ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువ పెంపు
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:38 AM
రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.

సగటున 15 నుంచి 20 శాతం వరకు..
గ్రోత్ సెంటర్ల ఆధారంగా ఖరారు
జగన్ జమానాలో రిజిస్ర్టేషన్లలో అరాచకం
భూమివిలువను మించిన రిజిస్ర్టేషన్ విలువ
అలాంటిచోట తగ్గిస్తాం.. చరిత్రలోనే తొలిసారి
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి
రిజిస్ర్టేషన్లు, స్టాంపుల శాఖపై సమీక్ష
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఏయే ప్రాంతాల్లో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖపై తాడేపల్లిలోని కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, అయితే రాష్ట్రానికి రెవెన్యూ కూడా అవసరమన్నారు. అందువల్లే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. గ్రోత్ కారిడార్లు, భూమి రేట్లు బాగా పెరిగిన ప్రాంతాల్లో మాత్రమే పెంపుదల ఉంటుందన్నారు. ‘‘గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల పెంపును శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్లింది. దీంతో చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉందని మా పరిశీలనలో తేలింది. అటువంటి చోట్ల రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తాం. ఇలా విలువలు తగ్గించడం చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది. విలువలు పెరిగే చోట సగటున 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుంది’’ అని మంత్రి వివరించారు.
రెవెన్యూలోనే ఫిర్యాదులు అధికం
రాష్ట్రంలో వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూశాఖలోనే వస్తుండగా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖలో 10 శాతం వరకు గ్రీవెన్స్ వస్తున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వీటన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతేడాదితో పోల్చితే గత ఆరు నెలల్లో సెప్టెంబరును మినహాయిస్తే మిగిలిన అన్ని నెలల్లోనూ అదనపు ఆదాయమే వచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పెట్టుకున్న పెట్టుకున్న రూ. 9,500 కోట్ల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదిస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ‘‘గత ప్రభుత్వంలో జగన్ తన స్వార్థం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాలను చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ మేం వారితో స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. భూ వివాదాలను పూర్తిస్థాయిలో పరిష్కరించేలా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నాం. ఇప్పటికి లక్షా 70 వేల ఫిర్యాదులు రాగా, 11 వేల ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించాం’’ అని మంత్రి తెలిపారు.
తగ్గిన ఆదాయం
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రిజిస్ర్టేషన్లు-స్టాంపుల శాఖకు ఆదాయం తగ్గింది. సమావేశంలో ఆ శాఖ అధికారులు నెలవారీ ఆదాయ గ ణాంకాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారిచ్చిన వివరాలను అనుసరించి.. గత ఆర్థిక సంవత్సరంలో శాఖకు రూ.9,546 కోట్లు ఆదాయం వచ్చింది. 21,91,770 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరుపుకొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు 26 వరకు రూ.6,156 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం తగ్గింది. నిజానికి, ఈ ఏడాది రూ. 13,500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. తొమ్మిది నెలలు పూర్తయినప్పటికీ అందులో సగం ఆదాయం కూడా సాధించలేకపోయారు. ఆగస్టు నెలలో రూ. 850 కోట్లు రాబడి వచ్చింది. సెప్టెంబరులో అతి తక్కువగా రూ. 570 కోట్లు మాత్రమే వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు రూ.6,874 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది అదే సమయంలో రూ.6,156 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది. జిల్లాల వారీగా అత్యధికంగా విశాఖ పరిధిలో రూ.1,085 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత వరుసగా విజయవాడ పరిధిలో రూ.876కోట్లు, గుంటూరు పరిధిలో రూ.829 కోట్ల ఆదాయం లభించింది. అత్యల్పంగా మన్యం పరిధిలో రూ.27.19 కోట్ల ఆదాయం వచ్చింది.