Share News

హౌసింగ్‌లో నకి‘లీలలు’!

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:19 AM

’నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1 నాటికి 5లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని హౌసింగ్‌ అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

హౌసింగ్‌లో నకి‘లీలలు’!

అర్హతల్లేకున్నా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, ప్రమోషన్లు

ఉన్నతాధికారులకు ఉద్యోగుల నుంచే ఫిర్యాదుల వెల్లువ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

’నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1 నాటికి 5లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని హౌసింగ్‌ అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. డిసెంబరు 1 నుంచి జనవరి 31 వరకు ‘మెగా కంప్లీషన్‌ డ్రైవ్‌’ నిర్వహించడం ద్వారా ఈ టార్గెట్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు. పనులు వేగవంతం చేయాలని నిర్దేశిస్తూ టార్గెట్లు ఇచ్చినా జిల్లాల్లో పనిచేస్తున్న అధికారుల్లో చలనం లేదు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు కల్పిస్తే ఉత్సాహంగా పనిచేస్తారన్న ఉద్దేశంతో హౌసింగ్‌ ఉన్నతాధికారులు ప్రభుత్వ అనుమతితో ప్రమోషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలోనూ, 14 జిల్లాల్లోని సబ్‌ డివిజన్లలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్న 26మందికి గత నెలలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించారు. వీరికి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు పనిచేస్తున్న జిల్లాల్లోనే పోస్టింగ్‌ ఇప్పించడానికి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ ఆ ఉత్తర్వులను నిలిపివేశారు. తర్వాత తూతూమంత్రంగా విచారణ జరిపించి ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చేశారు. నిలిపివేసిన ప్రమోషన్ల ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం హౌసింగ్‌ ఈఈలుగా కొనసాగుతున్న ఆ 26మందిలో దాదాపు సగంమంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ప్రమోషన్లు పొందారని ఫిర్యాదులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 56మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లకు.. డీఈఈలుగా పదోన్నతులు కల్పించేందుకు ఫైల్‌ సిద్ధమైంది. వీరిలోనూ ఎక్కువమంది రెగ్యులర్‌ స్ట్రీమ్‌లో ఇంజనీరింగ్‌ కోర్సులు చదవకుండా, ఎలాంటి సాంకేతిక నైపుణ్యాలు లేకుండా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఏఈలు అయిపోయారని, ఇప్పుడు వారికే డీఈఈలుగా పదోన్నతులు కల్పిస్తుండటంతో ఒరిజినల్‌ డిప్లొమా హోల్డర్లు అన్యాయమైపోతున్నారంటూ ఉన్నతాధికారులకు కొందరు సంస్థ ఉద్యోగులే ఫిర్యాదు చేశారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో సగానికిపైగా ఇంజనీర్లు నకిలీ ఐటీఐ, డిప్లొమా సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించినట్లు ఆరోపిస్తున్నారు.

అవినీతిమయంగా పరిపాలన విభాగం

గృహ నిర్మాణ సంస్థలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానాన్ని ప్రభుత్వం నిలిపివేయడంతో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలోనే నియామకాలు చేపడుతున్నారు. తగిన విద్యార్హతలు లేనివారిని కూడా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల సిఫారసులతో హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఎన్‌ఎంఆర్‌లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు తదితర కిందిస్థాయి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. ఇలా చేరినవారిలో ఎక్కువమంది కొంతకాలం పనిచేసి కాస్త అనుభవం సంపాదించిన తర్వాత ఐటీఐ, సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్సులు పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి, రెగ్యులర్‌ ఉద్యోగులైపోతున్నారు. ఆ తర్వాత అడ్డదారుల్లో పదోన్నతులు పొందుతున్నారు. ఇలాంటివారికి హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల 26మంది డీఈఈలకు.. ఈఈలుగా ప్రమోషన్లు కల్పించడంలో ఒక యూనియన్‌ నాయకుడు రింగ్‌మాస్టర్‌గా వ్యవహరించి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. సంస్థలో 30ఏళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసుకుని ఒక్క ప్రమోషన్‌కు కూడా నోచుకోనివారు ఎంతోమంది ఉన్నారని చెబుతున్నారు. ఫేక్‌ సర్టిఫికెట్ల వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

చిత్తూరు జిల్లా గుడుపల్లె వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఆ మండల ఇన్‌చార్జి ఏఈగా పోస్టింగ్‌ ఇచ్చేందుకు హౌసింగ్‌ అధికారులు ఈ ఏడాది మే నెలలో అవకాశం కల్పించారు. ఆయనకు తగిన అర్హతలు లేకపోవడంతో అప్పటికప్పుడు నకిలీ సర్టిఫికెట్లు పుట్టించుకుని దరఖాస్తు చేసుకున్నారు. ఆ సర్టిఫికెట్ల నిర్ధారణ కోసం సదరు విద్యాసంస్థకు రిఫర్‌ చేస్తే అవి నకిలీవని తేలింది. దాంతో ఆయనకు మండల ఇన్‌చార్జి పోస్టు ఇవ్వడం ఆపేశారు. ఇదే జిల్లాలో అప్పటికే 13మందికి పైగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందారని, వారినుంచి జిల్లాస్థాయి అధికారులు రూ.లక్షల్లో ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఉదంతాలు ప్రతి జిల్లాలోనూ ఉన్నాయని సంస్థ ఉద్యోగులే చెబుతున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 07:11 AM