు
ABN , Publish Date - Dec 22 , 2024 | 03:02 AM
‘వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేను ప్రత్యర్థులపై కొరడా ఝుళిపిస్తానని అందరూ భావించారు.

టెక్కలి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేను ప్రత్యర్థులపై కొరడా ఝుళిపిస్తానని అందరూ భావించారు. కానీ, కక్షసాధింపు చర్యలు నా విధానం కాదు. నాకు ఎవరిపైనా కోపమూ, ద్వేషము లేదు. కక్ష సాధిస్తున్నానని కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి. నేను తలచుకుంటే ఏ ఒక్కరూ మిగలరు. కోపం అనే పదమే నా నుంచి దూరమైంది. ఎవరైనా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని మంత్రి అచ్చెన్న అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఒక్క బీటీ, సీసీ రోడ్డు అయినా వేశారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.4,600 కోట్లు ఖర్చుపెట్టి ఊరూరా రోడ్లు వేస్తున్నాం. ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇస్తున్న రూ.6 వేలు, రాష్ట్రం నుంచి రూ.14 వేలుతో కలిపి రూ.20 వేలు అందిస్తాం. వైసీపీ నాయకుల ఆందోళనలో అర్థం లేదు. ఇటీవల రైతు ధర్నా అని ఎందుకు చేశారో వారికే తెలియదు. మా ప్రభుత్వం రైతు దగ్గర నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తుంది’ అని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు.