Share News

అబద్ధాల మైండ్‌గేమ్‌!

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:31 AM

రాష్ట్ర ప్రజలు ఎవరికి ఓటేశారో ఇంకో 24 గంటల్లో తేలిపోనుంది. కానీ ఓటమి భయంతో వైసీపీ రకరకాల విన్యాసాలు చేస్తోంది. తామే గెలవబోతున్నామని ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

అబద్ధాల మైండ్‌గేమ్‌!

ఫలితాలపై జనంలోకి వైసీపీ సొంత సర్వేలు

గెలుపు జగన్‌దేనంటూ స్వాములు, సెఫాలజిస్టులతో జోస్యాలు

ఇప్పటికే ప్రజాభిప్రాయం ఈవీఎంలలో నిక్షిప్తం

4న గానీ జాతకాలు తేలవు

ఈలోపు పెద్దఎత్తున అసత్యాల ప్రచారం

మరోవైపు వైసీపీ అభ్యర్థుల్లో అలజడి

కనిపించిన రాయికల్లా మొక్కులు

కుటుంబాలతో గుళ్లకు వెళ్లి వేడుకోలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రజలు ఎవరికి ఓటేశారో ఇంకో 24 గంటల్లో తేలిపోనుంది. కానీ ఓటమి భయంతో వైసీపీ రకరకాల విన్యాసాలు చేస్తోంది. తామే గెలవబోతున్నామని ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. సొంత సర్వేలంటూ సామాజిక మాధ్యమాల్లో రోజుకొకటి ప్రచారంలో పెడుతున్నారు. ఇదే సమయంలో.. సొంత స్వాములు, జ్యోతిష్యులను.. సెఫాలజిస్టులపై టీవీ తెరపైకి తెస్తున్నారు. జగన్‌ జాతకానికి ఎదురేలేదని చెప్పిస్తున్నారు. తమ జాతకాలేమిటో ప్రజలు తేల్చేసి ఈవీఎం బటన్‌ నొక్కేశాక కూడా వారినే నమ్మించేందుకు వైసీపీ పెద్దలు చేస్తున్న ఫీట్లు చూసి జనం నవ్వుకుంటున్నారు. మే 13వ తేదీన రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. యువత, మహిళలు, వృద్ధులూ ఓటింగ్‌కు పోటెత్తారు. ఎవరు ఏ పార్టీకి మొగ్గు చూపారో ఎవరికీ అంతు చిక్కడంలేదు. మహిళా ఓటును నమ్ముకుందామంటే.. గతంలో ‘పసుపు-కుంకుమ’కు వారు లొంగలేదు. టీడీపీని ఓడించారు. యువత మనవారేనంటూ విశ్వసిద్దామంటే.. 108 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసేలా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. మూడింటికి మూడు స్థానాలూ టీడీపీ కైవసం చేసుకుంది. ఏటా ప్రకటిస్తామన్న జాబ్‌ కేలెండర్‌ వేయకపోవడం, ఎన్నికల ముంగిట మినీ డీఎస్సీ ప్రకటనతో యువత రగలిపోతోంది. ఓటింగ్‌కు పోటెత్తిన యువత తమపై యుద్ధాన్ని ప్రకటించారేమోనన్న ఆందోళన వైసీపీ పెద్దల్లో నెలకొంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వస్తాయి. ఫలితాల గడువు సమీపించేకొద్దీ అధికారపక్ష అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఓటమి భయం వెంటాడుతోంది. ఒకవేళ ఓడిపోతే.. గతంలో ప్రత్యర్థులపైకి పోలీసులను ఉసిగొల్పి పెట్టించిన కేసులు గుర్తుకొస్తున్నాయి. తమకూ అలాంటి గతే పడుతుందేమోనని వణికిపోతున్నారు. అందుకే దేవుడిపై భారం వేస్తున్నారు. కనిపించిన రాయికల్లా మొక్కుతున్నారు. సుదూరంగా ఉన్న ఆలయాలకు కుటుంబాలతో కలిసి వెళ్తున్నారు. గెలిపించాలని దేవుడిని వేడుకుంటున్నారు. పనిలోపనిగా శాంతులు, దోష నివారణ పూజలూ చేయిస్తున్నారు.

ఐ-ప్యాక్‌ నివ్వెరపోయేలా..

సీఎం జగన్మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లే ముందు విజయవాడలో ఐ-ప్యాక్‌ ఆఫీసుకు వెళ్లారు. వారు పడిన కష్టాన్ని గుర్తు చేసుకుని అభినందించారు. మళ్లీ వైసీపీదే అధికారమని.. 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను మించి గెలవబోతున్నామని ఆ బృందానికి చెప్పారు. ఆ బృందానికి మైండ్‌ బ్లాక్‌ అయింది. తామేదో చెబుదామనుకుంటే.. జగన్‌ ఏదో చెప్పారేంటని నివ్వెరపోయింది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటింగ్‌కు జనం పోటెత్తారని నిరాశానిస్పృహల్లో ఉన్న వైసీపీ అభ్యర్థులు, నేతల్లో ధైర్యం నింపేందుకే ఆయనా ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో రాష్ట్రం పూనకం వచ్చినట్లు ఊగిపోతుందని.. వైసీపీ శ్రేణుల్లో ఉత్తేజం వచ్చేస్తుందని.. ఈ జోష్‌ తాను విదేశాల నుంచి తిరిగి వచ్చేవరకు ఉంటుందని జగన్‌ ఆశించారు. కానీ ఈ ప్రయోగం ఫలించలేదు. వివిధ జాతీయ మీడియా సంస్థలు, విశ్లేషకులు, సెఫాలజిస్టులు నిర్వహించిన సర్వేల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తెలుస్తుందని వెల్లడించడంతో ప్రభుత్వ పెద్దలు కంగు తిన్నారు. వెంటనే సొంత సర్వేలను జనంపైకి వదిలింది. 117 నుంచి 150 స్థానాలు వైసీపీకేనని సోషల్‌ మీడియాలో ఊదరగొట్టినా జనం నమ్మడం లేదు. దీంతో స్వాములు రంగప్రవేశం చేశారు. కుప్పంలో చంద్రబాబుకు చాలా కష్టం.. పిఠాపురంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఓటమి ఖాయం.. మంగళగిరిలో మాత్రం లోకేశ్‌ గెలుస్తాడంటూ ఓ నయాస్వామి ముక్తాయిస్తున్నారు. నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈయన కేసీఆర్‌ గెలిచి తీరతారని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ఏమైందో అందరికీ తెలిసిందేనని.. కొన్నిగంటల్లో అస లు ఫలితాలే వస్తుంటే జగన్‌ అండ్‌ కో ఇలా గిమ్మిక్కు లు చేయడాన్ని రాజకీయ వర్గాలు ఎద్దేవాచేస్తున్నాయి.

Updated Date - Jun 03 , 2024 | 03:31 AM