Share News

తమిళనాడుకు కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌!

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:04 AM

మేజర్‌ పోర్టులతో సమానంగా ఆపరేషన్స్‌ జరుపుతున్న నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ తమిళనాడు రాష్ట్రానికి తరలిపోతోంది.

తమిళనాడుకు కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌!

ఉపాధి కోల్పోనున్న 10 వేల కుటుంబాలు

రాష్ట్రానికి వెయ్యి కోట్ల ట్యాక్స్‌ నష్టం.. సీఎం మాట్లాడరేం?: సోమిరెడ్డి

నెల్లూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ‘మేజర్‌ పోర్టులతో సమానంగా ఆపరేషన్స్‌ జరుపుతున్న నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ తమిళనాడు రాష్ట్రానికి తరలిపోతోంది. జిల్లా ప్రజల త్యాగాలతో రాష్ట్ర అవసరాల కోసం ఏర్పాటుచేసిన పోర్టు నిర్వీర్యమైపోతోంది. ఈ నెలాఖరు తర్వాత కృష్ణపట్నం పోర్టులో జరగాల్సిన ఎగుమతులు, దిగుమతులను తమిళనాడులోని అదానీకి చెందిన కాటుపల్లి, ఎన్నూరు పోర్టులకు మారుస్తున్నారు. ఇందుకు కేంద్రం కూడా అనుమతులు ఇవ్వడం అన్యాయం’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరులోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘టెర్మినల్‌ తరలింపుతో ఏటా రాష్ట్రానికి స్టేట్‌ ట్యాక్స్‌ రూపంలో రూ.1,000కోట్లు నష్టం వాటిల్లుతుంది. సుమారు 10వేలమంది ఉపాధి కోల్పోతారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? సొంత నియోజకవర్గంలో ఇంత నష్టం జరుగుతుంటే మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏం చేస్తున్నారు..? అదానీ చాపకింద నీరులా కంటైనర్‌ టెర్మినల్‌ను తరలిస్తుంటే ఆపాల్సిన బాధ్యత సీఎం జగన్‌కు లేదా?’ అంటూ సోమిరెడ్డి మండిపడ్డారు.

Updated Date - Jan 21 , 2024 | 08:32 AM