Share News

‘లాండ్‌ టైటిలింగ్‌’ సెగలు!

ABN , Publish Date - May 03 , 2024 | 04:29 AM

వైసీపీ ప్రభుత్వం తెచ్చిన లాండ్‌ టైటిలింగ్‌ చట్టం సెగలు రేపుతోంది. ఈ చట్టంపై ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ సమరం నడుస్తోంది.

‘లాండ్‌ టైటిలింగ్‌’ సెగలు!

అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ సమరం

ప్రజల్లో వ్యతిరేకతతో ఆత్మరక్షణలో వైసీపీ నేతలు

ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారడంతో తిప్పలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వం తెచ్చిన లాండ్‌ టైటిలింగ్‌ చట్టం సెగలు రేపుతోంది. ఈ చట్టంపై ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ సమరం నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతుండటంతో వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. వ్యతిరేకతను తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. లాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం చాలాకాలం క్రితమే తెచ్చినా అందులోని కీలక అంశాలను మీడియా ప్రముఖంగా లేవనెత్తడం, ప్రతిపక్షాలు వాటిని విస్తృతంగా ప్రచారంలోకి తేవడంతో అది ప్రస్తుతం ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రచార సభల్లో దీనిని ప్రముఖంగా లేవనెత్తుతున్నారు. ఈ చట్టంలో ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను వివరిస్తూ, ఇటువంటి చట్టాన్ని, దీనిని తెచ్చిన వైసీపీని సమర్థిస్తారా? అని ప్రశ్నలు వేస్తూ సభికుల నుంచి సమాధానం రాబడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ఆయన బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఈ చట్టంలోని కొన్ని అంశాలను ప్రతిపక్షాలు బలంగా లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ భూమికి సంబంధించిన ప్రతి ఆస్తిని టైటిలింగ్‌ అధికారి వద్ద నమోదు చేయించాలని, దానిపై మరెవరైనా హక్కు కోరితే ఆ ఆస్తిని వివాద రిజిస్టర్‌లో చేరుస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఆస్తిని తనఖా పెట్టినా, దానిపై బ్యాంకు రుణం తీసుకొన్నా ప్రభుత్వానికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని, ఏ చిన్న అంశం తెలపకపోయినా జైలుశిక్ష తప్పదని మరో క్లాజ్‌ పేర్కొంటోంది. ఈ అంశాలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ప్రజల ఆస్తులపై వివాదాలు రేకెత్తడానికి ఈ చట్టం దోహదం చేస్తుందని, ఏదో ఒక వివాదాన్ని అధికార పార్టీ నేతలు కావాలని రేకెత్తించి తర్వాత సొమ్ము చేసుకొనే ప్రయత్నం చేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల భూములు లాక్కోవడానికే ఇటువంటి చట్టం తెచ్చారని, ఇది లాండ్‌ గ్రాబింగ్‌ చట్టమని మండిపడుతున్నాయి. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా చట్టమే తెచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటం అధికార పార్టీకి ఇబ్బందికరంగా తయారైంది.

తాను భూములు పంచేవాడినే తప్ప కొట్టేసేవాడిని కానని ప్రచార సభలో సీఎం జగన్‌ స్వయంగా వివరణ ఇచ్చారు. ఈ చట్టం నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన అనేక నిర్ణయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. టైటిల్‌ చట్టం అమల్లో భాగంగా రైతులకు ఇస్తున్న పాస్‌పుస్తకాల నిండా జగన్‌ బొమ్మలు ప్రచురిస్తుండటం కూడా ఈ సమయంలో చర్చనీయాంశంగా మారింది. వారసత్వంగా వచ్చిన భూములకు సంబంధించిన పాస్‌ పుస్తకాలపై రైతుల ఫొటోలు ఉండాలి తప్ప సీఎం ఫొటో ఎందుకని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఒక రైతు ఏకంగా సీఎం సతీమణిని దీనిపై నిలదీశారు. ఒక సభలో రైతు పాస్‌పుస్తకాన్ని చించివేస్తున్న దృశ్యం వైరల్‌గా మారింది. అలాగే భూముల రిజిస్ట్రేషన్‌ తర్వాత అసలు పత్రాలు ఇవ్వకుండా, కేవలం జిరాక్స్‌ డాక్యుమెంట్లే ఇస్తారన్న అంశం వెలుగులోకి వచ్చింది. దీనిపై రైతులు, సామాన్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భూముల సర్వే సందర్భంగా గ్రామాల్లో కొత్తగా వేస్తున్న సర్వే రాళ్లపై సీఎం పేరు ఉండటంపైనా విమర్శలొస్తున్నాయి. ఈ అంశాలన్నీ ఒకేసారి తెరపైకి రావడంతో అధికారపార్టీ సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ అంశంలోని తీవ్రతను గుర్తించి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో ఒకసారి వివరణ ఇప్పించింది. రైతులు కంగారుపడాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులతో చెప్పించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వంపై నమ్మకం తగ్గడంతో ప్రతిపక్షాలు చెబుతున్న అంశాలను రైతులు పట్టించుకొంటున్నారని, దీనితో అధికార పార్టీకి వ్యతిరేక సెగలు తగులుతున్నాయని రెవెన్యూ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Updated Date - May 03 , 2024 | 07:02 AM