బాబూ చల్లగా ఉండండి!
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:32 AM
విజయవాడ నగరంలోని వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. ఆయనను చూసి దారి పొడవునా బాధితులు చిరునవ్వులు చిందించారు.
మీరు బాగుండాలి..మమ్మల్ని బాగా చూసుకోవాలి
సీఎంను చూసేందుకు బాధితుల్లో ఉత్సాహం
ప్రతి కూడలిలో ఆగి బాధలు విన్న చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరంలోని వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. ఆయనను చూసి దారి పొడవునా బాధితులు చిరునవ్వులు చిందించారు. నగరంలోని అత్యధిక ప్రాంతాల్లో సోమవారం చాలావరకూ వరద తగ్గిపోయింది. సాధారణ జనఙజీవనం ప్రారంభమైంది. ప్రవాహం తగ్గిన ప్రాంతాల్లో బాధితులను పరామర్శించడానికి... వారు చెప్పింది వినడానికి ఆయన పర్యటించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కనకదుర్గ ఆలయానికి సమీపంలో ఉన్న భవానీపురం నుంచి ప్రారంభమైన పర్యటన పైపుల రోడ్డు, మధురా నగర్ మీదుగా రామలింగేశ్వర్‌నగర్ వరకూ కొనసాగి సాయంత్రం ముగిసింది. ఇన్ని రోజులూ ముంపు ప్రాంతాల్లో జెసీబీ యంత్రంపై కూర్చుని ప్రయాణించిన ఆయన సోమవారం తన కార్లోనే తిరిగారు. ముంపు ప్రాంతాల్లో సీఎం స్థాయి వ్యక్తి కనిపిస్తే ప్రజలు తమ బాధలు, సమస్యలు, అధికారులపై ఫిర్యాదులతో చుట్టుముట్టడం సాధారణంగా కనిపించే దృశ్యం. కానీ చంద్రబాబు పర్యటనలో భిన్నమైన దృశ్యాలు కనిపించాయి. ప్రతి కూడలిలో ఆయనకు స్వాగతం పలకడం, జైజై బాబు అంటూ నినాదాలు చేయడం, కాన్వాయ్ వెంట పరుగులు తీయడం కనిపించింది. ఆయన కాన్వాయ్‌ను చూడగానే రోడ్ల మీద ఉండేవారు పరుగుపరుగున వస్తుండటంతో ప్రతి కూడలిలో ఆగి కొద్దిసేపు ప్రసంగించాల్సి వచ్చింది. భవానీపురం, ఊర్మిళా నగర్, కబేలా సెంటర్, డాబా కొట్లు సెంటర్... ఇలా అనేకచోట్ల ఆగి మాట్లాడారు. ఊర్మిళానగర్‌లో కొంతనీటి ప్రవాహం రోడ్డుమీద ఇంకా ఉంది. ఆ నీళ్లలోనే అనేకమంది మహిళలు కారు వద్దకు వచ్చి చంద్రబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.
తమ ఫోన్లలో ఆయనను ఫొటో తీయడానికి... వీడియో తీయడానికి అనేక మంది పోటీపడ్డారు. డాబాకొట్లు సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉండగా ‘బాబు గారూ మీ ఆరోగ్యం బాగా చూసుకోండి... మీరు చల్లగా ఉండాలి’ అని ఒక వ్యక్తి అరిచారు. దానికి ప్రతిస్పందనగా అనేకమంది అవును... అవును అంటూ కేకలు పెట్టారు. మరో వ్యక్తి ‘మీ పాలన బాగుంది బాబుగారూ’ అని అరుచుకొంటూ వెళ్ళారు. ఇదే సెంటర్‌లో ఆయన తన కారుపై నిలబడి మాట్లాడుతుండగా ట్రాక్టర్లు, బస్సులు, ఆటోల్లో వెళ్తున్నవారు ఆయనకు నమస్కారాలు పెడుతూ వెళ్లడం కనిపించింది. ఊర్మిళానగర్‌లో ఒక వ్యక్తిని బాబుగారిని ఏమైనా అడిగావా అని మీడియా ప్రతినిధులు అడిగారు. ‘ఆయన ఆరోగ్యం బాగుండాలని, నూరేళ్లు చల్లగా ఉండి మమ్మల్ని చూసుకోవాలని చెప్పి వచ్చాను’ అని అన్నారు. సహాయ కార్యక్రమాలు బాగా జరుగుతుండటం... బాధితులకు సాయం అందుతూ ఉండటం ఆయన పట్ల ఈ సానుకూలతకు కారణంగా కనిపించింది. కొందరు బాధితులతో సీఎం మాట్లాడిస్తున్నారు. ఇళ్లలో బట్టలు పూర్తిగా పాడైపోయి ఇబ్బంది పడుతున్నామని కబేలా సెంటర్లో ఒక మహిళ చెప్పారు. ఆ సమావేశం ముగిసి కార్లో కూర్చోగానే ఆయన ఎన్డీఆర్ జిల్లా కలెక్టర్ సృజనకు ఫోన్ చేసి ఆప్కో నుంచి... ఇతర సంస్థల నుంచి వస్త్రాలు పోగు చేసి స్ర్తీలకు, పురుషులకు చెరో జత ఉచితంగా పంపిణీ చేయడంపై కసరత్తు చేయాలని ఆదేశించారు.