Share News

ప్రతి పని జనానికి తెలిసేలా..

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:48 AM

గ్రామంలో అభివృద్ధి పనులు ఏమేమి జరిగాయో తెలుసుకోవాలంటే పంచాయతీ ఆఫీసుకు వెళ్లాల్సిందే. ఆ పనులకు సంబంధించి పూర్తి సమాచారం కావాలన్నా దొరకడం కష్టమే.

ప్రతి పని జనానికి తెలిసేలా..

పల్లె కూడళ్లలో ప్రగతి సమాచారం.. గ్రామ పంచాయతీల్లో సమాచార బోర్డులు ఏర్పాటు

పారదర్శక పాలన అందించే క్రమంలో ముందడుగు

ప్రతి పని వివరం గ్రామ ప్రజలందరికీ తెలియజేసేలా నిర్ణయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రామంలో అభివృద్ధి పనులు ఏమేమి జరిగాయో తెలుసుకోవాలంటే పంచాయతీ ఆఫీసుకు వెళ్లాల్సిందే. ఆ పనులకు సంబంధించి పూర్తి సమాచారం కావాలన్నా దొరకడం కష్టమే. అవకతవకలు జరిగితే ఇక ప్రశ్నించడం గగనమే. ఇప్పటి వరకూ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామాల్లో ప్రజలకు పారదర్శక పాలన అందించేలా ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి చేయాల్సిన పనులను ఆమోదించారు. గ్రామాల్లో ఏయే పనులు చేపడుతున్నారో ఆ గ్రామస్తులకు తెలియచేయాలని నిర్ణయించారు. పనుల్లో అవకతవకలు జరిగితే ప్రజలు ప్రశ్నించే విధంగా చర్యలు తీసుకున్నారు. సమర్థులైన అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించేందుకు ఇప్పటికే నిర్ణయించార ు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారుల బదిలీల విషయంలో రాజకీయ జోక్యం లేకుండా చూసి నిజాయితీ గల అధికారులను ఎంపిక చేశారు. నవంబర్‌లో నిర్వహించే ఉపాధి హామీ పథకం సిబ్బంది బదిలీల్లో సైతం రాజకీయ జోక్యం లేకుండా చూడాలని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే పనుల్లో ఎక్కడా అవినీతి లేకుండా చేయాలని గట్టి పట్టుదలతో అధికారులు ఉన్నారు. అందులో భాగంగా గ్రామాల్లో చేపట్టే ప్రతి పని ఆయా గ్రామస్తులకు తెలిసేలా సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 14 నుంచే ఆ పని ప్రారంభించనున్నారు. ప్రజా ప్రతినిధులు ప్రారంభించే సిమెంట్‌రోడ్ల పనులపై సంపూర్ణ సమాచారం ప్రజలకు తెలిసేలా చేయాలని భావిస్తున్నారు.

వైసీపీ హయాంలో గోప్యంగా..

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సమాచార బోర్డులు ఉన్నాయి. అయితే వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత వాటిని గాలికి వదిలేశారు. గత సర్కార్‌ హయాంలో గ్రామంలో ఏం పనులు జరుగుతున్నాయన్న విషయం కూడా ప్రజలకు తెలియనీయకుండా గోప్యంగా ఉంచారు. అయితే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేసేలా పారదర్శకంగా గ్రామ పాలన ఉండాలని ఉపముఖ్యమంత్రి యోచిస్తున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి నిధుల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచేందుకు వెబ్‌సైట్‌ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఆయా గ్రామ పంచాయతీల్లో చేపట్టే పనుల వివరాలన్నీ ఆ వెబ్‌సైట్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలడిగే పరిస్థితి లేకుండా చూడాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏమేం చేయనున్నారు..

ప్రతి పల్లె కూడలిలో రంగులతో గోడపై గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉపాధి పనుల వివరాలను రాయించాలని నిర్ణయించారు.

ఆయా పంచాయతీల్లో ఆ ఏడాదికి సంబంధించి చేపడుతున్న పనుల వివరాలు పెయింట్లతో రాస్తారు.

గ్రామాల్లో ఎన్ని ఉపాధి హామీ జాబ్‌కార్డులున్నాయి?, మినీ గోకులాల పనులు, పండ్లతోటల పెంపకం, పంటకాలువల పునరుద్ధరణ, సిమెంట్‌రోడ్ల పనుల వివరాలు, ఎన్ని పనులు ఎంత అంచనాతో చేపడుతున్నారన్న వివరాలు, గ్రామంలో తవ్వుతున్న ఫారంపాండ్లు వివరాలను గోడలపై పెయింట్లతో రాస్తారు.

అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారం తెలిసేలా ఏర్పాటు చేసే ఈ బోర్డులతో గ్రామ ప్రజలకు పూర్తి అవగాహన కలుగుతుంది.

Updated Date - Oct 21 , 2024 | 03:48 AM