Share News

గ్రాసం పై కర్ణాటక ఆంక్షలు

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:10 AM

జిల్లాలో ఈ ఏడాది సరైన వర్షాలు లేవు. పంటలు పండక మొలక దశలో ఎండిపోయాయి.

గ్రాసం పై కర్ణాటక ఆంక్షలు
పశుగ్రాసం ట్రాక్టర్లను సరిహద్దుల్లో అడ్డుకుంటున్న పోలీసులు

కర్ణాటక నుంచి గ్రాసం తెచ్చుకునేందుకు రైతుల అవస్థలు

సరిహద్దుల్లో అడ్డుకుంటున్న పోలీసులు

పైసలు ఇవ్వనిదే బండ్లను కదలనివ్వని వైనం

ఆదోని, ఏప్రిల్‌ 7: జిల్లాలో ఈ ఏడాది సరైన వర్షాలు లేవు. పంటలు పండక మొలక దశలో ఎండిపోయాయి. కనీసం పశువులకు గ్రాసం కూడా కరువైంది. ఎండతీవ్రత పెరగడంతో పశ్చిమ ప్రాంత పల్లెల్లో పశువులకు గ్రాసం కోసం వెళ్లి అవస్థలు పడుతున్నారు. కర్ణాటక నుంచి మన ప్రాంత రైతులకు పశుగ్రాసం ఇవ్వకుండా కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆదోని, ఆలూరు, హాలహర్వి, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆస్పరి, కోసిగి, పెద్దకడుబూరు, కౌతాళం ప్రాంతాలకు చెందిన రైతులు కర్ణాటకలోని శిరుగుప్ప, సింధనూరు ప్రాంతానికి పశుగ్రాసం కోసం ట్రాక్టర్లను తీసుకెళ్తున్నారు. అక్కడ కొంతమంది రైతులతో మన ప్రాంతానికి చెందిన రైతులు వరిగడ్డిని రూ.15వేలు నుంచి రూ.18వేల వరకు ట్రాక్టర్‌ గడ్డని కొనుగోలు చేస్తున్నారు. అష్టకష్టాలు పడి ట్రాక్టర్‌ గడ్డిని తీసుకొని సరిహద్దు ప్రాంతమైన ఇటిక్యాల చెక్‌పోస్టు వద్దకు వస్తే... అక్కడ చెక్‌పోస్టులోని కర్ణాటక పోలీసులు అడ్డుకొని రైతులను వరిగడ్డిని ఆంధ్రకు తీసుకెళ్లవద్దని వెనక్కి పంపుతున్నారు. ఆ ప్రాంత రైతులకే పశుగ్రాసం అవసరమని నిబంధనలు విధించినట్లు పోలీసులు చెబుతున్నారు. కర్ణాటక పోలీసులు, ప్రభుత్వ తీరుపై మన ప్రాంత రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం పై ఆంక్షలు విధించడం మంచిది కాదని, ఇలాంటి నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఇటిక్యాల చెక్‌పోస్ట్‌లోని కొందరు కర్ణాటక పోలీసులు చేతులు తడిపితే వదిలేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 చొప్పున మామూలు తీసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. పశువులు తినే గడ్డి పై కూడా నిబంఽధనలు విధించడంపై రైతులు మండిపడుతున్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:10 AM