ఎక్మో చికిత్స ద్వారా ప్రాణదానం
ABN , Publish Date - May 26 , 2024 | 01:49 AM
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో తొలిసారిగా గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌లో ఎక్మో మెషీన్ చికిత్స అందుబాటులోకి తెచ్చారు.
రాష్ట్రంలో తొలిసారి ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌లో ‘ఎక్మో’
గుంటూరు (మెడికల్), మే 25: ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో తొలిసారిగా గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌లో ఎక్మో మెషీన్ చికిత్స అందుబాటులోకి తెచ్చారు. తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడికి ఎక్మోచికిత్స ద్వారా ప్రాణదానం చేశారు. శనివారం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వైద్యనిపుణులు ఈ కేసు వివరాలు తెలియజేశారు. ఇన్పోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల యువకుడికి ఇటీవల ఛాతి నొప్పి రావడంతో గుంటూరులోని రమేష్ హాస్పిటల్స్‌కు తరలించారు. యాంజియోగ్రామ్ చేయగా, గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం అయోర్టాలో వంద శాతం రక్తపు గడ్డలతో పూడుకుపోయినట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేసి రక్తపు పూడికలు తొలగించారు. అప్పటికే బాధితుడి గుండె పంపింగ్ తగ్గిపోవడం, కార్డియోజెనిక్ షాక్, పల్మనరీ ఎడీమా, రక్తపోటు తగ్గడం, మూత్రం తగ్గిపోవడం, గుండె అతి వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉండటంతో వెంటిలేటర్‌ను అనుసంధానం చేశారు. ప్రాణవాయువు సరిపోకపోవడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో రోగి మృతి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు ఆందోళన చెందారు. ఇటువంటి పరిస్థితిలో ఆఖరి ప్రయత్నంగా రోగిని ఎక్మో అనే ప్రాణాధార మెషిన్‌పై ఉంచి చికిత్స చేస్తే ఫలితం ఉండవచ్చని వైద్యులు చెప్పగా, కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం బాధితుడికి ఎక్మో మెషిన్‌ను అనుసంధానం చేశారు. కార్డియోజెనిక్ షాక్ నుంచి కోలుకున్న తర్వాత ఐదు రోజులకు ఎక్మో మెషిన్‌ను తొలగించారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ పీవీఎస్ హరిత మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఇంట్రా అయోర్టిక్ బెలూన్ పంప్ (ఐఏబీపీ) మెషిన్, ఎక్మో మెషిన్ వంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉండటంతో రోగి ప్రాణాలు సంరక్షించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి వైద్య సదుపాయాలు ఉన్న ఏకైక ఆసుపత్రి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మాత్రమేనని స్పష్టంచేశారు. చికిత్స అందించిన వైద్య బృందంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ రామారావు, సీటీ సర్జన్లు డాక్టర్ జయరామ్ పాయ్, డాక్టర్ శివప్రసాద్, క్రిటికల్ కేర్ ఫిజీషియన్ డాక్టర్ శిల్పా చౌదరి, ఎక్మో స్పెషలిస్ట్ డాక్టర్ బికా్‌ససాహు తదితరులు ఉన్నారు.