అసెంబ్లీ ప్రాంగణంలో యథేచ్ఛగా ఖాకీలు
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:54 AM
శాసనమండలి, శాసన సభ సంపూర్ణంగా చైర్మన్, సభాపతి నియంత్రణలో ఉంటాయి. శాసనసభలోనికి ఎవరూ మారణాయుధాలతో ప్రవేశించకూడదు.
అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): శాసనమండలి, శాసన సభ సంపూర్ణంగా చైర్మన్, సభాపతి నియంత్రణలో ఉంటాయి. శాసనసభలోనికి ఎవరూ మారణాయుధాలతో ప్రవేశించకూడదు. పోలీసు ఉన్నతాధికారులు కూడా విధి నిర్వహణలో భాగంగా పోలీసు డ్రెస్‌లో రాకూడదన్న నిబంధన ఉంది. ఒకవేళ వచ్చినా తలపై టోపీని, చేతిలో లాఠీని, నడుముకు తగిలించిన తుపాకీని అసెంబ్లీ సిబ్బంది వద్ద ప్రత్యేకంగా డిపాజిట్ చేయాలి. అలా చేయకుండా యథేచ్ఛగా అసెంబ్లీ ప్రాంగణంలో సంచరించేందుకు నియమ నిబంధనలు అంగీకరించవు. అలా చేయడాన్ని శాసనసభను అగౌరవపరచినట్లుగా భావిస్తారు. అయితే సోమవారం కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఈ నియమ నిబంధనలను గాలికి వదిలేశారు. ఎవరు ఇచ్చిన ధైర్యమో ఏమో... కొందరు ఐపీఎస్ అధికారులు, సీఐ, ఎస్‌ఐ ర్యాంకు అధికారులు తలపై టోపీ, చేతిలో లాఠీతో అసెంబ్లీ ప్రాంగణంలో కలియతిరుగుతూ కనిపించారు. ఇది గమనించిన కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశ్చర్యపోయారు. దీనిపై చైర్మన్, సభాపతి తక్షణమే స్పందించాలని, ఖాకీలు ఆయుధాలను గేటు వద్దే వదిలేసి రావాలంటూ రూలింగ్ ఇవ్వాలని పలువురు కోరారు.