దేశ నిర్మాణానికి పునరంకితం అవుదాం
ABN , Publish Date - Aug 15 , 2024 | 04:24 AM
78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వాతంత్య్ర కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులందరిని స్మరించుకునే రోజు.
ప్రజలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపు
ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి: సీఎం చంద్రబాబు
త్యాగాల పునాదులపైనే దేశ నిర్మాణం: డిప్యూటీ సీఎం పవన్
అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వాతంత్య్ర కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులందరిని స్మరించుకునే రోజు. స్వాతంత్య్ర శతాబ్ధి ఉత్సవాలు జరిగేనాటికి, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా, వికసిత్ భారత్ స్ఫూర్తితో అడుగులు వేస్తూ, దేశ నిర్మాణానికి పునరంకితం అవుతామని మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం’ అని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఈ మేరకు బుధవారం రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. గ్రామస్థాయి కార్యకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటింటా జాతీయ జెండా ఎగరాలి. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మన తెలుగు వ్యక్తి కావడం మనందరికీ గర్వకారణం’ అని అన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేస్తూ... ‘మన దేశం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు పొందటానికి జీవితాలు, ప్రాణాలు ధారపోసిన మహానుభావులందరినీ మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. మహానుభావులందరి త్యాగాల పునాదులపైనే మన దేశ నిర్మాణం సాగింది’ అన్నారు.