Share News

విభేదాలు మరచి ఐక్యంగా కష్టపడుదాం

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:41 AM

నియోజకవర్గంలో విభేదాలు, వర్గాలు పక్కన పెట్టి కలిసికట్టుగా టీడీపీ విజయానికి ఐక్యంగా కృషి చేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

 విభేదాలు మరచి ఐక్యంగా కష్టపడుదాం
తిక్కారెడ్డికి మిఠాయిలు తినిపిస్తున్న రాఘవేంద్రరెడ్డి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి

తిక్కారెడ్డిని కలిసిన టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి

ఇద్దరి మధ్య తొలగిన విభేదాలు

మంత్రాలయంలో టీడీపీ జెండా ఎగడం ఖాయం : రాఘవేంద్రరెడ్డి

మంత్రాలయం, ఏప్రిల్‌ 15: నియోజకవర్గంలో విభేదాలు, వర్గాలు పక్కన పెట్టి కలిసికట్టుగా టీడీపీ విజయానికి ఐక్యంగా కృషి చేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. సోమవారం టీడీపీ అధిష్ఠానం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా తిక్కారెడ్డి పేరు ఖరారు చేయడంతో మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, తన సోదరుడు రామక్రిష్ణారెడ్డి, తనయుడు రాకేష్‌ రెడ్డి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రాలయం టీడీపీ కార్యాలయంలో నాలుగు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికి శాలువ, పూలమాలలతో సత్కరించారు. టీడీపీ ఎమ్మెల్యే రాఘవేంద్రరెడ్డి తిక్కారెడ్డికి మిఠాయిలు తినిపించి సత్కరించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తనకు మంత్రాలయం టికెట్‌ వస్తుందని ఆశించానని, కానీ బీసీ సామాజికవర్గానికి కేటాయించడంతో కొంత కార్యకర్తల్లో అసంతృప్తి వచ్చిందని అన్నారు. టీడీపీ అధిష్ఠానం మరింత బాధ్యత పెంచి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని తనను ఆదేశించిందని తెలిపారు. జిల్లాలో ఎంపీ సీట్లతో సహా టీడీపీ అభ్యర్థులందరినీ గెలిపించుకొని చంద్ర బాబుకు కానుక ఇస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలల్లో కొత్త జోష్‌ కనిపించింది. టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ తిక్కారెడ్డి రాకతో మంత్రాలయం గడ్డపై టీడీపీ జెండా ఎగురేయడం ఖాయమని స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్‌ వెంకటేశ్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు అమర్నాథ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, చెన్నబసప్ప, కోట్రేష్‌ గౌడు, అడివప్పగౌడు, విజయరామిరెడ్డి, వక్రాణి వెంకటేశ్‌, అయ్యన్న, యేబు పాల్గొన్నారు.

నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ

కోసిగి/కౌతాళం, ఏప్రిల్‌ 15: నియోజకవర్గంలో వైసీపీ నుంచి వలసలు రోజురోజుకు జోరందుకున్నాయని, ఇప్పటి వరకు నాలుగు మండలాల నుంచి దాదాపు వేయి కుటుంబాలు టీడీపీలో చేరాయని టీడీపీ మంత్రాలయం అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. కౌతాళం టీడీపీ మండల కన్వీనర్‌ ఉలిగయ్య ఆధ్వర్యంలో కోసిగి మండల పరిధిలోని పల్లెపాడు, కౌతాళం మండలం మరళి గ్రామ సర్పంచు మల్లయ్య, ఉరుకుంద గ్రామ ఎంపీటీసీ లక్ష్మితోపాటు పలు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి రాఘవేంద్రరెడ్డి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు.

బాలకృష్ణ సభను జయప్రదం చేయండి

కోసిగి, ఏప్రిల్‌ 15: కోసిగి మండల కేంద్రంలో మంగళవారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యే సభను జయప్రదం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి, సీనియర్‌ నాయకులు ఉలిగయ్య, ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి తెలిపారు. సోమవారం పల్లెపాడులో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి స్వర్ణాంధ్ర సహకార యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోసిగిలోని ఎస్‌బీఐ బ్యాంకు రోడ్డులో బాలకృష్ణ రోడ్‌షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 12:41 AM