Share News

నిందితులను వదిలి మీడియాపై కేసులా..!

ABN , Publish Date - May 21 , 2024 | 02:58 AM

ఎన్నికల అనంతరం జరిగిన హింసలో పోలీసుల పాత్రను వెల్లడి చేసిన మీడియాపై విశాఖలో పోలీసులు కేసులు నమోదు చేసి భయపెడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

నిందితులను వదిలి మీడియాపై కేసులా..!

తప్పుదారి పట్టించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల కమిషన్‌కు అచ్చెన్నాయుడు లేఖ

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): ఎన్నికల అనంతరం జరిగిన హింసలో పోలీసుల పాత్రను వెల్లడి చేసిన మీడియాపై విశాఖలో పోలీసులు కేసులు నమోదు చేసి భయపెడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతల దాడి చేసిన ఘటనను లేఖలో పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఘటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. మీడియాపై కేసులు ఎత్తేసి, కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖలో బాధితుల గళం వినిపించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి జర్నలిస్టులతో పాటు బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు పైనా కేసులు నమోదు చేశారన్నారు. ఇదే అంశంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసు శాఖలో జే బ్రాండ్‌గా ముద్ర వేయించుకొన్న కొందరు అధికారుల అరాచకం పరాకాష్ఠకు చేరిన తీరుకు మీడియాపై కేసుల నమోదు ఒక నిదర్శనంగా నిలిచిందని మండిపడ్డారు.

మీడియాపై కేసులు అప్రజాస్వామికం: నాదెండ్ల మనోహర్‌

బాధితులెవరైనా, బాధించేది ఎవరైనా దాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియచేయడం మీడియా బాధ్యతని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మీడియాపై కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ‘బాధితులు చేసిన ఆరోపణలు మీడియాలో ప్రసారం చేయడాన్ని నేరంగా పరిగణించడం అప్రజాస్వామికమం. మీడియా నియంత్రణకు జీవో నంబర్‌ 1 తీసుకువచ్చారు. బాధితులతో కలసి ప్రెస్‌మీట్‌ నిర్వహించినందుకు విశాఖ నార్త్‌ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుపైనా కేసు నమోదు చేయడం చూస్తే ఈ కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అర్థమవుతుంది’ అని మనోహర్‌ అన్నారు.

Updated Date - May 21 , 2024 | 07:17 AM