మేనిఫెస్టో పక్కాగా అమలు చేయగలం
ABN , Publish Date - May 02 , 2024 | 05:03 AM
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో సహా అన్నీ బేరీజు వేసుకొనే కూటమి తన మేనిఫెస్టోను ఖరారు చేసిందని, అది అమలు చేయగలిగిన మేనిఫెస్టో అని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు
దోపిడీ, దుబారా అరికడితే చాలా డబ్బు ఆదా: యనమల
అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో సహా అన్నీ బేరీజు వేసుకొనే కూటమి తన మేనిఫెస్టోను ఖరారు చేసిందని, అది అమలు చేయగలిగిన మేనిఫెస్టో అని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తరహా దోపిడీని... దుబారాను అరికడితే వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
బుధవారం ఆయన ఇక్కడ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని వినాశనం నుంచి అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే ప్రయత్నాన్ని ఈ మేనిఫెస్టో ద్వారా చేశామని, అన్ని రంగాలు... అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.
‘రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకొని జేబులు నింపుకోవడానికి జగన్ ప్రయత్నించారు తప్ప ఖజానాకు ఆదాయం పెంచాలని, ప్రజలకు ఉపయోగపడాలని కోరుకోలేదు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో లభ్యమైన ఇసుకలో తొంభై శాతాన్ని ఆయన దోచుకొని జేబులు నింపుకొన్నారు. పది శాతం మాత్రమే అధికారికంగా విక్రయించారు. మేం ఈ దోపిడీకి కళ్లెం వేసేలా సమగ్ర విధానాన్ని తెస్తాం.
జగన్ ప్రభుత్వంలో దుబారాకు అంతే లేదు. వైసీపీ రంగులు వేయడానికి... తీయడానికి రూ.3వేల కోట్లు తగలేశారు. పదుల సంఖ్యలో సలహాదారులను పెట్టి వారి జీతభత్యాలకు, వైభోగాలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఈ దుబారాను అరికడితే ప్రభుత్వానికి ఏటా రూ. రెండు మూడు వేల కోట్లు మిగులుతాయి. జగన్ హయాంలో పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం రెండూ పెరగలేదు. జగన్ వ్యక్తిగత ఆదాయం మాత్రం పెరిగింది. వాణిజ్య పన్నుల్లో కోర్టు స్టేల కింద రూ. పది వేల కోట్ల ఆదాయం ఇరుక్కుపోయింది’ అని ఆయన వివరించారు.
పన్నులు పెంచకుండా మేనిఫెస్టో అమలు
మేనిఫెస్టో అమలు కోసం కొత్తగా ఏ పన్నులూ పెంచబోమని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. జీఎస్టీ విధానం వచ్చిన తర్వాత పన్నులు పెంచడం రాష్ట్రాల చేతుల్లో లేదని, కేంద్రంలోని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదంతోనే మొత్తం దేశమంతా పెంచాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ‘మద్యం, పెట్రోలు, డీజిల్ వంటి మూడు నాలుగు అంశాలపై మాత్రమే రాష్ట్రాలకు అధికారం ఉంది. చెత్త పన్ను, ఆస్తి పన్ను వంటివి పాలనా రుసుముల కిందకు వస్తాయి.
అవి రాష్ట్ర ప్రభుత్వానికి రావు. స్థానిక సంస్థలకు వెళ్తాయి. జగన్ ప్రభుత్వం వాటిని కొత్తగా వేసి తర్వాత స్థానిక సంస్థల నుంచి ఆ డబ్బును బలవంతంగా గుంజుకొంది. మేం అలా చేయం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్ను వాటా 41 శాతం నుంచి 40 శాతానికి తగ్గించారు. జగన్ ప్రభుత్వం దాని గురించి కూడా అడగలేకపోయింది. ఆ ఒక్క శాతం తిరిగి పెంచేలా చేయగలిగినా అదనంగా రూ. రెండు మూడు వేల కోట్లు వస్తాయి. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం వృద్ధి రేటు పది శాతం ఉంది. ఇప్పుడు అది మూడు నాలుగు శాతానికి పడిపోయింది. పాలనలో మాకు అనుభవం ఉంది. మేం ప్రజలను హింస పెట్టకుండా ఆదాయాన్ని పెంచాం. అభివృద్ధిని చూపించాం. పేద ప్రజలను ఆదుకొన్నాం’ అని ఆయన వివరించారు