Share News

క్వార్ట్‌ లో కొల్లగొట్టారు!

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:17 AM

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అరుదైన ఖనిజం క్వార్ట్జ్జ్‌ను వైసీపీ నాయకులు అడ్డంగా కొల్లగొట్టిన వైనం బట్టబయలైంది. మొన్నటివరకూ ప్రభుత్వ పెద్దల భయానికి అక్రమ మైనింగ్‌ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించని మైనింగ్‌ అధికారులు,

క్వార్ట్‌ లో కొల్లగొట్టారు!

వైసీపీ నేతల దోపిడీ విలువ 350 కోట్లకు పైమాటే

అరుదైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారు

లక్షన్నర టన్నుల వరకూ విదేశాలకు ఎగుమతులు

మైనింగ్‌ అధికారుల తనిఖీల్లో విస్తుగొలిపే నిజాలు

టన్నుకు రూ.661 చొప్పున 10 కోట్ల పెనాల్టీ విధింపు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు

(నెల్లూరు-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అరుదైన ఖనిజం క్వార్ట్జ్జ్‌ను వైసీపీ నాయకులు అడ్డంగా కొల్లగొట్టిన వైనం బట్టబయలైంది. మొన్నటివరకూ ప్రభుత్వ పెద్దల భయానికి అక్రమ మైనింగ్‌ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించని మైనింగ్‌ అధికారులు, కేంద్రం ఆదేశాలతో ఇప్పుడు కదిలారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు జరిగిన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తూ జరిగిన దోపిడీని కొలతలు వేసి తేలుస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు లక్షన్నర టన్నుల వరకు క్వార్ట్జ్‌, ఫెల్‌స్పెర్‌ ఖనిజాలను అక్రమంగా తవ్వి తరలించినట్లు నిర్ధారించారు. ఇప్పటివరకు తరలిపోయిన ఖనిజం విలువ బహిరంగ మార్కెట్లో రూ.350 కోట్ల పైమాటే అని అంచనా వేస్తున్నారు. ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి తాడేపల్లి ప్యాలెస్‌ వరకు వాటాలు అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై మైనింగ్‌ శాఖ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. అవి మొత్తం పూర్తయితే ఇంకెంత దోపిడీ బట్టబయలవుతుందో చూడాలి.

ఇష్టానుసారంగా తవ్వకాలు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, సైదాపురం, రాపూరు, గూడూరు రూరల్‌ మండలాల్లో అరుదైన క్వార్ట్జ్‌ నిక్షేపాలున్నాయి. పొదలకూరు, సైదాపురం ప్రాంతాల్లో మరింత నాణ్యమైన ఖనిజం దొరుకుతోంది. ఈ ప్రాంతాల్లో అనుమతుల్లేకుండా తవ్వకాలు జరిపినందుకు మైనింగ్‌ శాఖ అధికారులు క్వార్ట్జ్‌ టన్నుకు రూ.661, ఫెల్‌స్పేర్‌ ఖనిజం టన్నుకు రూ.1,111 చొప్పున పెనాల్టీ వేస్తున్నారు. ఇప్పటివరకు రూ.10 కోట్లకు పైగా జరిమానా విధించారు. అందులో సింహభాగం క్వార్ట్జ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్వార్ట్జ్జ్‌ టన్ను ధర రూ.25 వేల వరకు పలుకుతోంది. దీని ప్రకారం ఇప్పటివరకు అక్రమంగా తరలించిన ఖనిజం విలువ సుమారు రూ.350కోట్ల వరకు ఉంటుంది. పొదలకూరు, సైదాపురం మండలాల్లో కోడ్‌ అమల్లోకి వచ్చాక 12వేల టన్నుల క్వార్ట్జ్జ్‌ ఖనిజాన్ని సీజ్‌ చేశారు. దీని విలువ రూ.30కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.

సోమిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం

గతేడాదికి ముందు వరకు క్వార్ట్జ్జ్‌ టన్ను రూ.2వేలు లోపే కొనుగోలు చేసేవారు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడటంతో టన్ను రూ.20వేల నుంచి 30వేల వరకు ధర పలికింది. దీంతో వైపీపీ నేతలు గద్దల్లా వాలిపోయారు. అప్పటికే లైసెన్స్‌ ఉన్న క్వార్ట్జ్‌ వ్యాపారులను బెదిరించి వారి వ్యాపారాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఒక్కో నేతకు ఒక్కో మండలాన్ని అప్పగిస్తూ తాడేపల్లి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. సైదాపురం మండలాన్ని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌కు, పొదలకూరు మండలాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి అప్పగించినట్లు ప్రచారం జరిగింది. గతేడాది అక్టోబరు నుంచి తవ్వకాలు ప్రారంభించి తవ్వితీసిన ఖనిజాన్ని దర్జాగా చెన్నైకు తరలించి అక్కడినుంచి విదేశాలకు ఎగుమతి చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టినా ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదు. నేరుగా మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి వాహనాలను పట్టుకొని సమాచారమిచ్చినా అక్కడకు వెళ్లేందుకు కూడా అధికారులు సాహసించలేదు. పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం, భారత్‌ మైన్లలో తవ్వకాలపై హైకోర్టు స్టే ఇచ్చినా లెక్కచేయకుండా అక్రమంగా క్వార్ట్జ్జ్‌ను తరలించారు. దీనిని గత డిసెంబరులో అడ్డుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సత్యాగ్రహ దీక్షకు కూర్చుకున్నారు. జీపీఎస్‌ ఫొటోలతో సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ (డీఎంజీ), కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. కానీ ఏ ఒక్కరూ స్పందించలేదు. దీంతో ప్రధాని మోదీ, కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి సోమిరెడ్డి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. స్పందించిన కేంద్ర గనుల శాఖ.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో జరుగుతున్న క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్‌పై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫలితంగా కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే జిల్లా అధికారులు కదిలారు. కొన్ని రోజులుగా అక్రమంగా మైనింగ్‌ చేసిన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మైనింగ్‌పై తనిఖీలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు రూ.10కోట్ల వరకు పెనాల్టీలు విధించినట్లు మైనింగ్‌ డీడీ శ్రీనివాసకుమార్‌ చెప్పారు.

Updated Date - Apr 04 , 2024 | 04:17 AM