Share News

ఒకవైపే చూడు!

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:14 AM

‘చూడు... ఒకవైపే చూడు! రెండో వైపే చూడకు! విపక్షంపై దాడులు జరిగితే అస్సలు పట్టించుకోవద్దు. అధికార పక్ష ఆస్తులకు చిన్న నష్టం జరిగిందా...

ఒకవైపే చూడు!

పట్టపగలు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినా దిక్కులేదు.. అర్ధరాత్రి మంత్రి రజిని ఆఫీసుపై రెండు రాళ్లు పడగానే హల్‌చల్‌

జగన్‌ జమానాలో ‘పోలీసు స్టోరీ’

సొంత నియోజకవర్గాన్ని వదిలి గుంటూరు వెస్ట్‌కు వలస

న్యూ ఇయర్‌ వేళ టీడీపీ అభిమానులపై కట్టడి

(గుంటూరు - ఆంధ్రజ్యోతి)

‘చూడు... ఒకవైపే చూడు! రెండో వైపే చూడకు! విపక్షంపై దాడులు జరిగితే అస్సలు పట్టించుకోవద్దు. అధికార పక్ష ఆస్తులకు చిన్న నష్టం జరిగిందా... ఇక రెచ్చిపోవడమే!’... జగన్‌ సర్కారు హయాం లో పోలీసుల వైఖరి ఇదే! టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై పట్టపగలు వైసీపీ మూకలు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే... పోలీసులు నిల్‌! కానీ... అర్ధరాత్రి పూట ఎవరో ఆకతాయిలు మంత్రి కార్యాలయంపై రెండు రాళ్లు విసరగానే పోలీసులు తమ పవర్‌ చూపించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని అక్కడ తిరిగి గెలవలేరనే ఉద్దేశంతో గుంటూరు పశ్చిమకు వలస వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు మూడు నాలుగు నెలలు ఉండగానే ఆమె తనకు ఓట్లేసి గెలిపించిన చిలకలూరిపేట ప్రజలకు గుడ్‌బై చెప్పేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉండే చోట, ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుటే ఒక అద్దె భవనంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జనవరి 1న ప్రారంభించేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. అయితే... ప్రతి ఏటా డిసెంబరు 31 అర్ధరాత్రి టీడీపీ అభిమానులు ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వచ్చి సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ. ఆదివారం అర్ధరాత్రి కూడా ఆ ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ... అక్కడ మంత్రి రజిని కొత్తగా ఆఫీసు పెట్టుకున్నారంటూ పోలీసులు హడావుడి చేశారు. టీడీపీ అభిమానులు అక్కడ గుమికూడకుండా అడ్డుకున్నారు. అయితే... అర్ధరాత్రి 12 వరకు టీడీపీ అభిమానులు అక్కడే ఉండి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. అక్కడ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఇద్దరు యువకులు... దూరం నుంచి పార్టీ కార్యాలయంపై రాళ్లు విసిరారు. దాంతో అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. రాళ్లు వేసింది నిజంగా టీడీపీ అభిమానులేనా అనేది కూడా తెలియదు. మద్యం మత్తులో ఆకతాయిలు చేసిన పని అనే అనుమానాలూ ఉన్నాయి. అయినా... పోలీసులు రెచ్చిపోయారు. రాళ్లు వేసిన వాళ్లను గుర్తించలేక ఆ దారిన పోయే వాళ్లందరిపైనా ప్రతాపం చూపించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. చివరికి... చర్చిలో ప్రార్థనలకు వెళ్లి వస్తున్న వారిపైనా లాఠీలు ఝుళిపించారు. న్యూ ఇయర్‌ రోజంతా వారిని తమ ఆధీనంలోనే ఉంచుకొని రాత్రికి కోర్టులో హాజరుపరిచి ఇంటికి పంపారు. ఆ చిన్నపాటి సంఘటనపైనే పోలీసులు 25 మందిపై కేసులు నమోదు చేశారు.

టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే..

డీజీపీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంపై గతేడాది పట్టపగలు వైసీపీ మూకలు దాడి చేశాయి. అయినా... పోలీసులు పట్టించుకోలేదు. డీజీపీ ఆఫీ్‌సకు ఫోన్‌లో సమాచారం అందించినా కొన్ని గంటలపాటు అటు వైపే రాలేదు. వైసీపీ అల్లరి మూకలు పార్టీ కార్యాలయ గేట్లను వాహనంతో ఢీకొట్టి పడేశారు. భవనంలోని అద్దాలను, ఫర్నిచర్‌ను, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఉద్యోగులను కూడా చితకబాదారు. విధ్వంసకారులు తమ పని తాము పూర్తి చేసుకుని వెళ్లిపోయారని నిర్ధారించుకున్నాకే... పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ ఘటనపై కొద్దిమందిపై నామమాత్రపు కేసు పెట్టి వదిలేశారు. ఆ కేసుకు ఇప్పటికీ అతీగతీ లేదు!

Updated Date - Jan 03 , 2024 | 07:41 AM