ఈ-ఆఫీ్‌సలో కిరికిరి!
ABN , Publish Date - May 15 , 2024 | 03:39 AM
ఎప్పుడు, ఏం చేయాలో తెలియదా... లేక, ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు చేస్తున్నారా!? ఈ ప్రశ్నకు సమాధానం ఏదైనా, జగన్ సర్కారు మరో అనుమానాస్పద నిర్ణయం తీసుకుంది.
17 నుంచి 25వ తేదీ వరకు మూసివేత
సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్, విస్తరణ పేరుతో క్లోజ్
కీలక ఫైళ్లు, డేటా మాయం చేసేందుకేనా?
చీకటి జీవోల సమాచారమూ ‘ఈ-ఆఫీ్‌స’లోనే
పోలింగ్ ముగియగానే ఆకస్మిక నిర్ణయం
ఉద్యోగ వర్గాల్లోనే అనుమానాలు
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడు, ఏం చేయాలో తెలియదా... లేక, ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు చేస్తున్నారా!? ఈ ప్రశ్నకు సమాధానం ఏదైనా, జగన్ సర్కారు మరో అనుమానాస్పద నిర్ణయం తీసుకుంది. 17వ తేదీ (శుక్రవారం) నుంచి 25వ తేదీ వరకు... ‘ఈ-ఆఫీ్‌స’ను మూసేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ- ఆఫీస్‌ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ ఆఫీస్ వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఉద్యోగుల్లోనే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల... మద్యం క్రయ విక్రయాలు, డీలింగ్స్, బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులకు సంబంధించిన ఫైళ్లను మాయం చేసినట్లు బలమైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు కిక్కురుమనడంలేదు. ఇప్పుడు... ఏకంగా ఈ-ఆఫీసునే ‘అప్‌గ్రేడ్’ పేరిట మూసేస్తున్నారు. ఎన్నికల తర్వాత, ప్రభుత్వం మారే అవకాశమున్న సమయంలో పలురకాల గిమ్మిక్కులు చేస్తుంటారు. పాత వ్యవహారాలు బయటపడకుండా.. అనుమానాస్పద, వివాదాస్పద నోట్‌ఫైళ్లను మాయం చేసే అవకాశాలను తోసిపుచ్చలేం. ఈ క్రమంలో... సరిగ్గా పోలింగ్ తర్వాత, అకస్మాత్తుగా ఈ-ఆఫీ్‌సలో సాఫ్ట్‌వేర్ మార్పులు చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తొలి నుంచీ దాపరికమే...
జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత జీవోఐఆర్ వెబ్‌సైట్‌ను పూర్తిగా మూసేశారు. 2008లోనే ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తాలూకు జీవోలన్నీ ఈ వెబ్‌సైట్‌లో పెడతారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఆ వెబ్‌సైట్లోకి వెళ్లి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తెలుసుకునే అవకాశం ఉండేది. ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయికి సంబంధించిన వివరాలూ ఇందులో ఉండేవి. అయితే... ఈ వెబ్‌సైట్ ద్వారా తమ చీకటి నిర్ణయాలు బయటకు వస్తున్నాయని భయపడి ఆ సైటు మూసేశారు. ఆ చీకటి నిర్ణయాల తాలూకు డేటా, ఫైళ్లన్నీ ఈ-ఆఫీ్‌సలో ఉంటాయి. ఏ నిర్ణయాన్ని ఎవరు, ఎలా తీసుకున్నారు, నోట్ ఫైల్‌పై ఎవరు ఏం రాశారనే సమాచారం ఇందులో ఉంటుంది. ఇప్పుడు దీనినే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్, విస్తరణ పేరిట మూసివేస్తున్నారు. ఇదే క్రమంలో.. పాలన ముసుగులో చేసిన దోపిడీకి సంబంధించిన సాక్ష్యాలను కూడా చెరిపేసే అవకాశాలను తోసిపుచ్చలేమని ఉద్యోగ వర్గాలే అనుమానిస్తున్నాయి.