Share News

ఆడేద్దాం.. కార్యకర్తలతో..!

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:12 AM

నాలుగున్నరేళ్ల పాటు క్రీడలను గాలికి వదిలేసిన జగన్‌ ప్రభుత్వం, ఇప్పుడు ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ హడావిడి చేస్తోంది.

ఆడేద్దాం.. కార్యకర్తలతో..!

ఎన్నికల కోసమే ‘ఆడుదాం ఆంధ్రా’

నేడు విశాఖలో ముగింపు వేడుకలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నాలుగున్నరేళ్ల పాటు క్రీడలను గాలికి వదిలేసిన జగన్‌ ప్రభుత్వం, ఇప్పుడు ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ హడావిడి చేస్తోంది. నిర్వహించే క్రీడలైనా క్రీడాకారులతో ఉంటున్నాయా అంటే.. అదీ లేదు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ.... వైసీపీ అభిమానులు, కార్యకర్తలతోనే మొత్తం కార్యక్రమాన్ని నింపేశారు. క్రీడలు జరిగే ప్రదేశాల్లో ఎక్కడ చూసినా జగన్‌ బొమ్మలు, కొన్నిచోట్ల వైసీపీ రంగులు కనిపిస్తున్నాయి. పైగా ఆటల్లో ఓడిపోయిన వారిని గెలిపిస్తున్నారు... గెలిచిన వారిని ఓడిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. క్రీడాకారులకు కనీస సౌకర్యాలు లేవు. సరైన భోజన, వసతి కల్పనలో క్రీడాశాఖ విఫలమైంది. ఇదంతా చూసినవారు, కేవలం ఎన్నికల ప్రచారం కోసమే ‘ఆడిస్తున్నారు’ అని పెదవి విరుస్తున్నారు. నేడు విశాఖపట్నంలో ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ లోటుపాట్లన్నీ చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి, జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడా బడ్జెట్‌ను తగ్గించేసింది. గత ఐదేళ్లలో కనీసం రూ.500 కోట్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు క్రీడల కోసం తామేదో కష్టపడిపోతున్నట్లు కలరింగ్‌ ఇస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం చాలావరకూ స్పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హైదరాబాద్‌కే పరిమితమైంది. నవ్యాంధ్రలో క్రీడా మైదానాల అభివృద్ధి, కోచ్‌ల నియామకాలు, క్రీడారంగ సౌకర్యాల కల్పనను గాలికి వదిలేశారు. కానీ ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట రూ.45కోట్ల నుంచి 50కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఒకవైపు కేంద్రం ఇస్తున్న నిధులకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వడం లేదు.

కానీ, ఈ కార్యక్రమానికి రూ.కోట్లు గుమ్మరిస్తున్నారు. ఈ నిధులను కొన్ని స్టేడియాలకు కేటాయించి ఉంటే క్రీడాకారులకు ఉపయోగపడేవి. క్రీడా సంఘాలకు ఇవ్వాల్సిన గ్రాంట్లు, ఒలింపిక్‌ అసోసియేషన్‌కు ఇవ్వాల్సిన బకాయిలు, గత ఏడాది గుజరాత్‌ జాతీయ క్రీడల్లో సత్తాచాటిన ప్లేయర్లకు ఇవ్వాల్సిన నగదు ప్రోత్సాహకాల వైపు స్పోర్ట్స్‌ అఽథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(శాప్‌) కన్నెత్తి కూడా చూడటం లేదు. అన్ని నియోజకవర్గాలకు కనీసం కోచ్‌లు ఉన్నారో లేదో సీఎం జగన్‌, క్రీడా మంత్రి రోజా, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డికి తెలుసా అని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గానికి కనీసం ఐదు క్రీడాంశాల్లో కోచ్‌లను తీసుకోవాలని కోరుతున్నారు. శాప్‌లో కోచ్‌ల కొరత తీవ్రంగా ఉంది. అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పిన జగన్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారు. శాప్‌లోని కాంట్రాక్టు కోచ్‌లను రెగ్యులరైజ్‌ చేసే ప్రయత్నమే చేయడం లేదు. రాష్ట్రంలో క్రీడారంగం అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రైజ్‌ మనీ కూడా రూ.లక్షల్లో పెట్టి, వైసీపీ కార్యకర్తలకు, సిఫారసులు ఉన్నవారికి ఇచ్చుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. యువత ఓట్ల కోసమే ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ ప్రభుత్వం సరికొత్త ఆట ఆడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, నేడు విశాఖలో ఆడుదాం ఆంధ్ర రాష్ట్రస్థాయి ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో సీఎం జగన్‌ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి భారీఎత్తున వైసీపీ శ్రేణులను తరలించనున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 02:12 AM