Share News

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలి

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:28 AM

‘మహాభారత యుద్ధం 18 రోజులు నడిచింది. అర్జునుడికి కృష్ణుడు సారథిలా పనిచేశాడు.

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలి

అర్జునుడికి కృష్ణుడిలా.. జనమే బాబుకు సారథులవ్వాలి

రాష్ట్ర రాజకీయ చరిత్ర మార్చాలి.. జస్టిస్‌ గోపాలగౌడ పిలుపు

మాజీ సీఎంపై విక్రమ్‌ పూల రాసిన ‘మహాస్వాప్నికుడు’ పుస్తకావిష్కరణ

విజయవాడ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ‘మహాభారత యుద్ధం 18 రోజులు నడిచింది. అర్జునుడికి కృష్ణుడు సారథిలా పనిచేశాడు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలంతా సారథుల్లా పనిచేయాలి‘ అని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ పిలుపిచ్చారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. రైతులు, మహిళల రక్షణకు, వారి భూముల సంరక్షణకు ఇది చాలా అవసరమని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న చంద్రబాబు సభలు మహాసముద్రాన్ని తలపిస్తున్నాయని.. అయితే ఎన్నికల్లో గెలుపునకు ఇదొక్కటే సరిపోదన్నారు. ప్రజలంతా సారథుల్లా పనిచేసి రాష్ట్రంలో రాజకీయ చరిత్రను మార్చాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఐ కోడూరి వెంకట్‌ ప్రచురణకర్తగా, పాత్రికేయుడు విక్రమ్‌ పూల.. మాజీ సీఎం చంద్రబాబుపై రాసిన ‘మహా స్వాప్నికుడు’ పుస్తకావిష్కరణ ఆదివారమిక్కడ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గోపాలగౌడ తొలుత జ్యోతిప్రజ్వలన చేశారు. సదరు పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ‘రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడే రాష్ట్రానికి, దేశానికి మంచి భవిష్యత్‌ ఉంటుంది. చంద్రబాబు రాష్ట్రానికే కాకుండా.. దేశానికే మంచి రాజకీయ నాయకత్వాన్ని అందించారు. రాజకీయ మేధావి. ప్రజలు, యువకులు, రైతుల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ వంటి వారిని ప్రధానులను చేయడంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఐటీ విప్లవం వచ్చినప్పుడు దాని ఫలితాలను యువతకు అందించవచ్చని అప్పటి ప్రధాని వాజపేయికి వివరించి సైబరాబాద్‌కు శ్రీకారం చుట్టారు. ప్రపంచపటంలో సైబరాబాద్‌కు గుర్తింపు తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఈ విషయాన్ని తెలుగు ప్రజలు గుర్తుంచుకోవాలి. ఆయన దేశ రాజకీయ భవిష్యత్‌కు దిక్సూచి. కార్మికులు, మహిళల శ్రేయోభిలాషి. మహాస్వాప్నికుడు పుస్తకంలో చంద్రబాబు రాజకీయ ప్రయాణంలో ఎలాంటి కష్టాలు అనుభవించారో రచయిత విక్రమ్‌ చాలా స్పష్టంగా రాశారు. ఎస్సీలు, గిరిజనులకు సామాజిక న్యాయం ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి. అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయడానికి కృషి చేశారు. దళిత వర్గానికి చెందిన జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ను చేశారు. ఆయన మహాస్వాప్నికుడే కాదు.. ఒక మానవతావాది. ఒడిసాలో 1999లో ప్రకృతి విలయతాండం చేసినప్పుడు సరిహద్దులో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో పది రోజులు బస చేసి అక్కడ మామూలు పరిస్థితి వచ్చే వరకు విశ్రాంతి తీసుకోలేదు’ అని వివరించారు. రచయిత విక్రమ్‌ పూల మాట్లాడుతూ.. చంద్రబాబు విశ్వనరుడని చెప్పారు. ఆయనకు కులం, మతం, ప్రాంతం ఉండవన్నారు. తాను రాసిన పుస్తకాల్లో ఇది నాల్గోదని.. ‘అధినాయకుల అంతరంగాలు’, ‘ఎన్టీఆర్‌ అసెంబ్లీ ప్రసంగాలు, రాజకీయ ప్రసంగాలు’, ‘శకపురుషుడు’ సావనీర్‌ను ప్రజల ముందుకు తెచ్చామని చెప్పారు. 1997లో టీడీపీతో అనుబంధం మొదలైందని.. అప్పటి నుంచి చంద్రబాబును దగ్గరగా చూశానని తెలిపారు.

Updated Date - Feb 12 , 2024 | 02:28 AM