కొత్త ప్రభుత్వం కొలువుదీరేలోగా సర్దేద్దాం!
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:01 AM
ఎన్నికల కోడ్ ముగియడంతో కొత్త ప్రభుత్వం వచ్చేలోపు అక్రమ పదోన్నతులు చేపట్టేందుకు ఇంటర్ విద్యాశాఖ సిద్ధమైంది.

ఇంటర్ విద్యాశాఖలో అక్రమ పదోన్నతులు
సీనియారిటీ జాబితా లేకుండా డీపీసీకి సిద్ధం
ఓ అధికారి కోసం అడ్డగోలు ప్రక్రియ
అమరావతి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోడ్ ముగియడంతో కొత్త ప్రభుత్వం వచ్చేలోపు అక్రమ పదోన్నతులు చేపట్టేందుకు ఇంటర్ విద్యాశాఖ సిద్ధమైంది. సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు పదోన్నతి కల్పించే విషయంలో ఆగమేఘాలపై ఫైలు ముందుకు కదిపింది. నిబంధనల ప్రకారం తుది సీనియారిటీ జాబితా విడుదల చేశాకే డీపీసీ నిర్వహించాలి. కానీ కేవలం తాత్కాలిక సీనియారిటీ జాబితాను ఆధారంగా చేసుకుని నేడు డీపీసీ నిర్వహించేందుకు అధికారులు ఫైలు పెట్టారు. అయితే ఇదంతా ఇంటర్ విద్య కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఒక్క సూపరింటెండెంట్ కోసం చేస్తున్నారు. ఆ ఒక్క అధికారికి పదోన్నతి ఇవ్వడం కోసం మొత్తం ఉన్నతాధికారులను ఒప్పించి డీపీసీ నిర్వహిస్తుండటం వివాదాస్పదంగా మారింది. సాధారణ తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేసిన తర్వాత దానిపై సంబంధిత అధికారులు అప్పీళ్లకు వెళ్తారు. ఏవైనా సర్వీసు రెగ్యులరైజేషన్ అంశాలు, ఇతరత్రా అభ్యంతరాలుంటే వాటిని పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. ఎలాంటి వివాదాలూ లేవనుకున్న తర్వాతే డీపీసీ నిర్వహిస్తారు. ఇప్పుడు కేవలం ఒక్క అధికారి కోసం నిబంధనలు తుంగలో తొక్కారు. కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ బదిలీలు, పదోన్నతులు నిర్వహించొద్దని అన్ని శాఖలు ఆదేశాలు జారీచేశాయి. కానీ ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వం వచ్చేలోపే పదోన్నతులు ఇచ్చేయాలని ఈ ప్రక్రియను ప్రారంభించింది.