Share News

ఖనిజ భూములు కొల్లగొట్టారు!

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:07 AM

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంలో ఇటిక్యాల, పెట్నికోట, తోళ్లమడుగు, నందిపాడు తదితర 14 గ్రామాల్లో 2,753.91 ఎకరాల మైనింగ్‌ భూమి ఉంది.

ఖనిజ భూములు కొల్లగొట్టారు!

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని మైనింగ్‌ భూములపై స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి కన్ను పడింది. ఆ భూములను తనవారికి ఇప్పిస్తే ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించాడు. ఉచితంగా ఇచ్చే బదులు.. ఎకరాకు ఇంత చొప్పున వసూలు చేస్తే డబ్బుకు డబ్బు.. భూములు పంచాడన్న పేరూ ఉంటుందని, ఓట్లు కురుస్తాయని ప్రణాళిక వేశాడు. ఆ భూములు మైనింగ్‌కు పనికిరావని, వ్యవసాయ యోగ్యమైనవని చూపితే భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాదని అధికారులకు సలహా కూడా ఇచ్చాడు. వారి సహకారంతో దాదాపు 2వేల ఎకరాలకు పైగా విలువైన ఖనిజ భూములను కొల్లగొట్టి తనవారికి బదలాయించేందుకు రంగం సిద్ధం చేశాడు.

నంద్యాల జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధి గలీజు దందా

కొలిమిగుండ్లలో మైనింగ్‌ భూముల పంపిణీకి భారీ స్కెచ్‌

క్వార్ట్జ్‌, లైమ్‌స్టోన్‌ వంటి ఖనిజాలు ఉన్నా దోచేసే పన్నాగం

సదరు నేత సూచనలు పక్కాగా అమలు చేసిన అధికారులు

20 రోజుల్లోనే 2,753.91 ఎకరాల్లో సర్వే

ఫైల్‌పై సంతకం కోసం అధికారులపై ఒత్తిడి

(నంద్యాల-ఆంధ్రజ్యోతి)

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంలో ఇటిక్యాల, పెట్నికోట, తోళ్లమడుగు, నందిపాడు తదితర 14 గ్రామాల్లో 2,753.91 ఎకరాల మైనింగ్‌ భూమి ఉంది. దీనిపై అధికార పార్టీ నాయకుడు కన్నేశాడు. ఈ భూముల్లో సిమెంటు తయారీకి సంబంధించిన క్వార్ట్జ్‌, లైమ్‌స్టోన్‌ వంటి ఖనిజాలు ఉండటంతో వీటిని అంత సులువుగా సొంతం చేసుకోవడానికి వీలుపడలేదు. దీంతో వాటిని మొదట అర్హులైన పేదలకు భూ పంపిణీ చేసి, తర్వాత కైవసం చేసుకోవచ్చని పథకం పన్నాడు. అనుకున్నదే తడవుగా తన నియోజకవర్గంలో ఫలానా వారు అర్హులు అంటూ లెటర్లు కూడా ఇచ్చేశాడు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.30వేల నుంచి రూ.లక్షకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఆయా గ్రామాల నుంచి దాదాపు రూ.8కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు వసూలు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. భూ పంపిణీ జరగాల్సిన సమయానికి కొందరు స్థానికులు మోసాన్ని గుర్తించి ఎదురు తిరిగారు. అవన్నీ ఖనిజ భూములని, సదరు వైసీపీ నాయకుడు అర్హులంటూ తేల్చినవారిలో కొంతమంది గతంలో ప్రభుత్వ భూములు పొందినవారని, మరి కొంతమందికి సొంత భూములున్నాయని, కొంతమంది ఏకంగా ఐటీ కడుతున్నారని నంద్యాల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ భూములను పంపిణీ చేస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా కోల్పోతుందని కోర్టులో కేసు కూడా వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.

మరో దారిలో...

సదరు వైసీపీ నాయకుడు వేసిన స్కెచ్‌ బూమరాంగ్‌ అవడంతో భూమి కోసం డబ్బులు ముట్టజెప్పిన వారంతా తిరిగి ఇచ్చేయమని అడిగినట్లు తెలుస్తోంది. ఆ ఉద్దేశమే లేని సదరు నేత మరో దారిలో భూముల పంపిణీకి సిద్ధమయ్యాడు. ఈ భూముల్లోని ఖనిజాలు పరిశ్రమలకు పనికిరావని చెప్పించి, ఆ తర్వాత అవి వ్యవసాయానికి అనువుగా ఉన్నాయని సర్వే చేయించి డబ్బులు ఇచ్చినవారికి కట్టబెడదామనుకున్నాడు. తదనుగుణంగా అధికారులను పురమాయించాడు. ఆయన కోరిందే తడవుగా రెవెన్యూ, మైనింగ్‌, వ్యవసాయ, సర్వే శాఖ అధికారులతో ఓ కమిటీ వేశారు. ముందుగా రెవెన్యూ అధికారులు కొలిమిగుండ్లలోని ఆయా గ్రామా ల్లో 2,753.91 ఎకరాలను గుర్తించి, ఇందులో ఖనిజాలు ఉన్నాయో? లేవో? గుర్తించమని సూచించారు. ఆ తర్వాత ఖనిజశాఖ అధికారులు ఈ మొత్తం భూమిలో 81.81 ఎకరాల్లో లైమ్‌స్టోన్‌, 2672.1 ఎకరాల్లో క్వార్ట్జ్‌ నిల్వలు ఉన్నాయి కానీ, అవి పరిశ్రమల అవసరాలకు పనికిరావని, ఇందులో 2,128.6 ఎకరాలు వ్యవసాయానికి అనువుగా ఉంది కాబట్టి ఆ భూములను పేదలకు ఇవ్వచ్చని రిపోర్టు ఇచ్చారు. ఇక వ్యవసాయ అధికారులు కూడా గుర్తించి సంతకం చేయడం ఒక్కటే మిగిలిపోయింది. దీంతో భూముల పంపిణీకీ బ్రేక్‌ పడింది.

అధికారులపై ఒత్తిడి...

కొలిమిగుండ్లలోని రెవెన్యూ, మైనింగ్‌, సర్వే శాఖ అధికారులు గుర్తించిన భూములు పూర్తిగా రాళ్లు, రప్పలు, పొదలతో నిండి ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం చేయాలంటే వాటిని తొలగించడానికి తీవ్రంగా శ్రమించాలి. ఆ తర్వాత రెండు మూడు అడుగుల మేర మట్టి వేసి, కొండ ప్రాంత వ్యవసాయ విధానాలు అనుసరిస్తే గానీ ఇక్కడ వ్యవసాయం సాధ్యంకాదు. ఈ విధంగా ఆయా శాఖల అధికారులే రిపోర్టు ఇచ్చారు. ఈ లెక్కన ఈ భూములు పూర్తిగా వ్యవసాయ యోగ్యం కాదని తెలుస్తోంది. దీంతో వ్యవసాయశాఖ అధికారులు సంబంధిత ఫైల్‌ మీద సంతకాలు చేయలేదు. తాను ఆదేశించినా సంతకం చేయకపోవడం ఏమిటని సదరు నేత వారిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఆయనకు తోడు జడ్పీ చైర్మన్‌ స్థాయి నాయకుడు కూడా యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీనికి తలొంచి విలువైన భూములు కట్టబెడితే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొవాల్సి వస్తుందని, గతంలో సీనియర్‌ ఐఏఎస్‌లకు పట్టిన గతే తమకూ పడుతుందని సదరు అధికారులు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. దీంతో మండల స్థాయి అధికారులు సెలవుపై వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

అన్నీ అనుమానాలే..

ఖనిజాలు ఉన్నాయని కేంద్రం గుర్తించిన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర అవసరాలకు వినియోగించకూడదు. అయితే ప్రస్తుతం వైసీపీ నేతలు ఆ భూముల్లోని ఖనిజాలు పనికిరావని గుర్తించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు కొలిమిగుండ్ల మండలంలో పెట్నికోట రెవెన్యూ గ్రామం సర్వే నం.1208/1లో 994.04 ఎకరాల్లో లైమ్‌స్టోన్‌ లీజుకు ఇస్తున్నట్లు 2011లోనే సంబంధిత యం త్రాంగం ప్రైవేటు వ్యక్తికి కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సర్వే చేసిన అధికారులు మాత్రం ఇందులో 470 ఎకరాలు వ్యవసాయానికి అనువుగా ఉన్నాయని రిపోర్టు ఇచ్చారు. ఇదే మండలంలోని ఇటిక్యాల గ్రామం సర్వే నంబరు 112-ఏలో 130.96 ఎకరాలు, 112-సీలో 630.32 ఎకరాలు వ్యవసాయానికి అనువుగా ఉన్నాయంటూ నివేదిక సిద్ధం చేశారు. ఈ ప్రాంతం పూర్తిగా రాళ్లు, కొండలతో వ్యవసాయ యోగ్యంగా లేదు. ఖనిజ నిల్వలున్న ప్రాంతం కావడంతో ఓ ప్రైవేటు కంపెనీ మరికొద్ది రోజుల్లో తమ సిమెంటు ఫ్యాక్టరీకి సంబంధించిన నాలుగో ప్లాంటును ఇక్కడ శంకుస్థాపన చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంది. అయితే వైసీపీ అధిష్ఠానంతో బేరసారాలు కుదరక వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆగమేఘాలపై నివేదికలు

ఈ ప్రాంతంలోని భూములు వ్యవసాయానికి అనువుగా ఉన్నాయో? లేదో? సర్వే చేయాల్సిన అధికారులు ఆఘమేఘాల మీద రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 8న అప్పటి కలెక్టరు సర్వే చేయాలంటూ ఆదేశించగా.. మైనింగ్‌ అధికారులు అదే నెల 25న అక్కడి భూములు మైనింగ్‌కు పనికి రావని, వాటిని ఇతర అవసరాలకు వాడుకోవచ్చంటూ నివేదిక తయారు చేశారు. ఇదే నివేదికపై రెవెన్యూ, మైనింగ్‌, సర్వే అధికారులు సంతకాలు చేసి ఫిబ్రవరి 23న కలెక్టరుకు నివేదిక సమర్పించారు. 14 గ్రామాల్లోని 2,753.91 ఎకరాల్లోని భూముల్లో ఖనిజాలు ఉన్నవీ లేనిదీ తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటిది 20రోజుల వ్యవధిలో ఆ భూముల్లోని అత్యధిక శాతం వ్యవసాయానికి అనువుగా ఉన్నాయని అధికారులు తేల్చేయడం ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూ పంపిణీ వ్యవహారాన్ని పూర్తిగా తమ స్వలాభం కోసం వాడుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని, అందుకే పైపైన సర్వే చేయిస్తూ భూములను కొట్టేయాలని చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 04:07 AM