‘ల్యాండ్ టైటిలింగ్’పై అచ్చోసిన అబద్ధాలు
ABN , Publish Date - May 12 , 2024 | 04:08 AM
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో అది ఎన్నికల్లో తీవ్రనష్టం చేస్తుందనే ఆందోళన అధికార పార్టీని వెంటాడుతోంది.

చట్టం అమల్లోనే లేదంటూ రోత పత్రిక రాతలు
ప్రభుత్వం ప్రకటన మాత్రమే ఇచ్చిందని వివరణ
అమలుకు నోటిఫికేషన్ ఇవ్వలేదని సమర్థింపులు
జీవో 512, 630ల గురించి మరిచారా సీఎం గారూ?
చట్టం అమలుకు ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేయలేదా?
24 రాష్ట్రాల్లో చట్టం అమల్లో ఉందని సజ్జల బొంకులు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అంటూ కవరింగ్‌కు పాట్లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో అది ఎన్నికల్లో తీవ్రనష్టం చేస్తుందనే ఆందోళన అధికార పార్టీని వెంటాడుతోంది. చట్టం రైతు వ్యతిరేకి అని ముద్రపడటంతో ఆత్మరక్షణలో పడిన జగన్ సర్కారుకు వెన్నుదన్నుగా రంగంలోకి దిగిన జగన్ రోతపత్రిక అచ్చోసిన అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఒకవైపు ఆ చట్టం మంచిదని చెబుతూనే.. ఇంకా అది అమల్లోకే రాలేదని, రైతులు భయపడొద్దంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ చట్టం ప్రమాదకరం కాదని చెప్పడానికి అడ్డమైన అసత్యాలను ప్రచారంలోకి తీసుకొచ్చింది. చట్టం అమలుకు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదని, అది ఇవ్వకుండా ఏ చట్టం అమలుకాదని, కోర్టులకు వెళ్లవచ్చంటూ ఫక్తు అబద్ధాలతో పెద్ద వార్తనే అచ్చేసింది. ఇక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే వర్తమాన అంశాలపై ఏమాత్రం స్పృహ లేకుండా మాట్లాడారు. టైటిలింగ్ చట్టం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమల్లో ఉందని, దేశంలో 24 రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయని సెలవిచ్చారు.
చట్టం అమల్లో లేదా?
‘టైటిలింగ్ చట్టాన్ని ఇంకా అమలు చేయడం లేదు. అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనే ఇచ్చింది. అమలుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు’ అని సీఎం రోత పత్రికలో అచ్చేశారు. ఇది పచ్చిఅబద్ధం. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వచ్చింది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం జీవో 512. ఈ చట్టం 2023 అక్టోబరు 31 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా సర్కారు గతేడాది నవంబరు 1న జీవో 512ను విడుదల చేసింది. తర్వాత ఆ జీవోనే గజిట్ నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. ఈ జీవోను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. కానీ, ఈ జీవో కాపీని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాతే టైటిలింగ్ చట్టం అమలులో వెనక్కు తగ్గాలని, చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ రైతు, ప్రజాసంఘాలు ఆందోళనలను ఉధృతం చేశాయి. అదే సమయంలో న్యాయవాద సంఘాలు కూడా ఉద్యమిం చాయి. ఈ జీవో గురించి సీఎం జగన్‌కు తెలియదా? ఆయనకు తెలియకుండానే ప్రభుత్వం జీవో ఇచ్చిందని, రెవెన్యూ శాఖ గజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిందని అనుకోవాలా? చాన్సే లేదు. ఒకవేళ ఈ చట్టం అమల్లో లేదని నమ్మాలంటే, జీవో 512ని సర్కారు ఉపసంహరించుకోవాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఆ పనిచేయలేదు. అలాంటి ఉత్తర్వు ఇచ్చి ఉంటే ప్రభుత్వం ఈపాటికి ఎప్పుడో బయటపెట్టేది.
జీవో 630ని మర్చిపోయారా?
టైటిలింగ్ చట్టం అమలులో కీలకమైన రాష్ట్రస్థాయి ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కారు గత డిసెంబరు 29న జీవో 630 జారీ చేసింది. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) ఛైర్‌పర్సన్‌గా, సర్వే కమిషనర్ ల్యాండ్ అథారిటీ కమిషనర్‌గా, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఐ జీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల కమిషనర్లు సభ్యులుగా ఉంటారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ జీవో గురించి కూడా జగన్ మర్చిపోయారా? చట్టం అమల్లోకి రాకుండానే ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేశారా? నిజానికి ఆ తర్వాత జిల్లాల వారీగా ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ అధికారుల నియామకానికి కసరత్తు చేశారు. ఎవరెవరిని, ఏ పోస్టులో కూర్చోబెట్టాలో లెక్కలు వేశారు. అయితే, హైకోర్టులో కేసు రావడంతో సర్కారు తోక ముడిచింది. వాస్తవాలు ఇలా ఉంటే, చట్టమే అమల్లోకి రాలేదని చెప్పడం నయవంచన కాక మరేమిటి?
కోర్టులకూ వెళ్లొచ్చట...!
టైటిలింగ్ చట్టం ద్వారా రైతులకు ఇబ్బందులొస్తే కోర్టులకు వెళ్లవచ్చని సీఎం రోతపత్రిక చెబుతోంది. ఇది కూడా పచ్చి అబద్ధమే. ఈ చట్టం ద్వారా భూ వివాదాలు వస్తే ల్యాండ్ టైటిల్ అప్పిలేట్ అధికారి ముందు మాత్రమే పరిష్కరించుకోవాలని, సివిల్ కోర్టులకు వెళ్లడానికి వీల్లేదని చట్టంలోనే పొందుపరిచారు. అక్కడా న్యాయం దొరక్కపోతే ల్యాండ్ అథారిటీకి, అంతిమంగా హైకోర్టుకే వెళ్లాలి. కానీ సివిల్ కోర్టులకు వెళ్లడానికి వీల్లేదని క్లాజ్ 38 చెబుతోంది. కానీ జగన్, ఆయన రోతపత్రిక మాత్రం కోర్టులకు వెళ్లవచ్చంటూ అబద్ధాలు వల్లేవేస్తున్నారు. రెండు ఎకరాల కమతం ఉన్న పేద రైతు తన భూమి వివాదం పరిష్కారం కోసం హైకోర్టు దాకా వెళ్లి పోరాటం చేయగలరా? ఇది అయ్యే పనేనా? తన మండలం, లేదా డివిజన్ కేంద్రంలో ఉండే సివిల్ కోర్టుకు వెళ్లకుండా చట్టబద్ధమైన నిషేధం తీసుకొచ్చి, కోర్టులకు వెళ్లవచ్చంటూ అబద్ధాలు చెప్పడం వారికే చెల్లింది. భూముల సర్వే పూర్తయ్యాకే టైటిలింగ్ చట్టం అమలు చేస్తామని, నోటిఫికేషన్ ఇచ్చే దాన్ని చేపడతామని సీఎం జగన్ చెబుతున్నారు. అసలు చట్టమే లేనప్పుడు ఏ పేరుతో ఏడాదిన్నరగా జగనన్న భూ హక్కు పేరిట రైతులకు శాశ్వత పట్టాలు ఇస్తున్నారు? పైగా ఆర్వోఆర్ చట్టం అమల్లో ఉండగా, దానికి విరుద్ధంగా పాస్ పుస్తకాలు ఇవ్వడం కూడా తప్పే కదా?
సజ్జల అబద్ధాల ప్రచారం
జగన్ సర్కారు ఘనకార్యాల గురించి అవాస్తవాలు ప్రచారం చేయడంలో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరితేరిపోయారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. నిద్రమత్తులో మాట్లాడారో... లేకపోతే తానేం మాట్లాడినా జనం నమ్ముతారన్న భ్రమల్లో ఉన్నారో కానీ... ఏమాత్రం పొంతన లేకుండా అబద్ధాలను వల్లెవేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం 24 రాష్ట్రాల్లో అమల్లో ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని, నీతి అయోగ్ చెప్పాకే చట్టం చేశామని నిపుణులు, మేధావులు, చివరకు అధికారులు కూడా ముక్కున వేలేసుకొనేలా నోటికొచ్చినట్లు చెప్పారు. వాస్తవం ఏమిటంటే... దేశంలోనే టైటిలింగ్ చట్టం అమల్లోకి తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు. మహారాష్ట్ర, గుజరాత్ ముసాయిదా చట్టాలు తెచ్చినా అందులోని చిక్కులకు భయపడి విరమించుకున్నాయి. నీతి అయోగ్ చెబితేనే చట్టం తెచ్చామని సజ్జల పదేపదే చెబుతున్నారు. అయితే ఏపీ సర్కారు 2019 జూలైలోనే టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. నీతి అయోగ్ మాత్రం 2019 డిసెంబరులో దీనిపై సిఫారసు చేసింది. కళ్లముందే అన్ని వాస్తవాలు కనిపిస్తున్నా, తము చెప్పే అబద్ధాలనే జనం నమ్ముతారని సజ్జల నమ్మకం కాబోలు!