Share News

ల్యాండ్‌ టైటిల్‌.. రద్దుకు సిద్ధం!

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:59 AM

రైతు కంటకమైన భూమి యాజమాన్యపు హక్కు (ల్యాండ్‌ టైటిల్‌) చట్టం-2023 రద్దయ్యే సమయం ఆసన్నమైంది.! రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయనుంది.

ల్యాండ్‌ టైటిల్‌..  రద్దుకు సిద్ధం!

దీనిపైనే చంద్రబాబు రెండో సంతకం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రైతు కంటకమైన భూమి యాజమాన్యపు హక్కు (ల్యాండ్‌ టైటిల్‌) చట్టం-2023 రద్దయ్యే సమయం ఆసన్నమైంది.! రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయనుంది. ఈ మేరకు రద్దు ప్రతిపాదనకు సంబంధించిన ఫైలు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నుంచి ప్రభుత్వానికి చేరింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో బాధ్యతలు తీసుకోనున్నారు. అనంతరం మెగా డీఎస్సీ ప్రకటన ప్రతిపాదనపై తొలి సంతకం చేయనున్నారు. ఆ తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు ఫైలుపై రెండో సంతకం చేయనున్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దుచేస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు హామీ మేరకు ల్యాండ్‌ టైటిల్‌ చట్టం రద్దుచేయాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌ రెవెన్యూ శాఖకు ప్రతిపాదన ఫైలు పంపించారు.

భూముల సర్వే మాటేమిటి..?

ల్యాండ్‌ టైటిల్‌ చట్టం అమలు కోసమే జగన్‌ సర్కారు భూముల సమగ్ర సర్వే చేపట్టింది. 17,360 గ్రామాలకు గాను 8 వేల గ్రామాల్లో భూముల సర్వే పూర్తిచేసినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సర్వే పేరిట మొత్తం రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌లో ఇప్పటికే రూ.600 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా కోట్ల విలువైన పరికరాలు కొంటూనే ఉన్నారు. కానీ రీ సర్వే మాత్రం ఓ పట్టాన ముందుకు సాగడం లేదు. సాంకేతికత సమకూర్చుకునే పేరిట అస్మదీయ కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారు. ఆ కంపెనీలను ఓ మాజీ సలహదారు తెరమీదకు తీసుకొచ్చారు. ఆ కంపెనీలకే టెండర్లు దక్కేలా, పనులు చేసినా, చేయకున్నా వాటికి సకాలంలో బిల్లులు చె ల్లించేలా సర్వే ఉన్నతాధికారి ఒకరు అనేక ప్రయత్నాలు చేశారు. క్షేత్రస్థాయిలో రోవర్లు, ఇతర పరికరాలు పనిచేయకున్నా డ్రోన్‌ ఇమేజ్‌లతోనే సర్వేచేసినట్లుగా రికార్డులు తయారు చేయాలని సర్వేయర్లు, ఇతర సిబ్బందిని తీవ్రంగా వేధించారు. వారు చేసేదేమీలేక హడావుడిగా రికార్డులు తయారు చేశారు. వాటి నిండా తప్పులే ఉన్నాయి. భూముల కొలతలు, సరిహద్దుల విషయంలో భారీ తేడాలున్నాయి. ప్రభుత్వం అందించిన పాస్‌పుస్తకాలపైనా రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమ భూమి పత్రాలపై జగన్‌ ఫొటోలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొందరు రైతులు ఆ పాసుపుస్తకాలను చింపివేస్తున్నారు. అడ్డగోలుగా చేసిన భూముల సర్వేను, వాటి ఆధారంగా ఇచ్చిన పాసుపుస్తకాలను కూడా రద్దుచేయాలని కోరుతున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 07:04 AM