Share News

శెట్టిబలిజలపై చిన్నచూపు!

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:43 AM

రాష్ట్రంలోని కొన్ని కులాలపై వైసీపీ ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోంది. బలిజ, తెలగ, కాపులు అంటే మొదట్నించీ జగన్‌కు చిన్నచూపు ఉంది.

శెట్టిబలిజలపై చిన్నచూపు!

ప్రాంతాలకతీతంగా 21 బీసీ కులాలకు రిజర్వేషన్‌ వర్తింపు

‘గ్రేటర్‌ రాయలసీమ’లో శెట్టిబలిజలకు వర్తించదంటూ మెలిక

ఆ ప్రాంతం ఎక్కడుందో అధికారులకే తెలియాలని విమర్శలు

టీడీపీకి మద్దతు పలుకుతున్నందుకేవివక్ష అంటూ ఆగ్రహం

బీసీ మంత్రి చెల్లుబోయిన వేణుదీ అదే సామాజిక వర్గం

ఆయన శాఖ నుంచే తాజా ఉత్తర్వుల జారీపై మండిపాటు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని కొన్ని కులాలపై వైసీపీ ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోంది. బలిజ, తెలగ, కాపులు అంటే మొదట్నించీ జగన్‌కు చిన్నచూపు ఉంది. గత ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్లు కోసం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి సిఫారసు చేస్తే దాన్ని జగన్‌ బహిరంగంగానే వ్యతిరేకించారు. కాపు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని బాహాటంగా ప్రకటించారు. ఈబీసీ రిజర్వేషన్లు 10శాతం కేం ద్రం ప్రకటిస్తే... అప్పటి చంద్రబాబు ప్రభు త్వం అందులో 5శాతం కాపులకు కేటాయించింది. అయితే జగన్‌ సర్కారు వచ్చిన వెంట నే కాపులకు ప్రత్యేకంగా కేటాయించిన రిజర్వేషన్‌ ఎత్తేయడంతో కాపు, బలిజ, తెలగ విద్యార్థులు, యువత విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా వర్గాలు జగన్‌ వైఖరిపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శెట్టిబలిజలపైనా జగన్‌ ప్రభుత్వం వివక్ష చూపుతున్నట్లు తాజాగా వెలుగు చూసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 139 బీసీ కులాలున్నాయి. వాటిలో కండ్ర కులాన్ని తొలగించడంతో 138 కులాలు జాబితాలో మిగిలాయి. అందులో 31 కులాలను కొన్ని ప్రాంతాలకు చెందినవారిని మాత్రమే బీసీలుగా గుర్తిస్తారు. అంటే ఫలానా ప్రాంతంలో ఫలానా కులం వాళ్లే బీసీలుగాను, మిగిలిన ప్రాంతంలో వారిని ఓసీలుగాను పరిగణిస్తారు. ఈ 31 కులాల్లో 10 తెలంగాణకు చెందినవి కాగా మిగిలిన 21 కులాల వారు మన రాష్ట్రంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కులాలు ఆయా నిర్దిష్టమైన ప్రాంతాల్లో కాకుండా ఇతరచోట్ల నివసిస్తుంటే వారికి బీసీ కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఉదాహరణకు మున్నూరు కాపు కులస్తులు రాష్ట్రంలో పరిమితంగా ఉంటారు. తెలంగాణ నుంచి 7 మండలాలు ఏపీలోకి బదిలీ అయినప్పుడు ఆ ప్రాంతంలో మున్నూరు కాపులు ఎక్కువగా ఉన్నారని, వారంతా రిజర్వేషన్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారని అప్పట్లో ఆందోళన చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం... ఆయా ప్రాంతాలకు సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 21 కులాలను ఎక్కడైనా బీసీలుగా పరిగణిస్తారని, వారికి ఎక్కడైనా కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని గతేడాది నవంబరులో ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే శెట్టి బలిజలకు మాత్రం రాష్ట్రమంతా కాకుండా కొన్ని ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చారు. గ్రేటర్‌ రాయలసీమ పరిధి మినహాయించి మిగతా రాష్ట్రమంతా బీసీలుగా కులధ్రువీకరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబరులో విడుదల చేసిన జీవోను గోప్యంగా ఉంచి సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా వెల్లడించారు.

అక్కసు అందుకేనా...?

తూర్పుగోదావరి జిల్లాలో శెట్టి బలిజల జనాభా ఎక్కువ. మిగిలిన ప్రాంతాల్లో అంతగా లేకపోయినా కూడా వివాహాలు, వలసల ద్వారా రాష్ట్రమంతా విస్తరించి ఉన్నారు. 21 కులాలను ప్రాంతాలకు అతీతంగా బీసీలుగా గుర్తించిన సర్కారు... ఒక్క శెట్టి బలిజలకు మాత్రం గ్రేటర్‌ రాయలసీమ పరిధిలో వర్తించదంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి బీసీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కూడా అదే కులానికి చెందినవారు. ఇప్పుడు ఆ శాఖే ఈ రకమైన ఉత్తర్వులు ఇవ్వడంలో మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గోదావరి జిల్లాలు టీడీపీకి కంచుకోట అనే ప్రచారం మొదటినుంచీ ఉంది. బీసీల్లో శెట్టి బలిజలు అంటే టీడీపీ వర్గాలేననే భావనతోనే ఈ విధంగా ఉత్తర్వులిచ్చారన్న అభిప్రాయాలున్నాయి.

గ్రేటర్‌ రాయలసీమ ఎక్కడుంది!

బీసీల కోసం తాజాగా ఇచ్చిన ఈ ఉత్తర్వుల్లో గ్రేటర్‌ రాయలసీమ అని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో గ్రేటర్‌ రాయలసీమ అంటే ఏయే ప్రాంతాలొస్తాయో ఎవరికీ తెలియదు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తే, తమకు గ్రేటర్‌ రాయలసీమ కావాలని రాయలసీమ ప్రాంత వాసులు డిమాండ్‌ చేశారు. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో గానీ, కేంద్రం దృష్టిలో గానీ గ్రేటర్‌ రాయలసీమ అనే పదమే లేదు. అయితే శెట్టి బలిజలను గ్రేటర్‌ రాయలసీమ మినహాయించి మిగిలిన ప్రాంతంలో బీసీలుగా గుర్తించాలని ఉత్తర్వులు ఇవ్వడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. శెట్టి బలిజల పట్ల ఎందుకంత అక్కసు అని నిలదీస్తున్నారు. 21 కులాలకు వర్తింపచేసిన జీవో తమకు గ్రేటర్‌ రాయలసీమలో వర్తించదన్న జగన్‌ సర్కారుపై శెట్టిబలిజ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Feb 13 , 2024 | 07:09 AM