Share News

మారేడుమిల్లిలో ‘షెకావత్‌’!

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:33 AM

‘పుష్ప’ సినిమాలో అటవీ అధికారి ‘షెకావత్‌’ గుర్తున్నాడు కదా! అయితే, ఈయన మారేడుమిల్లి అడవులను గుల్ల చేస్తున్న ‘షెకావత్‌’! దట్టమైన అడవిలోని భారీ టేకు చెట్లను నరికించేసి విక్రయిస్తున్నాడు. ఆర్నెళ్లలోనే వందల సంఖ్యలో భారీ వృక్షాలను నేలకూల్చి కలపను స్మగ్లింగ్‌

మారేడుమిల్లిలో ‘షెకావత్‌’!

అడవిలో చెట్లు నరికించి దర్జాగా విక్రయం

ఆరు నెలల్లోనే 450 భారీ వృక్షాల కూల్చివేత

ఆ కలప విలువ సుమారు రూ. 91 లక్షలు

శేషాచలంలో పనిచేస్తుండగా స్మగ్లర్ల టచ్‌లోకి

ఏడాది క్రితం మారేడుమిల్లికి.. దందా తీవ్రతరం

ఐఎఫ్‌ఎస్‌ అధికారి అక్రమాలు వెలుగులోకి

సెలవు పెట్టి వెళ్లిపోయిన అటవీ అధికారి

ఇద్దరు ఐఏఎస్‌లకూ బురద అంటించిన వైనం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘పుష్ప’ సినిమాలో అటవీ అధికారి ‘షెకావత్‌’ గుర్తున్నాడు కదా! అయితే, ఈయన మారేడుమిల్లి అడవులను గుల్ల చేస్తున్న ‘షెకావత్‌’! దట్టమైన అడవిలోని భారీ టేకు చెట్లను నరికించేసి విక్రయిస్తున్నాడు. ఆర్నెళ్లలోనే వందల సంఖ్యలో భారీ వృక్షాలను నేలకూల్చి కలపను స్మగ్లింగ్‌ చేయించాడు. గతంలో శేషాచలం ప్రాంతంలో స్మగ్లర్లతో చేతులు కలిపి అధికార పార్టీ నేతల అండదండలతో రెండు చేతులా భారీగా సంపాదించాడు. ఇప్పుడు మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేసేపనిలో పడ్డాడు. రాష్ట్ర అటవీ శాఖలో సంచలనం సృష్టిస్తున్న ఈ తతంగంపై అటవీశాఖ విచారణకు ఆదేశించగా ఆ అడవి దొంగ ఎవరో కాదు ఇంటి దొంగేనని బయట పడింది. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై అందుబాటులో ఉన్నంత సమాచారాన్ని సేకరించి వివరణ కోసం సంబంధిత అధికారిని పిలవగా, సెలవుపై వెళ్లిపోయారు. ఈ వ్యవహారం అరణ్య భవన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం మన్యం నుంచి గోదావరి జిల్లాల వరకూ వేలాది హెక్టార్లలో విస్తరించిన రంపచోడవరం అటవీ ప్రాంతంలో నాణ్యమైన, ఎత్తైన టేకు చెట్లు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సంరక్షించేందుకు డైరెక్ట్‌ ఐఎ్‌ఫఎస్‌ అధికారిని అక్కడ నియమించి అటవీ శాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఇటీవలి కాలంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ వృక్షాలు నేలకూలుతున్నట్లు అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారం వచ్చింది. శాఖలోని విజిలెన్స్‌ విభాగాన్ని అక్కడికి పంపించి ఉన్నతాధికారి నివేదిక తెప్పించారు. కేవలం ఆరు నెలల్లో 450కి పైగా భారీ వృక్షాలు నరికేశారని, వాటి మొదలు చుట్టుకొలత రెండు మీటర్ల వరకూ ఉందంటూ ఫొటోలు, వీడియోలతో సహా విజిలెన్స్‌ నివేదిక అందించింది. కలప విలువ సుమారు 91లక్షల రూపాయలు ఉంటుందని, మారుజాతి చెట్లు కూడా భారీగా కొట్టేశారని రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ విషయమై వివరణ అడిగేందుకు సంబంధిత ఐఎ్‌ఫఎస్‌ అధికారిని అరణ్య భవన్‌కు పిలవగా, ఆరోగ్య కారణాలు చూపించి సెలవుపై వెళ్లిపోయారు. కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘మాకు మేముగా ఎలాంటి తప్పూ చేయలేదు. ప్రతి నెలా మామూళ్లు ఇవ్వండి.. మీ ఏరియాలో మీరు ఏమి చేసుకుంటారో మీ ఇష్టం’’ అంటూ ఇబ్బందిపెట్టడంతో తప్పలేదని వాపోతున్నారు.

కలప కాంట్రాక్టర్ల ద్వారా..

దట్టమైన అడవిలో ఉన్న టేకు, మారుజాతి చెట్లు నరికించేసి కలప బయటికి తరలించడం అంత సులభం కాదు. గిరిజనులు తమ అవసరాల కోసం చెట్లు కొడితేనే అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తుంటారు. అలాంటిది బయలు ప్రాంతంలోకి కళ్లు గప్పి కలప తెచ్చే అవకాశమే ఉండదు. కలప వ్యాపారులు గిరిజన ప్రాంతాల్లోని రైతుల తోటల్లో ఉన్న చెట్లను కలప కోసం కొనుగోలు చేస్తుంటారు. వాటిని నరికేందుకు అటవీశాఖ నుంచి అనుమతి తీసుకుని ఏ సర్వే నంబర్‌ భూమిలో చెట్లు ఉన్నాయి.? ఏ రైతుకు అవి చెందినవి.? ఏ రకమైన చెట్లు.? అనే వివరాలు అందజేస్తారు. ఇదే అవకాశంగా కలప కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకుని రైతుల నుంచి తీసుకున్నట్లు చూపించి అటవీ ప్రాంతంలోని చెట్లను తరలించేశారు. విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడంతో మరింత లోతుగా అటవీ శాఖ కూపీ లాగుతోంది.

సిబ్బంది కన్నుగప్పి....

పొరుగు రాష్ట్రంలో జన్మించిన ఈ అధికారిని మన రాష్ట్రానికి ఐఎ్‌ఫఎ్‌సగా యూపీఎ్‌ససీ కేటాయించింది. కొండలు ఎక్కువగా ఉండే రాష్ట్రానికి చెందిన మరో మహిళా ఐఎ్‌ఫఎ్‌సను వివాహం చేసుకుని ఇద్దరూ ఇక్కడే సెటిలయ్యారు. అయితే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో పనిచేసే సమయంలో, తన దగ్గర పనిచేసే ఒక మహిళా గార్డు భర్తతో ఈయన స్మగ్లింగ్‌ సంబంధాలు నెరిపారు. ఆ వ్యక్తి ద్వారా ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకున్నారు. స్మగ్లింగ్‌ జరిగే వైపు ఉన్న సిబ్బందిని దారి మళ్లించి భారీగా సంపాదిస్తూ అందులో అధికార వైసీపీ నేతలకు కూడా పూర్తిగా సహకరించేవారు. వైసీపీ నేతల వాహనాలను వదిలేస్తూ.. తనకు డబ్బులిచ్చే వాటిని అడ్డుకోకుండా జాగ్రత్త పడేవారు. ఫలితంగా శేషాచలంలో ఉన్నన్ని రోజులూ ఎర్రచందనం ఆదాయంతో పండగ చేసుకున్నారు.

ఇద్దరు ఐఏఎ్‌సలకు బురద...

ఎర్రచందనం విరివిగా లభించే చోటు నుంచి ఏడాది క్రితం ఈ అధికారి మన్యం ప్రాంతానికి బదిలీ అయ్యారు. ఆర్నెళ్ల పాటు అక్కడి అడవిని, పరిస్థితులను చూసిన తర్వాత భారీ స్కెచ్‌ వేశారు. ఆ ప్రాంతంలో పనిచేస్తోన్న ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు కలప ఇస్తానని, మంచి ఫర్నీచర్‌ చేయించుకోండి అంటూ పంపించారు. ఆ తర్వాత తనపనికి ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించారు. విజిలెన్స్‌ విచారణలో ఈ విషయం బయట పడటంతో ’ఇదెక్కడి తలనొప్పి మాకు’ అంటూ ఆ ఐఏఎ్‌సలు తల పట్టుకున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 04:33 AM