ఆవును తప్పించబోయి అనంతలోకాలకు..
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:01 AM
కుమారుడిని తాడిగడప వందడుగుల రోడ్డులోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో వదిలిపెట్టేందుకు కారులో బయలుదేరిన ఎస్‌బీఐ మేనేజర్ అకస్మాత్తుగా అడ్డొచ్చిన ఆవును తప్పించబోయి ఆవును, వందడుగుల రోడ్డును దాటుతున్న మరో వ్యక్తి స్కూటీని ఢీకొన్నారు. అనంతరం కారు అదుపు తప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎస్‌బీఐ మేనేజర్‌తో పాటు స్కూటీపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆవు అక్కడికక్కడే కన్నుమూసింది. కారులో ఉన్న విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం ఉదయం స్థానిక పంట కాల్వ రోడ్డులోని కొత్త వంతెన దిగువన జరిగిన ఈ ప్రమాదం స్థానికులను కలచివేసింది.

అడ్డొచ్చిన ఆవు కూడా అక్కడికక్కడే కన్నుమూత
ప్రాణాలతో బయటపడ్డ విద్యార్థి
మృతుల్లో ఒకరు ఎస్‌బీఐ మేనేజర్, మరొకరు సనతనగర్‌వాసిగా గుర్తింపు
కళాశాలలో కుమారుడిని వదిలిపెట్టేందుకు వస్తుండగా ఘటన
పెనమలూరు, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి): కుమారుడిని తాడిగడప వందడుగుల రోడ్డులోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో వదిలిపెట్టేందుకు కారులో బయలుదేరిన ఎస్‌బీఐ మేనేజర్ అకస్మాత్తుగా అడ్డొచ్చిన ఆవును తప్పించబోయి ఆవును, వందడుగుల రోడ్డును దాటుతున్న మరో వ్యక్తి స్కూటీని ఢీకొన్నారు. అనంతరం కారు అదుపు తప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎస్‌బీఐ మేనేజర్‌తో పాటు స్కూటీపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆవు అక్కడికక్కడే కన్నుమూసింది. కారులో ఉన్న విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం ఉదయం స్థానిక పంట కాల్వ రోడ్డులోని కొత్త వంతెన దిగువన జరిగిన ఈ ప్రమాదం స్థానికులను కలచివేసింది. పోలీసులు తెలిపిన వివరాలు... గుంటూరులోని ఎస్‌బీఐలో మేనేజరుగా పనిచేస్తున్న రషీద్(50) నరసరావుపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భార్యతో కలిసి పటమట పండరీపురంలో నివాసముంటున్నారు. కుమారుడు షకీర్ హసన రషీద్ చదువుతున్న కళాశాలకు దగ్గర్లో ఉంటూ ఇంటి వద్ద నుంచి రోజూ కుమారుడిని వందడుగుల రోడ్డులోని ఒక జూనియర్ కళాశాల వద్ద తండ్రి రషీద్ వదిలిపెట్టి గుంటూరు వెళుతుండే వారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కుమారుడిని కళాశాల వద్ద వదిలిపెట్టేందుకు కారులో వందడుగుల రోడ్డువైపు రషీద్ బయలుదేరారు. పంట కాల్వ రోడ్డులోని సిద్దార్థ వంతెన దిగువకు వెళుతుండగా, దారిలో అకస్మాత్తుగా కారుకు అడ్డంగా ఒక ఆవు వచ్చింది. వెంటనే రషీద్ ఆవును తప్పించే క్రమంలో ఆవును, అదే రోడ్డులో వందడుగుల రోడ్డు దాటేందుకు స్కూటీపై వెళుతున్న సనతనగర్‌కు చెందిన షేక్ రహీం(58)ను ఢీకొన్నారు. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. కారులో ఇరుక్కున్న రషీద్‌కు, కారు ఢీకొని షేక్ రహీంకు బలమైన గాయాలు అయ్యాయి. రషీద్, రహీంలను ట్రాఫిక్ సీఐ వెంకట్ నేతృత్వంలో సిబ్బంది దగ్గర్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. రషీద్ కుమారుడు షకీర్ హసనకు స్వల్పగాయాలయ్యాయి. కారు బలంగా ఢీకొనడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు, పెనమలూరు పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రించారు. దీనిపై కేసు నమోదు చేశారు.