Share News

రాష్ట్రంలో మాఫియా రాజ్యం!

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:37 AM

రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికే తెలుగుదేశం, జనసేన

రాష్ట్రంలో మాఫియా రాజ్యం!

నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు పోతున్నాయి

అప్పుల కోసం రాష్ట్ర సచివాలయం, గనులూ తాకట్టు

ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వలేని దుస్థితి

ఇలాంటి పాలన మనకు అవసరమా?: పురందేశ్వరి

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 6: రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికే తెలుగుదేశం, జనసేన పార్టీలతో కూటమి కట్టామని చెప్పారు. రాజమహేంద్రవరంలో బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇసుక, మైనింగ్‌, మద్యం మాఫియాలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారని, ప్రజలకు విముక్తి కావాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని గుండెలు బాదుకోవడం కాదని, వారి సమస్యలపట్ల గుండె స్పందించాలని హితవు పలికారు. కవితకు కాదేదీ అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నారని, సీఎం జగన్‌ కబ్జాలు, అక్రమాలకు దేన్నీ వదలడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సచివాలయం, గనులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని, అప్పులేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు. నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, కుటుంబాలు ఛిద్రమై ఎంతోమంది చనిపోయారని, వారి బిడ్డలు అనాథలయ్యారని చె ప్పారు. ఇటువంటి పరిపాలన మనకు అవసరమా అని ఆమె ప్రశ్నించారు.

Updated Date - Apr 07 , 2024 | 03:37 AM