Share News

స్టీల్‌ప్లాంట్‌ భూములు, ఆస్తులపై యథాతథ స్థితి పాటించండి

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:51 AM

విశాఖ ఉక్కు కర్మాగారం భూములు, ఇతర ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

స్టీల్‌ప్లాంట్‌ భూములు, ఆస్తులపై యథాతథ స్థితి పాటించండి

కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ప్రైవేటీకరిస్తున్నాం.. మూసివేయడం లేదు

అదనపు సొలిసిటర్‌ జనరల్‌ వివరణ

విచారణ జూన్‌ 19కి వాయిదా

స్టీల్‌ ప్లాంట్‌ ప్రయోజనాలు పరిరక్షించడం ముఖ్యం

బొగ్గు నిల్వల ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి

అదానీ పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం భూములు, ఇతర ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కర్మాగారంలో ఉన్న వంద శాతం కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు మాత్రమే ఉపసంహరిస్తున్నామని, స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించిన భూములు, ఇతర ఆస్తులు విక్రయించబోమని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎ్‌సజీ) బి.నరసింహ చెప్పిన వివరాలను నమోదు చేసింది. స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ, ఇతర వివరాలతో అదనపు అఫిడవిట్‌ వేసేందుకు కేంద్రానికి అనుమతిస్తూ విచారణను జూన్‌ 19కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎన్‌.విజయ్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు అనే వ్యక్తి వేర్వేరుగా పిల్స్‌ వేశారు. ఇవి ఇటీవల విచారణకు రాగా.. ఉక్కు కర్మాగారాన్ని ఏ చట్టాన్ని అనుసరించి ప్రైవేటీకరిస్తున్నారు.. ప్రైవేటీకరణ నిర్ణయానికి ముందు కర్మాగారం ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర స్టేక్‌ హోల్డర్స్‌ను సంప్రదించారా.. ప్రైవేటీకరణకు బదులు ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని కోరుతూ ముఖ్యమంత్రి రాసిన లేఖపై ఏం నిర్ణయం తీసుకున్నారంటూ కేంద్రానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. పూర్తి వివరాలతో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ వాజ్యాలు గురువారం మరోసారి విచారణకు వచ్చాయి.కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తి వివరాలతో అదనపు అఫిడవిట్‌ వేశామని కేంద్రం తరఫున ఏఎ్‌సజీ బి.నరసింహ, సీవీఆర్‌ రుద్రప్రసాద్‌ తెలియజేశారు. అయితే అందులో హైకోర్టు వేసిన ఏ ప్రశ్నకూ సమాధానం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. ప్రత్యామ్నాయాలు పరిశీలించాలంటూ ముఖ్యమంత్రి రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం రాశారని ఏఎ్‌సజీ చెప్పారు. ప్లాంట్‌ ఆస్తులు విక్రయిస్తున్నామన్న పిటిషనర్‌ ఆరోపణలో వాస్తవం లేదన్నారు. కర్మాగారంలో వంద శాతం కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు మాత్రమే ఉపసంహరిస్తున్నామని, స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన ఒక్క ఎకరం భూమిని గానీ, ఇతర ఆస్తులను గానీ విక్రయించడం లేదన్నారు. కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్నాం తప్ప మూసివేయడం లేదన్నారు. తాను చెప్పిన వివరాలు నమోదు చేయాలని అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. స్టీల్‌ ప్లాంట్‌ భూములు, ఇతర ఆస్తులు విషయంలో కోర్టు వేసవి సెలవులు ముగిసేవరకు యథాతథ స్థితి పాటిస్తారా అని ప్రశ్నించింది. అందుకు ఏఎ్‌సజీ సమ్మతించడంతో ఆయన చెప్పిన వివరాలను ధర్మాసనం నమోదు చేసింది. యథాతథ స్థితి పాటించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. అంతకుముందు పిటిషనర్ల తరఫున న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ... కేంద్రం చెప్పిన వివరాలు నమోదు చేసి వ్యాజ్యాలను వాయిదా వేస్తే అభ్యంతరం లేదన్నారు. ఉక్కు కర్మాగారానికి అవసరమైన నిధులను విదేశాల నుంచి తెచ్చేందుకు, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద ప్రత్యేక ఖాతా తెరిచేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదని స్వయంగా వాదనలు వినిపిస్తున్న (పార్టీ ఇన్‌ పర్సన్‌) కేఏ పాల్‌ తెలిపారు.

Updated Date - Apr 26 , 2024 | 04:51 AM