Share News

పాత తేదీలతో పట్టాలివ్వండి!

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:14 AM

నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలిచ్చామని, ఇవ్వలేదని ప్రతిపక్షాలు నిరూపించినా, ఏ ఒక్క లబ్ధిదారు అడిగినా తాను ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే కొడాలి నాని బీరాలు పలికారు.

పాత తేదీలతో పట్టాలివ్వండి!

ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి హైడ్రామా

ఇన్నాళ్లూ పట్టాలు ఎందుకివ్వలేదని జనం నిలదీయడంతో ఆర్డీవోకు నాని ఫోన్‌.. జనం మధ్యలో స్పీకర్‌ ఆన్‌ చేసి ఆదేశాలు

కోడ్‌ కారణంగా కుదరదన్న ఆర్డీవో

గుడివాడ, ఏప్రిల్‌ 3 : నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలిచ్చామని, ఇవ్వలేదని ప్రతిపక్షాలు నిరూపించినా, ఏ ఒక్క లబ్ధిదారు అడిగినా తాను ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే కొడాలి నాని బీరాలు పలికారు. అయితే ఆయన సవాల్‌ విసిరి 48 గంటలు గడవకముందే నియోజకవర్గ ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు పాత తేదీలతో పట్టాలు ఇవ్వాలని ఆర్డీవోకు ఫోన్‌లో స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడుతూ దొరికిపోయిన వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక గుడ్‌మెన్‌పేటలో మంగళవారం రాత్రి పర్యటించిన కొడాలి నానికి నిరసన ఎదురైంది. ఇళ్ల పట్టాల కోసం రెవెన్యూ కార్యాలయాలు, వైసీపీ నాయకుల ఇళ్లచుట్టూ తిరుగుతున్నామని స్థానిక మహిళలు నిలదీశారు. తమకు అర్హత ఉన్నా ఇళ్ల పట్టాలు ఎందుకి వ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొడాలి నీళ్లు నమిలారు. వెంటనే ఆర్డీవో పద్మావతికి ఫోన్‌ చేసి స్పీకర్‌ ఆన్‌ చేసి ఇళ్ల పట్టాలు, లేఅవుట్‌ చేయకపోవడంపై ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని ఆర్డీవో సమాధానమిచ్చారు. పాత తేదీలు వేసి వెంటనే పట్టాలను పంపిణీ చేయాలని కొడాలి హుకుం జారీ చేశారు. దాంతో ఆర్డీవో సమాధానం చెప్పటేక వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడతానని కాల్‌ కట్‌చేసి తప్పించుకున్నారు. తదనంతరం కొడాలి మహిళలతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో అందరికీ పట్టాలు వచ్చేలా చూస్తానని హామీ యిచ్చారు. అయినా సంతృప్తి చెందని స్థానిక మహిళలు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని గట్టిగా నిలదీశారు. దాంతో కొడాలి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated Date - Apr 04 , 2024 | 08:12 AM