Share News

టీడీపీ జెండాను రెపరెపలాడిద్దాం!

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:40 AM

తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లేది కార్యకర్తలేనని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

టీడీపీ జెండాను రెపరెపలాడిద్దాం!

తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్లేది కార్యకర్తలే: నారా భువనేశ్వరి

కడప, నంద్యాల జిల్లాల్లో ‘నిజం గెలవాలి’ యాత్ర

కర్నూలు(ఆంధ్రజ్యోతి), బేతంచెర్ల, ప్రొద్దుటూరు టౌన్‌, ఏప్రిల్‌ 4: తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లేది కార్యకర్తలేనని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అడ్డు వచ్చేవారిని తొక్కుకుంటూ ముందుకు వెళదామని, టీడీపీ జెండాను రెపరెపలాడిద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర గురువారం వైఎస్సార్‌ కడప, నంద్యాల జిల్లాల్లో కొనసాగింది. కడప నగరం చెమ్మూమియాపేటలో గుండెపోటుతో మృతిచెందిన టీడీపీ కార్యకర్త చెండ్రాయుడు, ప్రొద్దుటూరులోని పెద్దశెట్టిపల్లె 1వ వార్డు సభ్యురాలు కూరపాటి రాధా, నంద్యాల జిల్లా బేతంచెర్ల్ల మండలం హెచ్‌.కొట్టాల గ్రామంలో టీడీపీ కార్యకర్త పువ్వాడి నాగేశ్వరరావు, ఇదే మండలంలోని గోరుమానుకొండ గ్రామానికి చెందిన తెలుగుబాల తుపాకుల వెంకటేశ్వర్లు, పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన బోనిగెణి శివరాముడు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. వారిని భువనేశ్వరి ఓదార్చి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ పార్టీకోసం, మన భవిష్యత్తుకోసం కార్యకర్తలు ముందుకు వచ్చి పోరాడాలన్నారు. చంద్రబాబు ఎప్పుడూ కార్యకర్తల గురించే ఆలోచిస్తారని చెప్పారు. వైసీపీ అరాచకానికి రాష్ట్ర వ్యాప్తంగా 256 మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారని, వారి త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 03:40 AM