Share News

కిలాడీ కేజీఎఫ్‌.. మట్టి, భూములు ఉఫ్‌!

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:19 AM

గుంటూరు జిల్లాలో అత్యంత కీలకమైన, గ్రామీణ నేపథ్యం ఉన్న ఆ నియోజకవర్గం పేరు చెబితే రాజకీయ ఉద్దండుడు ఎన్జీ రంగా ముందుగా గుర్తుకు వస్తారు.

కిలాడీ కేజీఎఫ్‌.. మట్టి, భూములు ఉఫ్‌!

ఆ ఎమ్మెల్యే అక్రమార్జనలో రోశగాడు

ఆ ప్రజాప్రతినిధి.. వైసీపీలో ఓ కీలక నేతకు స్వయానా అల్లుడు.. ఈ నాలుగున్నరేళ్లలో కోట్లకు పడగలెత్తారు. అవినీతి అనకొండగా మారారు. అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకు దన్నుగా నిలుస్తూ.. ఇష్టానుసారం దోపిడీకి తెరలేపారు. ఖాళీ జాగా కనబడితే స్వాహాకు తెగబడుతున్నారు. చివరకు దేవాలయ భూములనూ వదలడం లేదు.

గుంటూరు జిల్లాలో తెగబడిన నేత

గ్రావెల్‌ మైనింగ్‌లో వందల కోట్ల దందా

మద్యం సిండికేట్‌ నుంచి ముడుపులు

అనుయాయులతో బెల్ట్‌ షాపులు

ఆలయ భూములపైనా కన్ను

22 ఎకరాల్లో ఆటోనగర్‌ ఏర్పాటుకు యత్నం

కమర్షియల్‌ లీజ్‌ పేరుతో దక్కించుకునే ఎత్తు

అధికారులూ ఆయనకు కమీషన్లు ఇవ్వాల్సిందే

(గుంటూరు - ఆంధ్రజ్యోతి)

గుంటూరు జిల్లాలో అత్యంత కీలకమైన, గ్రామీణ నేపథ్యం ఉన్న ఆ నియోజకవర్గం పేరు చెబితే రాజకీయ ఉద్దండుడు ఎన్జీ రంగా ముందుగా గుర్తుకు వస్తారు. అలాంటి చోట 2019 ఎన్నికల్లో రెండున్నర దశాబ్దాల తర్వాత టీడీపీపై వైసీపీ విజయం సాధించింది. అక్కడ గెలిచిన ప్రజాప్రతినిధి వైసీపీ కీలక నేత అల్లుడు కావడంతో ఆయన ఆగడాలకు అంతు లేదు.

కేజీఎ్‌ఫను తలపించే అక్రమాలు..

నియోజకవర్గంలోని మరో మండలంలో ఆ ప్రజాప్రతినిధి అక్రమాలు ‘కేజీఎఫ్‌’ సినిమాను తలపించే విధంగా ఉన్నాయి. కేజీఎఫ్‌ చాప్టర్‌-3 పేరుతో ఆయన అరాచకాలు, దోపిడీ, అక్రమ మైనింగ్‌పై ప్రతిపక్షం ఏకంగా డాక్యుమెంటరీయే రూపొందించింది. ఆ మండలం అత్యంత నాణ్యమైన ఎర్ర గ్రావెల్‌కు నెలవు. దీని మైనింగ్‌ పేరుతో ఎమ్మెల్యే ఈ నాలుగున్నరేళ్లలో కనీవినీ ఎరుగని విధ్వంసం సాగించారు. అక్రమ తవ్వకాలకు ఏకంగా 700 ఎకరాల పండ్ల తోటలు కనుమరుగయ్యాయి. ప్రతిపక్షం లెక్క ప్రకారం ఎకరానికి రూ.3 కోట్ల గ్రావెల్‌ తవ్వకాలు జరిగితే.. 700 ఎకరాల్లో రూ.2 వేల కోట్ల పైబడి తవ్వకాలు జరిగాయి. ప్రైవేటు వ్యక్తులు గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టాలంటే ఆయనకు ఎకరానికి రూ.25 లక్షల చొప్పున ‘కే’ ట్యాక్స్‌ చెల్లించాల్సిందే. తొలుత ఒక మైనింగ్‌ నిర్వాహకుడితో కలిసి గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. కొన్నాళ్లకు లెక్కల్లో తేడా రావడంతో ఆ మైనింగ్‌ నిర్వాహకుడిని రకరకాలుగా వేధించారు. మైనింగ్‌ అధికారులను ఉసిగొల్పి జరిమానాలు విధించడమే కాకుండా పోలీసులతో బెదిరించి ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గుంటూరు నగరానికి అతి చేరువగా ఉన్న ఆ మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకోవడంతో భూమార్పిడికి ఎకరానికి రూ 5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. ఓ గ్రామంలో 40 ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను చేజిక్కించుకుని 60 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ సాగించడం వెనుక ప్రజాప్రతినిధి హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే. ఆ మండల కేంద్రం గుంటూరు జిల్లాలోనే మేజర్‌ పంచాయతీ. ఇక్కడ ఆయన తన సమీప బంధువైన ఉద్యోగి ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ మండలంలోని ఓ శివాలయం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయానికి అనువంశిక ధర్మకర్తలు ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టి ఆలయాన్ని అక్కడ నుంచి తరలించి పునర్నిర్మించేందుకు పెద్ద ప్రయత్నమే చేశారు. పునర్నిర్మాణ కమిటీ పేరుతో ప్రముఖ విధ్యాసంస్థ అధినేత నుంచి, పారిశ్రామికవేత్తల నుంచి ఆలయ నిర్మాణానికి ఆ ప్రజాప్రతినిధి రూ.లక్షలు వసూలు చేశారు. అనువంశిక ధర్మకర్తలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఆలయ నిర్మాణం ఆగిపోయింది. కానీ వసూలు చేసిన డబ్బు ఏమైందో దేవుడికే ఎరుక!

బార్ల సిండికేట్‌..

నియోజకవర్గ కేంద్రమైన పట్టణంలో ఆ ప్రజాప్రతినిధి మద్యం సిండికేట్‌ ఏర్పాటు చేశారు. నాలుగు బార్ల స్థానంలో రెండే పెట్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. సిండికేట్‌ నుంచి లక్షలాది రూపాయల ముడుపులతో పాటు అనధికార వాటాలను పొందారనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేయించి తన అనుయాయుల ద్వారా రోజూ వేలల్లో, నెలకు లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. పురపాలక సంఘంలో పాలకవర్గం లేకపోవడంతో ఆయన ఆడిందే ఆట, చేసిందే చట్టంలా సాగుతోంది. పురపాలక సంఘంలో ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి అధికారుల ద్వారానే డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. పట్టణంలో కాంప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరగాలంటే ఆయన అనుమతి పొందాల్సిందే. పట్టణంలో ప్రముఖ ఆలయానికి పట్టణ శివారులో కోట్లాది రూపాయల విలువైన భూములున్నాయి. వాటిపై ఆయన కన్ను పడింది. అనుకున్నదే తడవుగా ఆయన సతీమణిని పాలకమండలిలో సభ్యురాలుగా చేర్చి భూముల కైంకర్యానికి పథకం వేశారు. అనువంశిక ధర్మకర్త రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి వారసులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రధాన రహదారి జీబీసీ రోడ్డు వెంట ఉన్న 22 ఎకరాల వ్యవసాయ భూమిలో ఆటోనగర్‌ ఏర్పాటుకు తీర్మానం చేయించి ప్రభుత్వ అనుమతి కోసం పంపారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. గుట్టు రట్టవడంతో దొడ్డిదారిన కమర్షియల్‌ లీజ్‌ పేరుతో ఈ 22 ఎకరాల భూములను చేజిక్కించుకునేందుకు కొత్త పన్నాగం పన్నారు. ఆలయంలో మహా కుంభాభిషేకం చేయిస్తున్నానంటూ.. దేవదాయ శాఖ అనుమతి లేకుండా ప్రజల నుంచి సుమారు రూ.50 లక్షల దాకా వసూలు చేశారు. ప్రతిపక్షాలు తూర్పారబట్టడంతో కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకొన్నారు. పట్టణంలో ప్రధాన రహదారి జీబీసీ రోడ్డు విస్తరణ పేరుతో సరైన అనుమతులు, నిధులు లేకుండా అర్ధరాత్రి 157 భవనాలను ఎమ్మెల్యే దగ్గరుండి మరీ కూల్చివేయించారు. వాటి యజమానులకు నేటికీ పరిహారం గానీ, టీడీఆర్‌ బాండ్లు గానీ అందజేయలేదు. దీనిపై ప్రశ్నిస్తే వైసీపీ నాయకులను ఇళ్లకు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలాగే పట్టణంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ గెస్ట్‌ హౌస్‌ల మధ్య నుంచి జిల్లా పరిషత్‌కు చెందిన భూమిని రైతులకు దారి పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కట్టబెట్టారు. వారి నుంచి నగదు రూపంలో భారీగా లబ్ధి పొందారని తెలిసింది.

అధికారులు, కార్యకర్తలు హడల్‌

ఆ ప్రజాప్రతినిధి పేరు చెబితే అధికారులతో పాటు సొంత పార్టీ కార్యకర్తలు కూడా హడలిపోతున్నారు. ఆయన అరాచకాలు అక్రమాలకు తట్టుకోలేక.. ఆయనకు మళ్లీ టికెట్‌ ఇస్తే పనిచేసేది లేదంటూ కీలక నాయకులు తేల్చిచెప్పారు. ఆయన అరాచకాలపై నాయకత్వం కూడా గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.

పెదకాకాని మండలంలో..

రాజధాని అమరావతిని కలిసి ఉండే ఇంకో మండలంలో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీగంగా, భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవాలయం సాక్షిగా ఎమ్మెల్యే అక్రమాలను ఎవరినడిగినా చెబుతారు. ఈ ఆలయ మహాకుంభాభిషేకం పేరుతో దాతల నుంచి రూ.లక్షలు వసూలు చేసి ఖర్చుల లెక్కలు చెప్పలేదు. ఆలయ సిబ్బంది నియామకాల పేరుతో లేని పోస్టులు సృష్టించి వారి జీత భత్యాల కింద నెలవారీ కైంకర్యం చేస్తున్నారు. ఈ ఆలయంలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు మితిమీరాయి. గుడి క్యాంటీన్లో మాంసాహారం వండిన ఆయన అనుచరుల తీరు బట్టబయలై సంచలనంగా మారింది. ఈ మండల కేంద్రం కూడా జిల్లాలోనే మేజర్‌ కమర్షియల్‌ పంచాయతీ. దీని నిధులను బ్లీచింగ్‌, సున్నం, విధ్యుత్‌ ఉపకరణాలు కొనుగోలు, పారిశుధ్య పనుల పేరుతో దుర్వినియోగం చేశారు. కోట్లాది రూపాయల పంచాయతీ నిధులను ప్రజాప్రతినిధి దారి మళ్లించారు. ఓ గ్రామంలో 22.50 ఎకరాల దళితుల భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. సొంత బంధువు పేరుతో ఈ భూములు బదలాయించాలని చూస్తున్నారు. రెండు గ్రామాల్లో అక్రమ క్వారీ తవ్వకాలు చేపట్టి అక్కడి స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా రూ.కోట్లు దోపిడీ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

రైతులకు అన్యాయం..

ధాన్యం, మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను తన మనుషులకు కట్టబెట్టి కొనుగోళ్లలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై విమర్శలు గుప్పుమంటున్నాయి. క్వింటాల్‌కు రూ.100 నుంచి రూ.500 వరకు వసూళ్లు చేశారు. రైతులకు ప్రభుత్వం సరఫరా చేసిన గోనె సంచుల సొమ్మును కూడా దిగమింగారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, పోలీసుల పోస్టింగుల్లో చేతివాటం ప్రదర్శించడమే గాక.. పోస్టింగులు ఇప్పించినవారినుంచి నెలనెలా వసూళ్లు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కొందరు అధికారులు ఈ నియోజకవర్గంలో పనిచేయలేమంటూ వేరే ప్రాంతాలకు బదిలీ చేయించుకుని పారిపోయారు. కొందరు ఆయన దోపిడీకి సహకరించి సస్పెండయ్యారు. సహకరించని అధికారులపై ఎమ్మెల్యే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి సస్పెండ్‌ చేయించారు. చెప్పిన పని చేయని వారిని నోటికొచ్చినట్లు తిడుతుంటారు. ఆయన తీరుతో విసిగిపోయిన సొంత పార్టీ కార్యకర్తలే అఽధిష్ఠానానికి ఫిర్యాదులు పంపారు. మన్నవ గ్రామ వలంటీర్లు నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన విజయానికి పాటుపడిన వైసీపీ నాయకులు పనుల కోసం, పదవుల కోసం వెళ్తే వారి నుంచీ ముడుపులు ఆశించారని ఆయనపై విమర్శలు ఉన్నాయి.

Updated Date - Jan 05 , 2024 | 04:19 AM