Share News

‘అసైన్డ్‌’లో మైనింగ్‌ అనుమతులా?

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:11 AM

అసైన్డ్‌ భూముల్లో మైనింగ్‌ చేసేందుకు అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అదేసమయంలో 2.8 ఎకరాల్లో మైనింగ్‌ అనుమతులు తీసుకుని ఏకంగా 60 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టడంపై విస్మయం వ్యక్తం చేసింది.

‘అసైన్డ్‌’లో మైనింగ్‌ అనుమతులా?

2.8 ఎకరాల్లో అనుమతులు తీసుకుని 60 ఎకరాల్లో తవ్వకాలు జరుపుతారా?

సర్వే చేసి నివేదిక సమర్పించండి

మైనింగ్‌ అధికారులకు హైకోర్టు ఆదేశం

నివేదికపై సందేహం వస్తే వాస్తవాలను న్యాయాధికారితో తేలుస్తామని స్పష్టీకరణ

సర్వే చేసేందుకు 3 వారాలు కోరిన ప్రభుత్వం

అంగారక గ్రహంపైకి వెళ్తున్నారా? అన్న కోర్టు

అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): అసైన్డ్‌ భూముల్లో మైనింగ్‌ చేసేందుకు అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అదేసమయంలో 2.8 ఎకరాల్లో మైనింగ్‌ అనుమతులు తీసుకుని ఏకంగా 60 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టడంపై విస్మయం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్‌పై వాస్తవాలు తేల్చేందుకు ఓ బృందాన్ని పంపించి సర్వే చేయించాలని మైనింగ్‌శాఖ అధికారులను ఆదేశించింది. అనంతరం పూర్తి వివరాలతో నివేదికను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. తప్పుడు నివేదిక ఇచ్చారని అనుమానం వస్తే.. వాస్తవాలు తేల్చేందుకు న్యాయాధికారులను పంపిస్తామని హెచ్చరించింది. ఉల్లంఘనలపై అవసరమైతే మైనింగ్‌శాఖ కార్యదర్శిని కోర్టుకు పిలిపించి వివరణ కోరతామని తేల్చి చెప్పింది. ఇసుక అక్రమ తవ్వకాలను నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) తీవ్రంగా పరిగణిస్తున్నట్లుంది కదా? అని ఆరా తీసింది. సంబంధిత కంపెనీకి ఎన్జీటీ రూ.1800 కోట్లు జరిమానా విధించిందని, ఏమీ జరగకుండా అంత మొత్తాన్ని ఎందుకు విధిస్తారని ప్రశ్నించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌. రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. ఈ దశలో ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. సర్వే చేసి నివేదిక సమర్పించేందుకు మూడు వారాలు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం ‘‘మీరేమీ అంగారక గ్రహం మీదకు వెళ్లడం లేదు కదా?’’ అని వ్యాఖ్యానించింది. రెండు వారాల సమయం సరిపోతుందని పేర్కొంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, వీరనాయకుని పాలెం గ్రామపరిధిలోని పలు సర్వే నెంబర్లలో ఉన్న 60 ఎకరాల డీకేటీ భూముల్లో గ్రావెల్‌ తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ ఎం. ప్రభుదాస్‌ హైకోర్టులో పిల్‌ వేశారు.

బుధవారం దీనిపై విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం స్పందిస్తూ.. ఇసుక అక్రమ తవ్వకాలను ఎన్జీటీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లుంది కదా? అని ప్రశ్నించింది. రూ.1800 కోట్లు జరిమానా వేసింది కదా అని వ్యాఖ్యానించింది. ఈ దశలో మైనింగ్‌ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. అంతమొత్తం జరిమానా విధించలేదన్నారు. ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు స్టే విధించిందన్నారు. తాజాగా ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారాన్ని ఎన్జీటీ సుప్రీంకోర్టు ముందు ఉంచిందన్నారు. ప్రస్తుత పిల్‌ గ్రావెల్‌కి సంబంధించిందన్నారు. అనుమతుల మేరకు మైనింగ్‌ జరుగుతోందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్రంలో అక్రమ మైనింగే జరగడం లేదని, అంతా సవ్యంగా ఉందని సానుకూల దృక్ఫథంతో ఉంటారని మైనింగ్‌ శాఖ జీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. అసైన్డ్‌ భూముల్లో మైనింగ్‌ అనుమతులు ఇవ్వడానికి వీల్లేదన్నారు. అందుకు చట్ట నిబంధనలు అనుమతించవన్నారు. 2.86 ఎకరాల్లో గ్రావెల్‌ మైనింగ్‌కి అనుమతులు తీసుకుని 60 ఎకరాల్లో తవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. అసైన్డ్‌ రైతులు తమ భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నారు. చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. పిటిషనర్‌ బాధితుడు కాదని తెలిపారు. తవ్వకాలపై అభ్యంతరం ఉంటే బాధితులు నేరుగా కోర్టును ఆశ్రయించాలన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. బాధితులకు స్థోమత లేని కారణంగానే పిల్‌ దాఖలు చేశారని పేర్కొంది.

Updated Date - Feb 29 , 2024 | 04:11 AM