కొప్పర్తికి మహర్దశ
ABN , Publish Date - Jul 24 , 2024 | 05:01 AM
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేశారు.
కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలత
కడప, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా కొప్పర్తి పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. కడప జిల్లా పరిశ్రమలకు అనువైనది. దగ్గర లోనే బెంగళూరు, చెన్నై మెట్రో నగరాలున్నాయి. జాతీయ రహదారులతో పాటు కడప నుంచి రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. కృష్ణపట్నం, చెన్నై పోర్టులున్నాయి. ఏపీఐసీసీకి కడప శివారు పరిధిలో 9వేల ఎకరాల పైచిలుకు భూమి ఉంది. కొప్పర్తి పారిశ్రామికవాడ 6,914 ఎకరాల్లో ఉంది. ఇక్కడ ప్రస్తుతం 3,900 ఎకరాలు అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఇక్కడ డిక్సన్ కంపెనీ ఉత్పత్తులను కొనసాగిస్తోంది. 2,300 మందికి ఉపాధి కల్పిస్తోంది. మరికొన్ని రోజుల్లో గార్మెంట్, టీవీల తయారీ పరిశ్రమ మొదలు కానుంది. అయితే కొప్పర్తిలో గత ఐదేళ్లలో జగన్ సర్కారు మౌలిక వసతుల కల్పనలో వెనుకబడింది. పరిశ్రమలకు కీలకమైన నీటి సౌకర్యం కొప్పర్తిలో లేదు. గత ప్రభుత్వం తన వాటా నిధులు చెల్లించకపోవడంతో కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వెళ్లిపోయాయి. బ్రహ్మంసాగర్ నుంచి కొప్పర్తికి నీరందించేందుకు ప్రాజెక్టును చేపడితే బిల్లులు రాక పనులు నిలిచిపోయాయి. కొప్పర్తి పారిశ్రామికవాడలో సౌత్‌జోన్‌లో 2,595 ఎకరాల భూములున్నాయి. వీటిని వైజాగ్-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్‌లో భాగంగా అబివృద్ధి చేయనున్నారు. ఈ కారిడార్‌లో అవసరమైన రోడ్లు, నీరు, విద్యుత్, పరిశ్రమల వ్యర్థాల కోసం ప్రత్యేక ప్లాంటు, ఇతర వసతులు కల్పిస్తారు. ప్రస్తుతం వీసీఐసీ కారిడార్‌లో భాగంగా కొప్పర్తిలో అభివృద్ధి చేయనున్న భూములను కొట్టేసేందుకు గతంలో కడప ఆర్డీవోగా పనిచేసిన ఓ అధికారి సలహాదారు, అప్పటి ప్రభుత్వంలోని ముఖ్య అధికారి స్కెచ్ వేశారు. ఏపీఐఐసీకి తెలియకుండానే ఈ భూములను రైతుల పేరిట కాజేసే యత్నం చేశారు. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు వచ్చాయి. జగన్ సర్కారు పోయి చంద్రబాబు ప్రభుత్వం రావడంతో భూదందాకు బ్రేక్ పడింది.