Share News

టిడ్కో ఇళ్లపై మాయమాటలు!

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:34 AM

ఎన్నికల ముంగిట సొంత ఇళ్లు ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడానికి మంత్రులు, అధికారులు మాయమాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు.

టిడ్కో ఇళ్లపై మాయమాటలు!

తాళాలు, పత్రాలు ఇస్తామంటూ

నెల్లూరులో సభకు పిలిచి మొండిచేయి

తర్వాత ఇస్తామంటూ దాటవేత..

ఆగ్రహంతో ఇంటి పత్రాల చించివేత

నెల్లూరు రూరల్‌, ఫిబ్రవరి 14: ఎన్నికల ముంగిట సొంత ఇళ్లు ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడానికి మంత్రులు, అధికారులు మాయమాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు. ఇంటి పత్రాలిస్తాం రమ్మని పిలిచి.. తీరా వచ్చాక తర్వాత ఇస్తాం పొమ్మన్న సంఘటన నెల్లూరులో జరిగింది. ‘ఇల్లు ఇవ్వలేనప్పుడు ఇస్తామని పిలిపించడం ఎందుకు? కూలి పనులు చేసుకునే మేం.. ఆశగా వచ్చాం. తీరా వస్తే ఇల్లు సిద్ధం కాలేదంటున్నారు. ఇంటి పత్రాలు, తాళాలు ఇస్తామని చెప్పి మీటింగ్‌కు పిలుచుకోవాలా? మాకీ ప్రభుత్వం వద్దు... వాళ్లు ఇచ్చే ఇల్లూ వద్దు! ఎప్పట్నుంచో జగన్‌ను నమ్ముకుని ఉన్నాం. మాకే ఇల్లు రాలేదు. ఐదేళ్లుగా తిప్పించుకుంటున్నా రు ఆయనేమో(చంద్రబాబు) చెడ్డోడన్నారు.. మరి ఈయన(జగన్‌) చేసిన మేలేందో చెప్పమనండి’ అంటూ టిడ్కో గృహ లబ్ధిదారులు నిప్పులు చెరిగారు. నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో టిడ్కో గృహాలు పొందిన లబ్ధిదారులతో అల్లీపురం వద్ద బుధవారం భారీగా బహిరంగ సభను వైసీపీ నాయకులు, టిడ్కో అధికారులు ఏర్పాటు చేశారు. అక్కచెరువుపాడు, అల్లీపురం, వెంకటేశ్వరపురం, కల్లూరిపల్లి, ఇరగాల మ్మ సంఘం, కొండ్లపూడి ప్రాంతాలలో 15,502 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలు, పత్రాలు అందజేస్తామని, అల్లీపు రం టిడ్కో సముదాయం వద్ద బుధవారం జరిగే సభకు హాజరుకావాలని వలంటీర్లతో కబురుపెట్టారు. సుమారు 10 వేల మంది లబ్ధిదారులు హాజరయ్యారు. సభలో రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇద్దరు లబ్ధిదారులకు మా త్రమే జంబో తాళాలు, ఇంటి పత్రాలు అందించి వెళ్లిపోయారు. వారు వెళ్లాక పట్టాలు, తాళాలు ఇస్తామంటూ మభ్యపెడుతూ వచ్చిన అధికారులు.. ఆ తర్వాత తమ వద్ద తాళా లు, పత్రాలు లేవని, మరికొన్ని రోజులు ఆగితే సచివాలయాలకు పంపి అక్కడ అందజేస్తామని తీరిగ్గా చెప్పారు. దీనిపై లబ్ధిదారులు మండిపడ్డారు. పత్రాలను చించేశారు.

Updated Date - Feb 15 , 2024 | 03:34 AM