Share News

22న అల్పపీడనం

ABN , Publish Date - May 19 , 2024 | 03:44 AM

ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.

22న అల్పపీడనం

వాయుగుండంగా మారుతుందని అంచనా

48 గంటల్లో అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు

1న కేరళను తాకుతాయని స్కైమెట్‌ అంచనా

పొడిగాలుల ప్రభావంతో

23 నుంచి 25 వరకు ఎండలు తీవ్రం

విశాఖపట్నం, అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తొలు త ఈశాన్యంగా పయనించి 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత మరింత బలపడుతుం దా? బలహీనపడుతుందా? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. భూ ఉపరితలం నుంచి అల్పపీడనం/వాయుగుండం వైపు పొడిగాలు లు వీస్తాయని, ఆ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఈనెల 23 నుంచి ఎండ తీవ్రత పెరిగి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. కోస్తాలో 25వ తేదీ వరకు వేడి వాతావరణం ఉంటుందన్నారు. దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఆ తరువాత 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే క్రమంలో నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఈనెల 31కల్లా కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే, జూన్‌ ఒకటినే కేరళను రుతుపవనాలు తాకుతాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ తెలిపింది. పసిఫిక్‌ మహా సముద్రంలో బలమైన ఎల్‌నినో బలహీనపడి ఈ నెలాఖరుకు తటస్థ పరిస్థితుల్లోకి మారుతుందని, ఆగస్టు నాటికి లానినాగా బలపడుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. అయితే, ఆ అంచనాల కంటే ఆలస్యం గా లానినా అభివృద్ధి చెందుతుందని స్కైమెట్‌ పేర్కొంది.


మరో మూడు రోజులు వర్షాలు..

తమిళనాడులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీ్‌సగఢ్‌ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఆ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల శనివారం వర్షాలు కురిశాయి. రాను న్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉం దని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లోని 30 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశమూ ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలోని 62 ప్రాంతాల్లో శనివారం పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో 67.7, ప్రకాశం జిల్లా కురిచేడులో 40.5, పల్నాడు జిల్లా దాచేపల్లి, సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 40, పల్నాడు జిల్లా నూజెండ్లలో 39.5, అల్లూరి జిల్లా పాడేరులో 34.2, నంద్యాల జిల్లా రుద్రవరం, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 27.5, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడప జిల్లా ఖాజీపేటలో 39.9, నెల్లూరు జిల్లా రాపూరులో 39.7, సూళ్లూరుపేటలో 39.6, నంద్యాల జిల్లా చాగలమర్రిలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 19 , 2024 | 07:00 AM