Share News

మా పొత్తు సూపర్‌హిట్‌

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:24 AM

టీడీపీ-జనసేన కాంబినేషన్‌ సూపర్‌హిట్‌. వైసీపీకి భయం మొదలైంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

మా పొత్తు సూపర్‌హిట్‌

చెడగొట్టేందుకు శతవిధాలా జగన్‌ యత్నాలు: బాబు

‘రా.. కదలిరా’ సభకు హాజరైన జనం, పార్టీల జెండాతో చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనదే గెలుపు. ఈ గెలుపును ఎవరూ ఆపలేరు. జనం ఉత్సాహం చూస్తుంటే జగన్‌ పని అయిపోయిందని తెలుస్తోంది.

హుద్‌హుద్‌ తుఫాను, తితలీ తుఫాన్లను చూశాం. రాబోయేది రాజకీయ తుఫాను.. ఇందులో జగన్‌ కొట్టుకుపోయి బంగాళాఖాతంలో కలవడం ఖాయం.

- చంద్రబాబు

మా గెలుపును ఎవరూ ఆపలేరు

అబద్ధాలు చెప్పడంలో జగన్‌ పీహెచ్‌డీ

పథకాలు రద్దుచేసి వేల కోట్లు దోపిడీ

పేదల ప్రతినిధినని చెప్పుకొంటున్నాడు

9 సార్లు కరెంటు చార్జీల పెంపు

పేదలపై రూ.65 వేల కోట్ల భారం

అయినా సిద్ధమని ప్రగల్భాలు

శ్రీకాకుళం ‘రా కదలిరా’ సభలో

టీడీపీ అధినేత ఆగ్రహం

శ్రీకాకుళం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ-జనసేన కాంబినేషన్‌ సూపర్‌హిట్‌. వైసీపీకి భయం మొదలైంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తమ మధ్య పొత్తు కుదరకుండా చెడగొట్టడానికి సీఎం జగన్‌ శతవిధాలుగా ప్రయత్నించాడని.. ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా కుట్రలు పన్నుతున్నాడని ధ్వజమెత్తారు. ‘రా కదలిరా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. పొత్తు తన కోసమో, పవన్‌ కల్యాణ్‌ కోసమో కాదని.. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సంక్షేమం కోసమేనని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టంచేశారు. ‘మా పొత్తును ప్రజలు ఆమోదించారు. మాకూ అవగాహన ఉంది. మధ్యలో మీకేంటి బాధ? కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. వైసీపీవి నీచ, చవట రాజకీయాలు. అందుకే ఆ పార్టీకి స్వస్తి పలకాలి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా అందరం కృషిచేద్దాం’ అని పిలుపిచ్చారు. జగన్‌ను ఉత్తరాంధ్ర ద్రోహిగా అభివర్ణించారు. జీవితంలో వాస్తవాలు చెప్పడని.. అబద్ధాలు చెప్పడంలో పీహెచ్‌డీ చేశాడని ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియాలో కుట్రలకు పాల్పడుతున్నాడని.. కులాల మధ్య చిచ్చుపెడుతున్నాడని దుయ్యబట్టారు. సైకో పాలనతో రాష్ట్రం నిరుద్యోగంలో నంబర్‌ వన్‌ అయిందన్నారు. ‘రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రత లేదు. చివరకు మీడియాకూ భద్రతలేదు. వారిపైనా దాడులు చేయిస్తున్నాడు. వారికి వ్యతిరేకంగా జీవో 243 తీసుకొచ్చాడు’ అని ధ్వజమెత్తారు. సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, మాజీ మంత్రులు కిమిడి కళావెంకట్రావు, గుండ అప్పలసూర్యనారాయణ, బండారు శ్రీనివాసరావు, కోండ్రు మురళీమోహన్‌, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, జనసేన నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

కొత్త నాటకాలు..

జగన్‌ కొత్తనాటకాలకు తెరతీశాడు. పేదల మనిషంట! వేల కోట్లను దోచుకుని.. పేదల పథకాలను రద్దుచేసి పేదల ప్రతినిధినని చెప్పుకొంటున్నాడు. నువ్వు ఏవిధంగా పేదల మనిషివి? ప్రజలను అంతం చేయాలని చూస్తున్న భస్మాసురుడివి. తొమ్మిది దఫాలు విద్యుత్‌ చార్జీలు పెంచావు. పేదలపై రూ.65 వేల కోట్ల భారం మోపావు. ఇందుకేనా సిద్ధమని ప్రగల్బాలు పలుకుతున్నావు. 24గంటలపాటు కరెంట్‌ ఇచ్చావా? రూ.20కోట్లతో బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు కొనుక్కున్నావు. హెలికాప్టర్లో తిరుగుతూ.. పోలీసులు, పరదాలను అడ్డుపెట్టుకుని ప్రజల్లోకి వస్తున్నావు. పేదలకు అన్నం పెడితే సహించలేక అన్నక్యాంటీన్లను తొలగించేశావ్‌. అప్పట్లో రూ.50ఉండే మద్యం క్వార్టర్‌.. రూ.200 చేసేశావు. నాసిరకం మద్యం విక్రయిస్తూ పేదల రక్తం తాగుతున్న నువ్వు పేదల ప్రతినిధివి ఎలాఅవుతావ్‌? మేం ఉచితం ఇసుకను ఇస్తే.. ఇప్పుడు మంత్రులు, మీ పార్టీ నాయకులు పంచుకుంటున్నారు. దొంగలని ఎవరిని అనాలి? చెత్తపైనా పన్నువేసి చెత్త ముఖ్యమంత్రి అనిపించుకున్నావు. ప్రతి కుటుంబంపై రూ.8లక్షల చొప్పున పరోక్షంగా భారం మోపావు. నీవాడే నాటకాల ముందర అప్పట్లో సురభి నాటకాలవారు కూడా పనికిరారు. ఉత్తరాంధ్రపై జగన్‌కు ఏవిధమైన ప్రేమా లేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని కొనసాగిస్తే గోదావరి, వంశధార నదుల అనుసంధానంతో నీటి ఎద్దడి ఉండేదికాదు. ఈ పథకం కోసం నేను రూ.2వేల కోట్లు కేటాయిస్తే.. జగన్‌ కేవలం రూ.5కోట్లు ఖర్చు చేశాడు. ఉత్తరాంధ్రలో ఒక్కో జిల్లాకు రూ.1.5కోట్లు మాత్రమే ఇచ్చాడు. తారకరామతీర్థసాగర్‌కు మేం రూ.284 కోట్లు కేటాయిస్తే... జగన్‌ రూ.54 కోట్లు ఖర్చుచేశాడు అంతే. తోటపల్లి ప్రాజెక్టు కోసం రూ.237 కోట్లు మేం విడుదల చేస్తే జగన్‌ కేవలం రూ.61 కోట్లు ఇచ్చాడు. వంశధార ఫేజ్‌ 2 కోసం మేం రూ.460 కోట్లు కేటాయిస్తే.. ఆయన విడుదల చేసింది జీరో. వంశధార-నాగావళి నదుల అనుసంధానం కోసం మేం రూ.145 కోట్లు కేటాయిస్తే.. ఈయన పైసా ఇవ్వలేదు. ఇటువంటి వ్యక్తులు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా? టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తాం.

వైసీపీకి అభ్యర్థుల్లేరు..

వైసీపీ తరఫున పోటీకి అభ్యర్థులు కూడా లేరాయె! మొన్నటివరకు ఒక్కో లిస్టు రిలీజ్‌ చేసేసి సిద్ధం అన్నాడు. ఇప్పుడు మాట మార్చి ఆ లిస్టుల్లోని వారు కేవలం నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు అని, అభ్యర్థులు కారని చెబుతున్నారు. నేను అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ పారదర్శకంగా ఉన్నా. శ్రీకాకుళం జిల్లా టీడీపీకి కంచుకోట. మళ్లీ మమ్మల్ని ఆదరించేందుకు జిల్లా ప్రజ సిద్ధంగా ఉన్నారు. వైసీపీ సభలో నాది, పవన్‌ ఫొటోలతో కటౌట్లు పెట్టించి వాటిపై దాడులు చేయించారు. మానసిక రోగులే ఇలాంటి పనులు చేస్తారు. మా సభలో జగన్‌ బొమ్మ పెట్టించి కొట్టించలేమా? అది సభ్యత కాదు. జగన్‌రెడ్డీ.. మీరు చొక్కా మడతపెడితే మా తమ్ముళ్లు కుర్చీలు మడతపెడతారు. నీకు కుర్చీ లేకుండా చేస్తారు. మిడిసిపడితే బట్టలు విప్పించి తరిమి కొట్టే ధైర్యం మా తమ్ముళ్లకు ఉంది. ఆడబిడ్డలు వీర వనితలుగా పసుపు జెండా పట్టుకుని ఝాన్సీ లక్ష్మీభాయి, రాణీ రుద్రమదేవిలా తయారవ్వాలి. అప్పుడే రాష్ట్రాన్ని, పిల్లల భవిష్యత్‌ను కాపాడుకోగలం. జగన్‌రెడ్డి పంచభూతాలు, రాష్ట్రాన్ని మింగేసిన అక్రమార్జునుడు. ఈ కలియుగ భస్మాసురుడిని వదిలించుకోవడానికి మా ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారు. సిగ్గు లేకుండా మీరే స్టార్‌ క్యాంపెయినర్లంటూ వలంటీర్లను బతిమాలుకుంటున్నాడు.

ఆ సుబ్బారెడ్డిని అరెస్టు చేసి ఉంటే

ఎవడో సుబ్బారెడ్డి అనేవాడు కడప నుంచి వచ్చి ఇక్కడి భూములను కొట్టేస్తాడని.. నేను కొట్టలేకపోతున్నానని రెవెన్యూ మంత్రి అధర్మాన బాధపడుతున్నాడు. ఆ సుబ్బారెడ్డిని అరెస్టు చేసి శ్రీకాకుళం జైలులో పెట్టి ఉంటే శభాష్‌ అనేవాడిని. కానీ అలా చేయడు ఈ అఽధర్మాన. బందిపోటు దొంగలు జగన్‌ రెడ్డి గ్యాంగ్‌. ఎక్కడ భూములుంటే.. ఎక్కడ గనులుంటే అక్కడ వాళ్లు వాలిపోతారు. వాళ్లను చూస్తే స్పీకర్‌, మంత్రులు వణికిపోతున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తానన్న జగన్‌.. గంజాయికి, నేరాలకు రాజధానిగా మార్చేశాడు. ఇక్కడున్న భూములు, వ్యాపారాలు, ఖనిజ సంపద మీద తప్ప ఉత్తరాంధ్రపై ఆయనకు ప్రేమే లేదు. విశాఖలో రూ.40 వేల కోట్ల భూములను కొట్టేశారు. రివర్స్‌ పాలనతో నిరుద్యోగం పెరిగిపోయింది. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే భోగాపురం విమానాశ్రయం, భావనపాడు పోర్టు పూర్తయ్యేవి. భావనపాడుకు రెండోసారి శంకుస్థాపన చేసి మూలపాడు అని పేరు మార్చాడు. విశాఖ నుంచి లులూ వంటి కంపెనీలు, మెట్రో పారిపోయాయి. రైల్వే జోన్‌కు భూములు ఇవ్వలేదు. నేను శంకుస్థాపన చేసిన ట్రైబల్‌ యూనివర్శిటీని పూర్తి చేయలేకపోయారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు.

Updated Date - Feb 27 , 2024 | 04:24 AM