డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:08 AM
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదామని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పిలుపునిచ్చారు.

తాత్కాలిక ఉపశమనం... భవిష్యత్తు అంధకారం
ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
ఆదోని, జూన్ 26: డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదామని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పిలుపునిచ్చారు. బుధవారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ హాల్ నందు సెబ్, లాండ్ అండ్ ఆర్డర్ పోలీసుల వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన జరిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ తాత్కాలిక ఉపశమనం కోసం భవిష్యత్తు అంధకారం చేసుకోకూడదని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు, దుష్ప్రభావాలు, వాటిని అక్రమంగా రవాణా చేయడం వల్ల ఎదురయ్యే చట్టపరమైన చిక్కులపై అవగాహన కల్పించారు. ఎక్కడైన మత్తు పదార్థాలు వాడకం జరుగుతున్నట్లయితే సమాచారం తెలియజేస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విద్యార్థులకు మాదకద్రవ్యాల వ్యతిరేకంపై ప్రతిజ్ఞ చేయించి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి జిమ్ సెంటర్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రైనీ డీఎస్పీ ధీరజ్, ప్రిన్సిపాల్ మురళీ మోహన్, సెబ్ సీఐ విన్నిలత, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్, తేజ మూర్తి, నిరంజన్ రెడ్డి, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
గోనెగండ్ల : మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలో సీఐ రామకృష్ణయ్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. మారక ద్రవ్యాల సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీల్ నెం 14500 కు సమాచారం ఇవ్వాలని కోరారు.
పత్తికొండలో విద్యార్థుల ప్రదర్శన
పత్తికొండ : మత్తుతో జీవితాలు చిత్తవుతాయని పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు.ఇంటర్‌నేషనల్ యాంటీడ్రగ్‌డే సందర్భంగా పత్తికొండలో సెబ్, పోలీస్ ఆధ్వర్యంలో అవగాహనార్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లో విధ్యార్థులకు యాంటీడ్రగ్‌డేపై డీఎస్పీ వివరించారు. అనంతరం సెబ్ సీఐ సువర్ణలత ఆధ్వర్యంలో జూనియర్‌కళాశాల, హైస్కూల్ విద్యార్థులతో కలసి తేరుబజార్‌వరకు ర్యాలీనిర్వహించి మానవహారం ఏర్పాటుచేశారు. సీఐ మురళీమోహన్ విద్యార్థులతో మత్తుమందులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞచేయించారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, జూనియర్‌కళాశాల ప్రిన్సిపాల్ వీరేషప్ప, హైస్కూల్ హెచ్‌ఎం మాలతి, పీడీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కోసిగి : కోసిగిలో డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి సెబ్ సీఐ మహబూబ్ బాషా, ఎస్‌ఐ సతీష్ కుమార్, రమేష్‌బాబు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాల్మీకి సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
హొళగుంద : మాదక ద్రవ్యాలకు అలవాటు పడి విద్యార్థులు జీవితం నాశనం చేసుకోవద్దని ఎస్సై పెద్దయ్య నాయుడు బుధవారం అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాలపై అవగాహణ సదస్సు నిర్వహించారు.