Share News

కర్బూజ రైతుకు కన్నీళ్లు

ABN , Publish Date - May 27 , 2024 | 12:21 AM

ఖరీఫ్‌ సీజన వచ్చిందంటే కర్బూజ సాగు చేయడానికి రైతులు ముందంజలో వుంటారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రైతులే అధిక శాతం కర్బూజాను పండించి ఢిల్లీ, ముంబయి, బెంగళూరు మార్కెట్లకు తరలిస్తుంటారు. కళ్యాణదుర్గం ప్రాంత రైతులు కర్బూజ పండించడంలో పట్టు సాధించారు.

కర్బూజ రైతుకు కన్నీళ్లు

వాతావరణ మార్పులతో ఎదుగూబొదుగులేని పంట

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 200 ఎకరాల్లో సాగు

రూ.రెండు కోట్లకుపైగా పెట్టుబడులు

కళ్యాణదుర్గం, మే 26: ఖరీఫ్‌ సీజన వచ్చిందంటే కర్బూజ సాగు చేయడానికి రైతులు ముందంజలో వుంటారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రైతులే అధిక శాతం కర్బూజాను పండించి ఢిల్లీ, ముంబయి, బెంగళూరు మార్కెట్లకు తరలిస్తుంటారు. కళ్యాణదుర్గం ప్రాంత రైతులు కర్బూజ పండించడంలో పట్టు సాధించారు. ఈ యేడాది ముందస్తుగా వర్షాలు కురుస్తుండడంతో మంచి దిగుబడి వస్తుందన్న ఆశతో చాలా మంది రైతులు పంట సాగు చేశారు. కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం రూరల్‌ మండలాల పరిధిలో సుమారు 200 ఎకరాలకు పైగా కర్బూజ సాగు చేశారు. సుమారు రూ. రెండు కోట్లకు పైబడి పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశారు. వాతావరణ మార్పులతో పంట ఎదుగుబొదుగు లేకుండా కనిపిస్తోంది. ఎకరాకు సుమారు రూ. 1.50 లక్షలు ఖర్చుచేసి రైతులు కర్భూజ పంటను సాగు చేశారు. వాతావరణ మార్పులతో మొక్క దశలోనే ఎదగడం లేదు. ఆకుముడత, దోమకాటు ఆకులన్నీ ఎర్రగా మారిపోవడం లాంటి తెగుళ్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం విపరీతమైన వేడి, సాయంత్రమయ్యే సరికి వర్షం కురుస్తుండటంతో కర్భూజ మొక్క ఎదగడానికి ఏ మాత్రం ఆస్కారం వుండడం లేదు. ఒక్కోసారి పిచికారి చేసేందుకు రూ. 20 వేలు ఖర్చుచేసినా ఆకుముడత తెగుళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. వాతావరణ మార్పులతోనే తెగుళ్లు అధికంగా సోకుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఒక మొక్క పెద్దదిగా మరో మొక్క చిన్నదిగా ఎదుగుబొదుగూ లేకుండా కనిపిస్తున్నాయి. మొక్కదశలోనే విపరీతమైన తెగుళ్లు సోకి నష్టపోతామేమోన్న భయాందోళనలో అన్నదాతలు వున్నారు.

Updated Date - May 27 , 2024 | 12:21 AM