Share News

ఎక్సైజ్‌లో విలాసాల ‘అధికారి’

ABN , Publish Date - Jan 08 , 2024 | 06:10 AM

ఆయనొక అనధికారిక అధికారి! రెగ్యులర్‌ ఉద్యోగి కాకపోయినా డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేషీలో చేరారు. సాంకేతికంగా ఎలాంటి అధికారాలు లేకపోయినా సర్వం నేనేనంటూ పెత్తనం చేస్తుంటారు.

ఎక్సైజ్‌లో విలాసాల ‘అధికారి’

విమాన టికెట్లు, హోటల్‌ రూమ్‌లు తరచూ బుక్‌ చేయాలంటూ ఒత్తిడి

జిల్లాల అధికారుల జేబులకు చిల్లు.. డిప్యూటీ సీఎంకు చెప్పలేక ఆవేదన

అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఆయనొక అనధికారిక అధికారి! రెగ్యులర్‌ ఉద్యోగి కాకపోయినా డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేషీలో చేరారు. సాంకేతికంగా ఎలాంటి అధికారాలు లేకపోయినా సర్వం నేనేనంటూ పెత్తనం చేస్తుంటారు. అంతటితో ఆగకుండా గత కొంతకాలంగా ఉన్నతాధికారుల స్థాయిలో సౌకర్యాలు కల్పించాలంటూ డిమాండ్‌ చేయడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆయన తరచూ బెంగళూరుకు వెళ్తుంటారు. ఆయన వెళ్లడానికి ముందే అక్కడ హోటల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, విమాన టికెట్లు బుక్‌ చేయాలని జిల్లాల ఎక్సైజ్‌ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అదేమంటే ఉపముఖ్యమంత్రి పేషీ అని బెదిరిస్తుండటంతో వేరే దారిలేక అయ్యవారు కోరినట్టు చేస్తూ అధికారులు తమ జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు. అలాగే ఆయన తిరుపతి వెళ్లినా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలకు వెళ్లినప్పుడు కూడా ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిందే. ఈ ఏర్పాట్లు చేయలేక జిల్లాల ఎక్సైజ్‌ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. అలాగని సదరు అధికారి ఆదేశాలను డిప్యూటీ సీఎం నారాయణస్వామికి చెప్పే ధైర్యం లేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతేడాది బార్‌ పాలసీ సమయంలోనూ సదరు అధికారే చక్రం తిప్పారు. విజయవాడలో బినామీల పేర్లతో 5 బార్‌ లైసెన్సులు దక్కించుకున్నారు. బార్ల కోసం తీవ్రంగా పోటీ ఏర్పడటంతో దరఖాస్తు ఉపసంహరించుకోమని ఎవరైనా డబ్బులు ఆఫర్‌ చేస్తారని ఆశించి దరఖాస్తు చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. చివరికి ఎవరూ ఎలాంటి ఆఫర్లు ఇవ్వకపోవడంతో ఐదు బార్లకు లైసెన్సు ఫీజును కట్టలేకపోయారు. ఇతరత్రా వ్యాపారుల విషయంలో కఠినంగా వ్యవహరించిన అధికారులు.. ఈయన బినామీల బార్లకు మాత్రం అడిగినంత సమయం ఇచ్చారు. చివరికి బార్లను వేరే వారికి అమ్మినట్లు తెలిసింది.

ఎన్టీఆర్‌ విగ్రహం పాక్షిక ధ్వంసం

పూతలపట్టు, జనవరి 7: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎగువ పాలకూరులో గుర్తుతెలియని వ్యక్తులు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు రాళ్లతో కొట్టగా పాక్షికంగా దెబ్బతింది. విగ్రహం కింద ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం పక్కనే ఉన్న చిత్తూరు పార్లమెంటు టీడీపీ ఎస్సీసెల్‌ అధికార ప్రతినిధి గురుస్వామి చిల్లర దుకాణానికి చెప్పులు, చీపుర్లతో మాలవేసి, ఆవుపేడ తెచ్చి దుకాణం ముందు పడేసి వెళ్లారు. ఎగువపాలకూరు దళితవాడకు చెందిన ఐదుగురు వైసీపీ వారిపై అనుమానంగా ఉందని గురుస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jan 08 , 2024 | 06:29 AM